breaking news
Trade taxes
-
25 శాతం సుంకాలు ఇక అధికారికం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: తంపులమారి ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్‌పై తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకాలపై అమెరికా అధ్యక్షుడు అధికారిక ముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులపై గురువారం సంతకం చేశారు. అంతేగాక పదుల కొద్దీ దేశాలపై కూడా సుంకాల కొరడా ఝళిపించారు. తద్వారా అంతర్జాతీయంగా మరోసారి వాణిజ్య కల్లోలానికి తెర తీశారు. తాజా జాబితాలో లేని దేశాలకు 10 శాతం టారిఫ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అత్యధికంగా సిరియాపై 41 శాతం, పలు దేశాలపై అత్యల్పంగా 10 శాతం టారిఫ్‌లు వడ్డించారు. ఇవి ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పాకిస్తాన్‌పై మాత్రం టారిఫ్‌లను 29 నుంచి 19 శాతానికి తగ్గించడం విశేషం. తాజాగా టారిఫ్‌లు విధించిన జాబితాలో 69 దేశాలున్నాయి. మరిన్ని దేశాలు తమతో చర్చలు జరుపుతున్నా, వాటి ప్రతిపాదనలు పరస్పర వర్తక లోటును పూడ్చేలా లేవంటూ ట్రంప్ పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని టారిఫ్ పెంపుదలలు ఉంటాయని వైట్‌హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై అధ్యక్షుడే ప్రకటన చేస్తారన్నారు. ఉత్తర అమెరికా వర్తక ఒప్పందం కింద అమెరికాలోకి ప్రవేశించే కెనడా, మెక్సికో ఉత్పత్తులకు సుంకాల బాదుడు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలోకి ఫెంటానిల్ భారీ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కెనడా విఫలమవుతోందని వైట్‌హౌస్ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఉత్పత్తులపై టారిఫ్‌లను 25 నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. మెక్సికోకు మాత్రం పలు ఉత్పత్తులపై విధించిన 30 శాతం టారిఫ్‌లను సంప్రదింపులకు వీలుగా 90 రోజుల గడువిచ్చారు. అయితే ఆటోయేతర, లోహేతర వస్తువులకు మాత్రం గడువు ఇవ్వలేదు. మెక్సికో నుంచి ఉక్కు, అల్యుమినియం, రాగిపై 50 శాతం టారిఫ్‌లు, ఆటో ఉత్పత్తులపై 25 శాతం తప్పవని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ట్రంప్ కొద్ది నెలల క్రితం ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచే అమల్లోకి రావడం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ మృతప్రాయమైనది అంటూ బుధవారం ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మన ఎగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో ఆయన పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు ప్రకటించిన పెనాల్టీ శాతాన్ని మాత్రం తాజా ఉత్తర్వుల్లో వెల్లడించలేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని అంగీకరించేందుకు భారత్ ఇప్పటికే ససేమిరా అనడం తెలిసిందే. అమెరికాపై భారత్ సుంకాలు దారుణంగా ఉన్నాయంటూ ట్రంప్ ఇటీవలే విమర్శించడం, దేశ ప్రయోజనాలను అన్ని రకాలుగా కాపాడతామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల నడుమ చర్చలు కొనసాగుతుండగానే బుధవారం ట్రంప్ 25 శాతం సుంకాలు బాదారు. ఇక అమెరికాకు ఎగుమతులపై 15 శాతం టారిఫ్‌లకు దక్షిణ కొరియా ఇప్పటికే అంగీకరించింది. వాటిపై 25 శాతం బాదుడు తప్పదంటూ ట్రంప్ తొలుత హెచ్చరించారు. దాంతో ఆయన నిర్ణయించే అమెరికా ప్రాజెక్టుల్లో 350 బిలియన్ల మేరకు పెట్టుబడికి ఒప్పుకుంది. ఇక అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాపై టారిఫ్‌లను ట్రంప్ ఏ మేరకు నిర్ణయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 12 నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా ఆ దేశానికి ఆయన ఇప్పటికే అలి్టమేటమివ్వడం తెలిసిందే. ఇరు దేశాల నడుమ పలు అంశాలపై వర్తక విభేదాలు కొనసాగుతున్నాయి. దేశ ప్రయోజనాలు కాపాడతాం: కేంద్రం ట్రంప్ వ్యాఖ్యలు, తాజా ఉత్తర్వులపై కేంద్రం ఆచితూచి స్పందించింది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచింది. ఇరు దేశాలు విశ్వసించే ఎజెండాకు కట్టుబడి ఉన్నాం. ఈ బంధం సజావుగా సాగుతుందని విశ్వసిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు ప్రతీకారంగా జరిమానా విధిస్తామన్న ట్రంప్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా ఈ విషయంలో జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఆగని దందా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా, ఉన్నతాధికారుల కనుసన్నలలో మెలుగుతూ, మాట తప్పకుండా మామూళ్లు ఇచ్చేవారికే చెక్‌పోస్టులలో ప్రాధాన్యం దక్కుతుందన్న చర్చ కూడా ఉంది. రవాణా శాఖ డీటీసీ, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, సీటీ ఓ కార్యాలయాలలో కీలక స్థానాలలో కొనసాగుతున్న కొందరు అధికారులు ఏడాదికోసారి చెక్‌పోస్టు డ్యూటీల ను ఖరారు చేస్తూ పెద్ద మొత్తంలో వాటాలు, నజరానాలు పొందుతున్నారని ఆ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో అయితే డిప్యూటీ కమిషనర్‌తోపాటు సీటీఓలను ప్రసన్నం చేసుకుంటేనే సాలూర, మద్నూరు చెక్‌పోస్టులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ)ల నియామకం జరుగుతుందంటున్నారు. రోజువారీ వసూళ్లు రూ.లక్షల్లోనే సాలూర, సలాబత్పూర్, పొందుర్తి చెక్పోస్ట్టులలో వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. తరచూ జరుగుతున్న ఏసీబీ దాడులలో బయట పడుతున్న అక్రమ వసూళ్ల బాగోతాలే ఇందుకు సాక్ష్యాలు. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని మరీ అధికారులు లక్షలు గడిస్తున్నారు. ఉన్న తాధికారులు పట్టించుకోకపోవడం, స్థానిక పరి స్థితులు వారికి కలిసి వస్తున్నాయి. ఆడపాదడపా ఏసీబీ అధికారులు దాడులు చేసినా అక్రమ వసూళ్ల పర్వాన్ని నియంత్రించలేకపోతున్నారు. మహారాష్ట్రకు సరిహద్దున, బోధన్ మండల కేంద్రానికి పది కిలో మీటర్ల దూరంలో సాలూర వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. రవాణా, వాణిజ్య పన్నుల, పౌర సరఫరాల, ఎక్సైజ్ శాఖలతో పాటు వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు కూడా ఉంది. ఈ ఉమ్మడి తనిఖీ కేంద్రానికి వాణిజ్య పన్నుల శాఖకు చెందిన డీసీటీఓ స్థాయి అధికారి ఏఓ (అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్)గా వ్యవహరిస్తారు. సాలూరతోపాటు మద్నూరు చెక్‌పోస్టు, పొందుర్తి ఆర్టీఏ చెక్‌పాయింట్ ద్వారా పెద్ద సంఖ్యలో వాహనాలు రకరకాల సరుకులతో వెళ్తుంటాయి. ఆ వాహనాల నుంచి ప్రతి చెక్‌పోస్టులో ఎంట్రీల పేరిట వసూలుకు తోడు రకరకాల కారణాలతో రోజూ సుమారుగా రూ.75 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అధికారుల ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. లారీకో రేటు చెక్‌పోస్టులలో లారీకో రేటు ఖరారు చేసి వసూలు చేయడం ‘మామూలు’గా మారింది. సరుకుల అక్రమ రావాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఈ తనిఖీ కేంద్రాలలో, నిబంధనలకు అనుగుణంగా సరుకులు రవాణా చేసినా చేతులు తడపనిదే లారీలు కదలనివ్వని పరిస్థితి నెలకొందని కొందరు వ్యాపారులే వాపోతున్నారు. రోజూ ఈ చెక్‌పోస్టుల ద్వారా పెద్ద సంఖ్యలో లారీలు వెళ్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అమ్మకపు పన్ను (వ్యాట్), రవాణా అనుమతి పత్రాలు (వేబిల్లు) చూపి ంచినా, అడి గినంత సమర్పించుకున్నాకే లారీలు కదులనిస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. అన్నిరకాల కాగితాలు ఉన్నా, మామూళ్ల తతంగం పూర్తయితేనే ముద్ర వేయడం ఆనవాయితీగా మార్చారు. ఇంత జరుగుతున్నా చెక్‌పోస్టుల డ్యూటీల కోసం పోటీపడుతున్న అధికారులు, వారిని ప్రోత్సహిస్తున్న ఉన్నతాధికారులపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.