breaking news
The trip
-
సందేశమే ఆమె సినిమా
డ్రగ్స్‌కు అలవాటుపడి, కన్నవారికి కష్టంగా మారిన బిడ్డల్లో మార్పు తీసుకురావడానికి సందేశాత్మక చిత్రాల బాట పట్టారు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన సరళారెడ్డి. ఇటీవల ‘ది ట్రిప్’ పేరుతో గంటన్నర నిడివి గల సినిమా తీసిన ఈ గృహిణి గతంలో ‘డాక్టర్ భూమి’ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు. భర్త, కొడుకు, కోడలు ముగ్గురూ డాక్టర్లే. మరో కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు. తమ ఇంటి డాక్టర్ల వద్దకు రకరకాల సమస్యలతో వచ్చేవారిని గమనించే సరళారెడ్డి, ఆ సమస్యల నుంచి షార్ట్, ఫుల్ లెంగ్త్ మూవీస్ తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాళ్లది డాక్టర్ల ఫ్యామిలీ. నిత్యం ఎంతోమందికి వైద్యం అందించే కుటుంబం. రకరకాల వ్యక్తులు వస్తుంటారు. వాళ్ల వ్యథలు, గాథలను స్వయంగా చూసిన ఆ ఇల్లాలు చెడు మీద యుద్ధం చేయాలనుకున్నారు. యుద్ధమంటే కొట్లాట కాదు. చెడు అలవాట్ల బారిన పడి, కన్నవారికి కష్టంగా మారిన బిడ్డల్లో మార్పు తీసుకురావడానికి సందేశాత్మక చిత్రాల బాట పట్టారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన సరళారెడ్డి భర్త డాక్టర్ రాజమౌళి అక్కడే ఆస్పత్రి నిర్వహిస్తారు. కొడుకు, కోడలు, అల్లుడు ఇలా అందరూ డాక్టర్లే. మరో కొడుకు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నాడు. తమ కుటుంబం సంతోషంగా ఉంది. కాని సమాజంలో చాలా రకాల రుగ్మతలతో సతమతమవడాన్ని చూస్తున్న సరళారెడ్డి తన వంతుగా ఏదైనా చేయాలని భావించారు. సరళారెడ్డి రూపొందించిన ‘ది ట్రిప్’ సినిమా; ‘డాక్టర్ భూమి’ సినిమా డ్రగ్స్.. ది ట్రిప్ మొదటి నుంచి తనకు సాహిత్యంపై అవగాహన ఉంది. కథలు చదవడం, రాయడం అలవాటు. సినీ పరిశ్రమలో కొందరు స్నేహితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆలోచనలు సాగాయి. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే సందేశాత్మక చిత్రాలు తీయడం. ఇటీవలి కాలంలో గొప్పింటి బిడ్డలు డ్రగ్స్‌కు అలవాటు పడిన సంఘటనలను చూసి చలించి ‘ది ట్రిప్’ పేరుతో గంటన్నర నిడివి గల ఓ సినిమాను తీశారు. ఎదిగిన కొడుకు దారి తప్పితే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. బిడ్డను దారికి తీసుకురావడానికి తల్లి పడిన తపనను కళ్లకు కట్టినట్టు చూపారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారు ఆ సినిమా చూస్తే ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది. ఈ సినిమాలో తన కొడుకు గౌతమ్ రాజ్‌ను హీరోగా పెట్టి తీశారు. గౌతం రాజ్ జర్మనీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. డాక్టర్ భూమి రోడ్డు ప్రమాదంలో గాయపడిన గర్భిణి బిడ్డను ప్రసవించి ప్రాణం కోల్పోయింది. అనాథగా మారిన ఆ బిడ్డను అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేస్తుంది డాక్టర్ భూమి. పేదల కోసం తపించే మనస్తత్వమే ఆ బిడ్డను చేరదీసేలా చేసింది. మరో సంఘటనలో తల్లిని కోల్పోయిన ఓ యాచకురాలి కూతుర్ని తీసుకువచ్చి పెంచుతుంది. అయితే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న తన కొడుకు తనకు ఓ బెగ్గర్ చెల్లిగా రావడాన్ని తట్టుకోలేడు. తోటి స్నేహితులు హేళన చేస్తుంటే భరించలేకపోతాడు. ఆ పాపను తనకు చెల్లిగా అంగీకరించలేకపోతాడు. ‘అన్నయ్యా’ అనే మాట అంటే చాలు పళ్లు కొరుకుతాడు. ఓ రోజు తల్లితో గొడవ పడి ఇంటి గడప దాటి వెళతాడు. తల్లి మీద కోపంతో ఓ పార్కులో కూర్చుని ఉన్న బాబును తన తల్లితో కలిసి పనిచేసే ఓ డాక్టర్ చూసి పలకరిస్తే బెగ్గర్ చెల్లిని తెచ్చిన తల్లిమీద తన కోపాన్ని వెళ్లగక్కుతాడు. అప్పుడు ఆ డాక్టర్ పన్నెండేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను వివరిస్తాడు. ఓ తల్లి బిడ్డను కన్న వెంటనే చనిపోయిన విషయం గురించి చెప్పి ‘ఆ బిడ్డ ఏమైందో తెలుసా?’ అని ప్రశ్నిస్తాడు. తెలియదంటే ‘ఆ బిడ్డవి నువ్వే’ అని డాక్టర్ చెప్పిన మాట విని బిత్తరపోతాడు. నీ కోసం తను పిల్లల్ని కనకుండా భర్తను ఒప్పించి మరీ ఆపరేషన్ చేయించుకుందని వివరించడంతో కనువిప్పు కలిగిన ఆ బాబు తల్లి దగ్గరకు వెళ్లి తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణ కోరతాడు. ఈ సినిమాలకు కథ, మాటలు స్వయంగా తనే అందించారు. ఇలాంటి సందేశాత్మక సన్నివేశాలతో షార్ట్, ఫుల్‌లెంగ్త్ సినిమాలు నిర్మిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సరళారెడ్డి. మార్పు కోసమే ప్రయత్నం పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు పెరిగి పెద్దయ్యాక తమకు గొప్ప పేరు తేకున్నా ఫర్వాలేదు, కనీసం ఉన్న పేరు కాపాడితే చాలనుకుంటారు. కాని కొందరు పిల్లలు ముఖ్యంగా యువత చెడు వ్యసనాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎదిగిన కొడుకు దారితప్పాడని తెలిసి కన్నవారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఒక్కోసారి దారి తప్పిన యువతను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ముఖ్యంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారుతున్న వారిని చూసి చలించిపోయి రాసిన కథ నుంచి పుట్టిందే ‘ది ట్రిప్.’ సందేశాన్ని ఇచ్చే సినిమాలు నిర్మించే ప్రయత్నం చేస్తున్నా. నా ప్రయత్నంతో కొందరిలోనైనా మార్పు వస్తే నా లక్ష్యం నెరవేరినట్టే. – సరళారెడ్డి, గాంధారి గ్రామం, కామారెడ్డి జిల్లా – ఎస్.వేణుగోపాల్‌చారి, కామారెడ్డి, సాక్షి -
‘ది ట్రిప్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వీడీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ది ట్రిప్ పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్ చూస్తుంటే రొటీన్‌కు కాస్త భిన్నంగానూ అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. కార్తిక్ కొడకండ్ల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. -
పాపికొండల్లో పరవశం
విహారి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పాపికొండలూ.. వాటి అందాలూ.. ఎన్నెన్నో పల్లెలూ గోదావరి గర్భంలో శాశ్వతంగా నిక్షిప్తమైన చరిత్రగా మిగిలిపోతాయి. ఆ అరుదైన సౌందర్యాలన్నీ కనుమరుగయ్యేలోగా ఓసారి కనులారా దర్శించాలి.. మనసారా స్పర్శించాలి. ఈ కోరిక ఎప్పట్నుంచో హృదయాన్ని తొలుస్తోంది. కానీ వృత్తివ్యాపకాలతో సమయం కలిసి రాలేదు. అదృష్టశాత్తూ ‘నాలుగు రోజుల పాపికొండలు-భద్రాచలం యాత్ర’ను యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఉక్కునగరం శాఖ నిర్వహించడంతో నా కోరిక సాకారమైంది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ సెక్టార్ 11 నుంచి సుమారు వందమందితో రాత్రి 10.30 గంటలకు రెండు బస్సుల్లో బయల్దేరి మర్నాడు ఉదయం 4 గంటలకల్లా పట్టిసం చేరుకున్నాం. బస్సు దిగిన వెంటనే దర్శనమిచ్చింది వేదంలా ఘోషించే గోదావరి. తీరానికి కాస్త దూరంలో విశాలమైన ఇసుక తిన్నెలనానుకుని భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి ఆలయం కనువిందు చేసింది. స్నానాలు చేశాక ఆలయాన్ని దర్శించుకున్నాం. సుమారు 1300 ఏళ్ల ప్రాచీన చరిత్ర ఉన్న ఈ ఆలయం గోదావరి జిల్లాల్లో పేరొందిన శైవక్షేత్రం. ఉప్పొంగెలే గోదావరి అల్పాహారానంతరం పట్టిసం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని పోలవరానికి బస్సుల్లో చేరుకున్నాం. ఉదయం 11 గంటలకు మా లాంచీ బయల్దేరింది. పర్యాటకుల కాలక్షేపానికి యూత్ హాస్టల్స్ నిర్వాహకులు అంత్యాక్షరిని నిర్వహించారు. రాజమండ్రి నుంచి వచ్చిన వెంకట రామకృష్ణ (ఆర్కే) ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. డ్యాన్సులు, జోకులతో అదరగొట్టేశాడు. భీమవరం నుంచి వచ్చిన ఇంగ్లిష్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషారమణి, ఆమె కుమార్తెలు అనన్య, దాక్షాయణి, మధురై నుంచి వచ్చిన రామ్మూర్తి కుటుంబాలు కూడా సందడి చేశాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉక్రెయిన్ దేశస్తులు యాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం అదనపు ఆకర్షణగా మారింది. వీళ్లంతా గోదావరి అందాలు చూస్తూ కేరింతలు కొడుతుండగానే లాంచి గండిపోశమ్మవారు కొలువైన గొందూరు తీరానికి చేరుకుంది. అమ్మవారి దర్శనానంతరం లాంచీ ప్రయాణం మొదలైంది. కాసేపటికే పోలవరం డ్యామ్ నిర్మాణ స్థలం కనిపించగానే గుండె బరువెక్కింది. మధ్యాహ్న భోజనానంతరం మార్గమధ్యంలో చిన్నచిన్న పల్లెలు ఎదురయ్యాయి. కొంత దూరం వెళ్లాక ఒడ్డు నిండా గౌరవ వందనాన్ని సమర్పిస్తున్న సైనికుల్లా వరుసగా భారీ వృక్షాలు కనువిందు చేశాయి. అక్కడినుంచే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాపికొండలు మొదలయ్యాయి. అంతవరకూ ఆటపాటలు, కేరింతలతో దద్దరిల్లిన మా లాంచీలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. పాపికొండల నడుమ... పాపికొండల శ్రేణులను చూస్తూ అందరం కన్రెప్ప వేయడం మరిచిపోయాం. చిగిర్చిన వృక్షాలతో నిండుగా ఉన్న కొండల్లో ఎన్నెన్నో రకాల ఆకుపచ్చని రంగులు సూర్యకాంతికి మెరిసిపోతూ కనిపించాయి. చిత్రవిచిత్రమైన రూపు సంతరించుకున్న కొండలు, బంగారు వర్ణంతో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, సహజసిద్ధమైన ల్యాండ్‌స్కేప్‌లు, గోదావరి స్పర్శకు విభిన్నాకృతులతో కొలువైన ఇసుకమేటలు, శిలలు స్వాగతం పలికాయి. అయిదు కిలోమీటర్ల మేర విస్తరించిన పాపికొండల శ్రేణుల్లో దట్టంగా పెరిగిన అడవులు కనువిందు చేస్తున్నాయి. రాజమండ్రి నుంచి విశాలంగా ఉండే గోదావరి పాపికొండల మధ్యకొచ్చేసరికి ఫర్లాంగు దూరం కూడా ఉండదు. రెండు శిఖరాల మధ్య నుంచి ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. పాపికొండల మధ్య సుడులు తిరుగుతున్న గోదావరిని చూసిన భక్తులు రెండు చేతులెత్తి నమస్కరించారు. ఆ సమయంలో లాంచీ మోటారు శబ్ధం తప్ప వేరే శబ్ధమేమీ వినిపించలేదు. పాపికొండల మధ్య దోబూచులాడుతున్న పడమటి సూరీడు ఎర్ర మందారంలా కనిపించాడు. కొండల మధ్య ఒద్దికగా దారి చేసుకుంటూ, వయ్యారంగా వంపులు వంపులుగా సాగిపోతున్న గోదావరిని ఎంత వర్ణించినా ఇంకా ఏదో మిగిలిపోతుంది. రాములోరి దర్శనం పాపికొండలు దాటాక పేరంటాలపల్లి మీదుగా మా లాంచీ సాగిపోయింది. సాయంత్రం అందరికీ టీ, స్నాక్స్ అందించారు. సాయంత్రం 4 గంటలకు కొహెద గ్రామం చేరుకున్నాం. ఒడ్డుకు చేరగానే బస్సుల్లో భద్రాచలానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నాం. ముందు భద్రాద్రి రామన్నను దర్శించుకుని మాకు కేటాయించిన లాడ్జీలకు చేరుకున్నాం. ఉదయాన్నే ఆరు గంటలకల్లా తయారై ఎనిమిది గంటలకు శ్రీరాముని పర్ణశాల, సీతమ్మవారు చీర ఆర వేసుకున్న ప్రాంతాన్ని సందర్శించాం. అనంతరం మళ్లీ బస్సుల్లో 70 కిలోమీటర్లు ప్రయాణించి పోచారం చేరుకున్నాం. అక్కడ మా కోసం సిద్ధంగా వున్న లాంచీ ఎక్కి మధ్యాహ్న భోజనం కానిచ్చాం. అనంతరం మా యాత్ర మళ్లీ మొదలైంది. దారంతా గోదావరి అందాలు చూస్తూ లోకాన్నే మరిచిపోయాం. సాయంత్రం 4 గంటలకు మా లాంచీ పేరంటాల పల్లి చేరుకుంది. అందాల పేరంటాలపల్లి చింతలూ, పనసలూ, మామిళ్ల మధ్య పచ్చగా ఒదిగిన పేరంటాపల్లి ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండల పరిధిలో ఉంది. గ్రామంలోకి అడుగు పెట్టగానే ‘శ్రీరామకృష్ణ మునివాటం’ అనే శ్రీ బాలానందస్వామి ఆశ్రమం ఎదురైంది. ఆశ్రమానికి వెళ్లే దారి కొంచెం ఎత్తులో ఉండటం వల్ల సిమెంటు మెట్లను కట్టారు. మెట్ల పక్కగా సగానికి పైగా వేరు బయటికొచ్చి వింత ఆకారంలో భీతిగొలుపుతున్న పెద్ద చెట్టు కనిపించింది. వరద గోదావరి తాకిడికి మట్టి కొట్టుకుపోయి వేర్లు బయటికొచ్చినా కూలిపోకుండా నిలబడిన ఆ చెట్టును చూస్తే అది గోదావరితో పందెం వేసిందా? లేక స్నేహం చేసిందా? అన్న సందేహం కలిగింది. ఆశ్రమంలోకి ప్రవేశించగానే ఒకవైపు అరటి చెట్లు, మరోవైపు ముద్దమందారం, నందివర్ధనం.. ఇంకా ఏవో కొన్ని ఔషధ మొక్కలు స్వాగతం పలికాయి. ఆశ్రమం ఆవరణలో ఒకవైపు పెద్ద హాలుంది. ఆ హాలు మధ్యలో శివలింగం ఉంది. హాలుకు వెనక వైపు శ్రీ బాలానందస్వామి తపస్సు చేసుకున్న చోట ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి చిన్న మందిరాన్ని నిర్మించారు. పక్కనే ఆయన సమాధి ఉంది. పేరంటాలపల్లికి మౌనంగానే వీడ్కోలు పలికి లాంచీలో మరో తీరానికి సాగిపోయాం. పాపికొండల పొత్తిళ్లలో ఓ రాత్రి మరో అర్ధగంట ప్రయాణించాక పాపికొండల మధ్య ఉన్న కొల్లూరు గ్రామానికి చేరుకున్నాం. రెండు కొండల మధ్య ఏర్పడిన ఖాళీలో మేట వేసిన విశాలమైన ఇసుక తిన్నెపై సామాన్లతో సహా లాంచీ దిగిపోయాం. పౌర్ణమి వెళ్లి నాలుగు రోజులు కావడంతో పల్చని వెన్నెల పరచుకుంది. ఆ చల్లని, చక్కని, అద్భుత పరిసరాల్ని ఆస్వాదిస్తూనే అంతా భోజనాలు పూర్తి చేసుకుని కేంప్ఫైర్ చుట్టూ చేరాం. రాత్రి 11 గంటల వరకూ అందరూ ఆటపాటలతో వినోదాన్ని పంచారు. వేకువజామున 4 గంటలకు మెలకువ వచ్చింది. పాపికొండల మధ్య నుంచి వెలుగు రేకలు సోకిన గోదావరి ఆరబోసిన సౌందర్యాన్ని చూస్తుండగానే తెల్లారిపోయింది. మనోహరం మహానందీశ్వరాలయం అల్పాహారానంతరం మా లాంచీ బయల్దేరేసరికి ఉదయం 10 గంటలైంది. తిరుగు ప్రయాణంలోనూ పాపికొండల్ని పలకరిస్తూ సాగిపోయాం. గంట ప్రయాణానంతరం మహానందీశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం. దైవ దర్శనానంతరం మధ్యాహ్న భోజనం ముగించుకున్నాం. సాయంత్రం 4 గంటలకు పురుషోత్తపురం చేరుకున్నాం. లాంచీ దిగిన వెంటనే అంతా పరుగులు తీస్తూ బస్సులెక్కారు. నాకు కదలాలనిపించలేదు. వెల కట్టలేని మధురానుభూతుల్ని పంచిన గోదావరిని వదిలేసి వెళ్లాలనిపించలేదు. వెనక్కి తిరిగి చూశాను. అవే ఉరుకులు. అవే మెరుపులు. అడ్డూ, ఆపూ, అలసటా లేకుండా గోదావరి పంచకల్యాణిలా పరుగులు తీస్తూనే వుంది. ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు), సాక్షి, విశాఖపట్నం ఫొటోలు: చీమల రవిపాల్ ఏటా పాపికొండలు భద్రాచలం యాత్ర అత్యంత చవగ్గా, సురక్షితంగా పాపికొండలు-భద్రాచలం యాత్ర చేయాలంటే వెహైచ్‌ఏఐ ద్వారా వెళ్లడం శ్రేయస్కరం. ఏటా జనవరి నెలలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఉక్కునగరం శాఖ నాలుగురోజుల పాటు ఈ యాత్రను నిర్వహిస్తుంది. ముందుగానే పత్రికా ప్రకటన విడుదల చేస్తాం. దరఖాస్తు చేసుకున్న వారిని ఉక్కునగరం నుంచి బస్సులో తీసుకెళ్తాం. - మహదేవ కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు, వెహైచ్‌ఏఐ, ఉక్కునగరం యూనిట్, విశాఖపట్నం