breaking news
TPO
-
టీపీఓపై దాడి.. స్పందించిన మంత్రి బొత్స!
సాక్షి, అనంతపురం: నగరంలో ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రూ.వందల కోట్ల విలువైన నగరపాలక సంస్థ స్థలాలను ఆక్రమించుకోవడమే కాక, ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడుతున్నారు. మంగళవారం అనంతపురం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వినయ్‌ప్రసాద్‌పై వేణుగోపాల్‌నగర్‌లో ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. దీంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. అసలేం జరిగిందంటే.. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 173/6, 175/2, 175/3, 153/1బీ, 154/2, 176/1, 176/5, 177/1, 174, 176, 171/సీ, 172/పీ తదితర సర్వే నంబర్లలో నగరపాలక సంస్థకు చెందిన ఆరు ఎకరాల స్థలం ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇందులో నుంచి 1.5 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. నగర పాలక సంస్థ పరిధిలో విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వైనంపై ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తీసుకెళ్లారు. అదే సమయంలో సెంట్రల్ పార్క్ స్థలాలను ఎవరికీ ఇవ్వరాదని, వాటిని పరిరక్షించాలంటూ నగర పాలక సంస్థ అధికారులకు సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో టీపీఓ వినయ్‌ప్రసాద్ సర్వే చేసేందుకు మంగళవారం వేణుగోపాలనగర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆక్రమణదారులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాము సర్వే చేసేందుకు వచ్చామని, పార్క్ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వివరించినా.. వినకుండా 30 మందికి పైగా టీపీఓపై దాడి చేసి చితకబాదారు. గాయాలపాలైన టీపీఓ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స కోసం చేరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బోయ కృష్ణమూర్తి, బోయ నరసింహ, బోయ గిరిజమ్మపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు టీపీఓ వినయ్‌ప్రసాద్‌పై జరిగిన ఘటనపై నగరపాలక సంస్థ ఉద్యోగులతో పాటు పలు ఉద్యోగ సంఘాల భగ్గుమన్నాయి. మంగళవారం నగరపాలక సంస్థ నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అంతకు ముందు గేట్‌కు తాళం వేసి ధర్నా చేశారు. టీపీఓపై దాడిని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సంగం శ్రీనివాసులు, ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అతావుల్లా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మునిసిపల్ ఆర్డీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి బొత్స టీపీఓ వినయ్‌ప్రసాద్‌పై జరిగిన దాడిని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆక్రమణదారుల నుంచి నగరపాలక సంస్థ ఆస్తులను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. మాకెలాంటి సంబంధం లేదు ఈ ఘటనపై తమకెలాంటి సంబంధం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేణుగోపాల్‌నగర్‌లో చేపట్టిన ఓ కట్టడం విషయంగా స్థానికులు టీపీఓపై దాడి చేశారన్నారు. -
తాండూరు టీపీఓకు చుక్కెదురు
♦ ప్రభుత్వానికి సరెండర్ చేసిన కమిషనర్ ♦ టౌన్ ప్లానింగ్ విభాగం గదికి తాళం తాండూరు : స్థానిక మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారిణి (టీపీఓ)కు చుక్కెదురైంది. పక్షం రోజుల అనంతరం తిరిగి విధుల్లో చేరాలనే టీపీఓ ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రితం రోజు విధులో చేరడానికి మున్సిపల్ మేనేజర్ శ్రీహరికి ఇచ్చిన లేఖను మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ శనివారం తిరస్కరించడంతోఆమెకు భంగపాటు తప్పలేదు. ఏడాది క్రితం ఇక్కడ టీపీఓగా శైలజ విధుల్లో చేరారు. అయితే పట్టణంలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుండడం, ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై గత నెల 30న మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు చర్యలకు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీఓను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కౌన్సిల్లో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సంతోష్‌కుమార్ రెండు రోజుల క్రితం ఆమెను సరెండర్ చేస్తున్నట్లు డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీసీ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న టీపీఓ విధులు చేరేందుకు మున్సిపాలిటీకి వచ్చారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్‌కు లేఖ అందించారు. ఈ లేఖను కమిషనర్ తిరస్కరించారు. ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ డీటీసీపీకి ఇచ్చిన లేఖ ప్రతిని శనివారం కమిషనర్ టీపీఓకు అందించారు. దీంతో ఆమె కార్యాలయం నుంచి వెనుతిరిగారు. కొసమెరుపు ఏమిటంటే.. ముఖ్యమైన ఫైళ్లు గల్లంతు కావొద్దనే యోచనతో మున్సిపాలిటీలోని టౌన్‌ప్లానింగ్ విభాగం గదికి కమిషనర్ తాళం వేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కొత్తగా ఇద్దరు బీఐలు, ఒక టీపీఎస్‌లు వస్తున్నారని చెప్పారు.