breaking news
the traffic police
-
సీసీసీలో క్రైమ్టీమ్స్
నేరాలు జరిగే ప్రాంతాలు, సమయాలతో మ్యాపింగ్స్ స్నాచింగ్, ‘డైవర్షన్’ బాధితులకు ‘ట్రాఫిక్’ సాయం కసరత్తులు పూర్తి చేసిన సీసీఎస్, త్వరలో అమలులోకి సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రాష్ట్రపతి పాలన... మరోవైపు ఎన్నికల హడావుడి... ఈ పరిణామాలతో ప్రస్తుతం పోలీసుల దృష్టంతా శాంతిభద్రతల నిర్వహణ, బందోబస్తులపైనే ఉంటుంది. రానురాను ఈ అంశాలకే ప్రాధాన్యం పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు నేరాల నిరోధానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సీజన్లోనే కాకుండా... భవిష్యత్తులోనూ ఈ విధానాలను కొనసాగించాలని నిర్ణయించామని క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనల్ని ఉన్నతాధికారులకు పంపి, త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఆ సెంటర్లో ప్రత్యేక బృందాలు: నగర కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఉండే 12 స్క్రీన్లను వినియోగించి నగరంలోని 275 ప్రాంతాల్లో (కూడళ్లు, రహదారులు) పరిస్థితిని పర్యవేక్షించే అవకాశం ఉంది. ఈ సెంటర్లోనే ప్రత్యేక క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీఎస్‌తో పాటు నగరంలోని ఠాణాల్లో ఉన్న క్రైమ్ కానిస్టేబుళ్లను ఎంపిక చేసుకుని నిత్యం ముగ్గురు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా రహదారులపై తిరుగుతున్న నేరగాళ్లను గుర్తించడం వీరి పని. ఆధునిక పంథాలో మ్యాపింగ్స్: చైన్‌స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్ వంటి నేరాలు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సమయాల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. నగర వ్యాప్తంగా గడిచిన కొన్నేళ్లుగా నమోదైన కేసుల డేటాను విశ్లేషిస్తున్న సీసీఎస్ పోలీసులు ఆ ప్రాంతాలు, సమయాలతో మ్యాప్స్ రూపొందిస్తున్నారు. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలు, సమయాల్లో మఫ్టీ పోలీసుల్ని వాహనాలతో మోహరిస్తారు. ఏదైనా ఫిర్యాదు వచ్చినా, సీసీసీలో ఉండే క్రైమ్ సిబ్బంది రోడ్డుపై పాతనేరగాళ్లను గుర్తించినా... ఆ సమీపంలోనే ఉన్న ఈ మఫ్టీ బృందాలు వెళ్లి నేరగాడిని రెడ్‌హ్యాండెడ్ పట్టుకోవడం లేదా.. నేరగాడు తన షెల్టర్‌కు చేరుకునే లోపు పట్టుకొనేలా వ్యూహాలు రచిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు సహకారం రహదారులపై జరిగే స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్ వంటి నేరాల బారినపడుతున్న బాధితులు ప్రస్తుతం సివిల్ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నారు. లేదంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాల్సి వస్తోంది. దాదాపు ప్రతి జంక్షన్, కీలక రోడ్లపై లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నా, ఉండకపోయినా... ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. కచ్చితంగా వీరివద్ద వైర్లెస్ సెట్ అందుబాటులో ఉంటుంది. ఇకపై రోడ్ల మీద నేరాల బారినపడిన బాధితులు సమీపంలోని ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు చెప్పే అవకాశాన్నీ కల్పిస్తున్నారు. వీరి వద్ద ఉండే వైర్లెస్ సెట్ ద్వారా కంట్రోల్‌రూమ్‌తో పాటు ఒకేసారి నగర వ్యాప్తంగా ఉన్న పోలీసుల్ని అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు మాత్రం షాక్‌లో ఉండకుండా సాధ్యమైనంత త్వరగా సమాచారం ఇచ్చే కోణంలో ప్రచారం నిర్వహించనున్నారు. -
మన పోలీసులింతే!
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ముగ్గురు వ్యక్తులు నగరం నడిబొడ్డున ఆటోలో వెళ్తున్న అమ్మాయిలపై చేతులేశారు. అసభ్య చేష్టలతో హడలెత్తించారు. దుండగుల్ని పట్టించడానికి ఆటోడ్రైవర్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఏసీపీ వరకు అందర్నీ సంప్రదించాడు. ఏ దశలో ఎవరూ కనీసం స్పందించలేదు. ఏదైనా ఘటన జరిగితే నానా హడావుడి చేసే రక్షకభటులు.. ఘటనకు కారకులైన వారు దొరికే అవకాశం ఉన్నా పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఇది అభాగ్య నగరంలో మహిళలు, యువతలకున్న భద్రతలోని డొల్లతనాన్ని తెలిపే ఉదంతం.. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నానికి చెందిన రవీంద్రగౌడ్ ఆటోడ్రైవర్. శనివారం రాత్రి 7.30 సమయంలో మాదాపూర్ తీసుకెళ్లేందుకు సోమాజిగూడలో ముగ్గురు మహిళల్ని ఆటో ఎక్కించుకున్నాడు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద సిగ్నల్ పడడంతో ఆటో ఆగింది. అక్కడి ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు యువకులు.. అందరూ చూస్తుండగానే ఆటోలో ఉన్న యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, చేతులేస్తూ ఇబ్బందికి గురి చేశారు. ఆటోడ్రైవర్ వారిస్తున్నా వినకుండా తమ ఆగడాన్ని కొనసాగించారు. ఎలాగో వారి బారి నుంచి తప్పించి ఆటోడ్రైవర్ ముగ్గురు యువతుల్ని గమ్యానికి చేర్చి.. తిరిగి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్దకు చేరాడు. అంత క్రితం అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు యువకుల గురించి గాలించాడు. సమీపంలోని బస్టాపులో కూర్చొని మద్యం తాగుతుండటాన్ని గమనించి అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు చెప్పాడు. శాంతిభద్రతల పోలీసులకు చెప్పాలని వారు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. కనీసం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరితే విసుక్కున్నారు. దీంతో ఆటోడ్రైవర్ ‘సాక్షి’ విలేకరి ద్వారా బంజారాహిల్స్ ఏసీపీ అశోక్‌కుమార్ నెంబర్ సంపాదించాడు. ఆయనకు విషయాన్ని చెప్పగా, జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయాలని సూచించారు. ఆయనకు జరిగిన ఘటన చెప్పి, ముగ్గురు యువకులు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిపాడు. పది నిమిషాల్లో పోలీసులను పంపిస్తానని సదరు ఇన్స్పెక్టర్ చెప్పగా.. అరగంటైనా ఎవరూ రాలేదు. అప్పటికే ఫూటుగా తాగిన దుండగులు తాపీగా జారుకున్నారు. ఆటోడ్రైవర్ రవీంద్రగౌడ్ పడిన తాపత్రయం చూసిన వారంతా.. పోలీసుల నిర్వాకమింతేనని వ్యాఖ్యానించారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రవీంద్ర తెలిపారు. ఘటనకు పాల్పడినవారు యాచకులై ఉంటారని స్థానికులు చెబుతున్నారు.