breaking news
Treasury Departments Office
-
‘మనీ’వేదన!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిధులకు కటకట ఏర్పడింది. పలు రకాల బిల్లుల చెల్లింపునకు జాప్యం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఖజానా శాఖలో బిల్లులు ఆమోదం కాకపోవడంతో పలువురు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బిల్లులు సమర్పించిన వివిధ శాఖలు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. డబ్బులు రావాల్సిన ఇతరులు కూడా ట్రెజరీకి వచ్చి వెళ్తున్నారు. జిల్లాలోని 5 ట్రెజరీల పరిధిలో సుమారు రూ.7కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేస్తున్నారని, అత్యవసర సేవలకు అధికారులు ముందస్తు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లిలో సబ్ ట్రెజరీలతోపాటు వైరాలో డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం ఉంది. వీటి ద్వారా అటు ఉద్యోగులతోపాటు ఇతర పథకాలకు సంబంధించిన బిల్లులు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉంటే మంజూరు చేస్తారు. సహజంగా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు, ఇతరులు తమకు రావాల్సిన నగదుకు సంబంధించిన బిల్లులు ట్రెజరీలో అందిస్తే.. నాలుగైదు రోజుల్లో ఆ బిల్లులకు సంబంధించిన నగదును చెల్లిస్తారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన పలు బిల్లులు ట్రెజరీ కార్యాలయాల్లోనే పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 20 రోజులుగా పలు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సంబంధిత ఉద్యోగులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.7కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే.. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్, మెడికల్, సరెండర్ లీవులు, వాహనాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ.2కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది. వ్యవసాయ శాఖలో ట్రాక్టర్లకు సంబంధించి సబ్సిడీలు సుమారు రూ.5కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి నాలుగైదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 13వేల మంది ఉద్యోగులు ఉండగా.. పెన్షనర్లు 6వేల మంది వరకు ఉన్నారు. వీరికి సంబంధించిన పలు బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. సర్వర్ బిజీ అంటూ.. బిల్లులు రావాల్సిన పలువురు ఉద్యోగులు, ఇతర వ్యక్తులు ప్రతిరోజు ట్రెజరీకి వచ్చి తమ బిల్లుల పరిస్థితి ఏమిటంటూ ఆరా తీస్తుండగా.. సంబంధిత అధికారులు మాత్రం ఆయా బిల్లుల వివరాలను వెబ్సైట్లో నమోదు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వర్ బిజీ బిజీ అంటూ వస్తోంది. దీంతో ట్రెజరీ పనులన్నీ పెండింగ్‌లో పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. మరోసారి పాస్ అయిన బిల్లులకు కూడా సకాలంలో నగదు పడడం లేదు. అయితే ఆర్థిక శాఖ వద్ద అవసరానికి తగినన్ని నిధులు లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నింటికీ నగదు మంజూరు చేసే వెసులుబాటు లేకపోవడం కారణంగానే బిల్లులు పాస్ కావడం లేదని సమాచారం. అత్యవసర సేవలకే ప్రాధాన్యం.. అత్యవసరమైన బిల్లులకు మాత్రమే త్వరగా నిధులు మంజూరవుతున్నాయి. హాస్టల్ బిల్లులు, మధ్యాహ్న భోజనం, పెన్షన్లు వంటి వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తూ.. వాటిని వెనువెంటనే పరిష్కరిస్తున్నారు. వీటికి నిధులు విడుదల చేసే సమయంలో మిగిలిన అంశాలకు సంబంధించిన బిల్లులను నిలుపుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే బిల్లులు అత్యవసరంగా విడుదల కావాల్సిన పరిస్థితులు ఉంటే ట్రెజరీ శాఖ అధికారులు.. ఉన్నతాధికారులను సందర్శించి.. స్థానిక సమస్యలను విన్నవించి వారి బిల్లులను పాస్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సమస్యలు పరిష్కరిస్తున్నాం.. పెండింగ్ బిల్లుల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తున్నాం. ఒక్కోసారి ఆన్లైన్ సమస్య వచ్చినప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు ఇచ్చిన సూచనల మేరకు బిల్లులను త్వరితగతిన అందేలా చూస్తున్నాం. – బి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్, ఖజానా శాఖ, ఖమ్మం -
ట్రెజరీ ఉద్యోగులు బిజీ..బిజీ
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలోని ట్రెజరీ ఉద్యోగులు బిజీ అయ్యారు. జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పింఛన్, డీఏ బకాయిల మొత్తాలను చెల్లించేందుకు శనివారంతో గడువు ముగియనుంది. అలాగే ఖజానా శాఖ కూడా రెండుగా విడిపోనుండటంతో ఈ శాఖలో కార్యకలాపాలను శనివారంతో బంద్ చేయనున్నారు. తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులను అన్ని ఉపఖజానా కార్యాలయాల నుంచి తెప్పించుకుని జిల్లా ఖజానా శాఖ కార్యాలయం ద్వారా రాష్ట్ర శాఖకు పంపించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరి వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల చెల్లింపుల కోసం బిల్లుల స్వీకరణ ఈనెల 21లో పూర్తి అయ్యింది. బిల్లుల స్వీకరణ మొదట మే 17 నాటికి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 19 వరకు అవకాశమిచ్చింది. వెంటనే ఆ తేదీని 21 వరకు పొడిగించింది. ఈ బిల్లుల క్లియరెన్స్‌ను ఈనెల 24లోపు పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నుంచి జీఓ నెం.86 రూపంలో ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ట్రెజరీ ఉద్యోగులు, అధికారులు ఆ పనుల్లో తలమునకలయ్యారు. సాధారణంగా అయితే బిల్లులు క్లియరెన్స్‌కి సుమారు వారం, పది రోజులు పట్టేది.. విభజన నేపథ్యంలో ముందస్తుగా చెల్లించేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే వ్యవధి ఇవ్వడంతో జీతాలు, ఇతర బిల్లులకు సంబంధించిన మొత్తాలు చేతికి అందుతాయో లేదోనని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడనున్నాయి. ఈలోగా ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం బిల్లుల చెల్లింపులను పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. ఇప్పటికిప్పుడు చెల్లించాల్సింది రూ. 62 కోట్లు... ఆర్థిక శాఖ నిర్ణయం ప్రకారం జిల్లాలో 30 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరికి జీతాలు సుమారు రూ. 40 కోట్లు ప్రతినెలా చెల్లిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు 20 వేల మంది దాకా ఉంటారని, వీరికి రూ.22 కోట్లు పింఛన్ చెల్లిస్తున్నారు. మొత్తం కలిగి రూ. 62 కోట్లను నేటి సాయంత్రం లోపు చెల్లించాల్సి ఉంది. జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు 14 సబ్ ట్రెజరీ కార్యాలయాల ద్వారా ఈ మొత్తాలను బట్వాడా చేయాలి. రాష్ట్ర విభజనకు జూన్ 2వ తేదీని అపాయింటెడ్డేగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వారం రోజుల ముందుగానే చెల్లింపు చేయాల్సి ఉంది. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అత్యవసరంగా చేపట్టిన అభివృద్ధి పనులు, ఎన్నికల కోడ్ రాక ముందుకు చేసిన పెండింగ్ బిల్లులు సైతం చెల్లించనున్నారు. కొందరు ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపుకు గడువులోపు కుదరకపోవడంతో ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు. జూన్ 20 తర్వాతే చెల్లింపులు పునఃప్రారంభం... జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోనున్నాయి. ఆ తర్వాత వారం రోజులకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. సీఎం ప్రమా ణ స్వీకారం తర్వాత మంత్రివర్గం కుదురుకునేసరికి మరో వారం రోజులు పట్టవచ్చు. జూన్ 20 తర్వాత గాని ట్రెజరీ బిల్లుల చెల్లింపు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే అది కూడా కొత్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయం మీద ఆధారపడి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.