breaking news
Tribal Development Department
-
గిరిపుత్రులకూ భూపంపిణీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేద గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వారికి సాగు భూములను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పేద దళిత కుటుంబాలకు అమలు చేస్తున్న భూపంపిణీ పథకాన్ని గిరిజనులకూ విస్తరించనుంది. ఈ మేరకు గిరిజన అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వచ్చేవారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రకటన చేసే అవకాశముందని గిరిజనాభివృద్ధి శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దళితులకు భూపంపిణీ పథకం కింద ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తున్నారు. ఆయా చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే.. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి అందజేస్తున్నారు. ఇలా నాలుగేళ్లలో దాదాపు 10 వేల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఇలా భూములు పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా నిర్ధారించుకున్న ప్రభుత్వం.. గిరిజనులకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఎకరా నుంచి మూడెకరాల వరకు.. దళితులకు భూపంపిణీ పథకం కింద ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తున్నారు. అదికూడా వారు నివాసం ఉండే గ్రామాలకు సమీపంలోనే అందజేస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా సమస్య ఏమీ లేకపోయినా.. ప్రధాన రహదారులు, నగర ప్రాంతాలకు చేరువలో ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో పథకం అమలు ఇబ్బందికరంగా మారింది. ఆయా చోట్ల భూముల ధరలు భారీగా ఉండటం వల్ల మూడెకరాల భూమి పంపిణీ కోసం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. తాజాగా గిరిజనులకు భూమి పంపిణీ అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే గిరిజనులకు భూపంపిణీతో పెద్దగా భారం ఉండబోదని అధికారవర్గాలు భావిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలు, తండాల్లో భూముల ధరలు తక్కువగా ఉంటుండటం, ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు యోగ్య భూములు ఎక్కువగా అందుబాటులో ఉండటం వంటి వాటితో భూపంపిణీ ప్రక్రియ సులభమేనని అంచనా వేస్తున్నాయి. కానీ గిరిజనులకు కచ్చితంగా మూడెకరాలు ఇవ్వాలన్న సీలింగ్ కాకుండా.. ఎకరా నుంచి మూడెకరాల వరకు అందుబాటులో ఉన్నంత మేర భూమిని పంపిణీ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఏటా గరిష్టంగా 3 వేల కుటుంబాలకు భూమి పంపిణీ చేయవచ్చని గిరిజన సంక్షేమ శాఖ యోచిస్తోంది. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఈ పథకంపై ప్రకటన చేసే అవకాశముందని మంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు. -
గిరిజన పారిశ్రామికవేత్తలకు సాయం
మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.50 లక్షల వరకు సబ్సిడీని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ముఖ్యంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామ న్నారు. శుక్రవారం సచివాలయంలో గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో మంత్రి చందూలాల్ సమీక్షించారు. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని తండాలు, గూడాలకు సంబంధించిన రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. లాభసాటి పద్ధతిలో గిరిజనులు వ్యవసాయం చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలతో ఆయా రంగాల్లో వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని, మొదటి విడతగా రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరవుతున్న గిరిజన విద్యార్థులకు రెసిడెన్సియల్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే గిరిజన బాలికలకు ఏఎన్ఎంలుగా శిక్షణ ఇప్పించి, విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలలో వాలంటీర్ల నియామకం కోసం అనుమతి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. బోడేఘాట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు వీలుగా రూ.15 కోట్లతో స్థానిక రోడ్లను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.