breaking news
Tridandi srimannarayana
-
సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ
శంషాబాద్ రూరల్: శ్రీ భగవద్రామానుజుల సమతాస్ఫూర్తి సిద్ధాంతాన్ని సమాజానికి అందివ్వాలన్న ఉద్దేశంతో సమతాస్ఫూర్తి కేంద్రానికి అంకురార్పణ చేస్తున్నట్లు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి తెలిపారు. శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భగవద్రామానుజుల వారు కూర్చున్న భంగిమలోని 216 అడుగుల పంచలోహా విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సోమవారం చినజీయర్‌స్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు. చరిత్రకు వన్నె తీసుకురాగల ఓ బృహత్తర కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విగ్రహం చూసిన ప్రతి ఒక్కరిలో ఓ జిజ్ఞాస కలిగించి సమతాస్ఫూర్తి పొందేలా భారీ మూర్తిని నెలకొల్పుతున్నట్లు చెప్పారు. స్ఫూర్తి కేంద్రం రెండో అంతస్తులో ప్రతిష్టించే శ్రీ భగవద్రామానుజుల వారి 120 కిలోల బంగారు విగ్రహానికి నిత్యారాధన ఉంటుందన్నారు. ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. వంద ఎక రాల విస్తీర్ణం, రూ. 1,200 కోట్ల వ్యయంతో నిర్మి స్తున్న ఈ కేంద్రంలో సహస్రాబ్ది పారాయణ సమా రోహం గురించి భక్తులకు తెలియజేసేందుకు సెల్ఫ్ గైడెడ్ టూర్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. స్ఫూర్తి కేంద్రంలో 12 రోజులపాటు 2 లక్షల కిలోల ఆవు నెయ్యితో 1,035 కుండాలతో హోమాలు నిర్వహిం చనున్నట్లు చినజీయర్‌స్వామి తెలిపారు. వ్యక్తిలో మానసిక స్థైర్యం, ధైర్యం కల్పించేందుకు 12 రోజులపాటు çపంచ సంస్కార దీక్షదారులతో ప్రతిరోజూ కనీసం కోటిసార్లు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపింపజేయనున్నట్లు వివరించారు. కోటి అవణ క్రతువు కూడా నిర్వహిస్తామన్నారు. దసరా రోజున యాగశాలలకు భూమిపూజ స్ఫూర్తి కేంద్రంలో దసరా రోజున 128 యాగశాలల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు చినజీయర్ స్వామి తెలిపారు. ఒక్కో యాగశాల వద్ద 8 కుండాలతో ఆగమశాస్త్రం ప్రకారం హోమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం 5 వేల మంది రుత్వికుల సేవలు వినియోగిస్తామన్నారు. విగ్రహావిష్కరణకు 135 రోజుల కౌంట్‌డౌన్ మొదలైందని, నేటి నుంచి విగ్రహావిష్కరణ వరకు ప్రపంచం నలుమూలలా ఉన్న వారు వందే గురు పరంపరా మంత్రాన్ని జపించాలని జీయర్‌స్వామి పిలుపునిచ్చారు. ఇది ఓ ఉద్యమంలా సాగాలన్నారు. రెండు నెలలపాటు నిర్వహించనున్న చాతుర్మాస దీక్షను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో శ్రీ అహోబిల జీయర్‌స్వామి, శ్రీ దేవనాథ జీయర్‌స్వామి, మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు పాల్గొన్నారు. -
గోవిందా..గోవిందా..!
సాక్షి, ముంబై: వర్లీలోని బాలాజీ మందిరం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాల్లో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయనకు మందిర కార్యవర్గం ఘనస్వాగతం పలికింది. కాగా, రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. మూలమూర్తి మంత్రహోమం, బలిహరణం, ఎదరుకోళ్ల ఉత్సవ ంతోపాటు పూర్ణకుంభ స్వాగత కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రవచనాల కార్యక్రమంలో చినజీయర్ స్వామి భక్తులకు ఉపదేశాలు చేశారు. మూడు రోజులు జరగనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజున విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్సంగ్రహణం, అంకుర్చాణం, ధ్వజారోహణం తదితరాలతోపాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజు సాయంత్రం నిత్యహోమం, నిత్యపూర్ణాహుతి, సామూహిక విష్ణుసహస్రనామ విశేష ద్వాదశ షోడషోపచార ఆరాధన జరిగింది. గోవిందుని నామస్మరణతో... వర్లీ బీడీడీ చాల్ పరిసరాలు గోవిందుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. 84, 85 బిల్డింగ్ పరిసరాల్లో ఉన్న బాలాజీ దేవస్థానంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరిలో తెలుగు వారేకాకుండా మరాఠీ, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఉన్నారు. గోవిందా.. గోవిందా.., ఏడు కొండలవాడా వెంకటరమణా గోవిందా... గోవిందా.. అన్న నామస్మరణతో భక్తిమయ వాతావరణం నెలకొంది. వర్షంలో కూడా.... ఈ కార్యక్రమాల సందర్భంగా శనివారం 12 గంటల ప్రాంతంలో వర్షం వచ్చినప్పటికీ భక్తులు మాత్రం ఎక్కడికీ కదల్లేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దేవుణ్ని దర్శించుకునేవారు కూడా వస్తూనే ఉండడం కనిపించింది. ఈ సందర్భంగా ఆలయం ముందు రోడ్డును పూర్తిగా రాకపోకలకు మూసివేసి ఆరు బయటే టెంట్ వేశారు. అక్కడే భారీ సంఖ్యలో మహిళలతోపాటు పిల్లలు పెద్దలు కూర్చుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆ సమయంలో వర్షం కారణంగా టెంట్ నుంచి వర్షం నీరు కిందికి జారిపడుతున్నా కదలకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు శ్రీవారి ఊరేగింపు... శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో చివరి రోజు అనగా ఆదివారం శ్రీవారి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. అంతకుముందే కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు సంఘాలతోపాటు ఇతర సంఘాలు, సామాజిక సంస్థలు, ఇతర భక్త సమాజాలన్నీ ఎంతో సహకరిస్తున్నాయని దేవస్థానం అధ్యక్షుడు పొట్టబత్తిని కృష్ణహరి, ఉపాధ్యక్షుడు సిరిమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజా రేడేకర్, కోషాధికారి మ్యాన నాగేష్‌లు తెలిపారు.