breaking news
thulasi reddy
-
'ఏపీ థార్ ఏడారిలా మారడం ఖాయం'
విజయవాడ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక ప్రతినిధి తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఈ నెల 20న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేయాలని చెప్పిన నేపథ్యంలో ఆ పని వెంటనే చేయాలని అన్నారు. విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కటి కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్నా దానికి నదీ యాజమాన్యాల బోర్డుల సిఫారసు, కేంద్ర జలవనరుల కమిషన్ సిఫార్సు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ థార్ ఏడారి అవుతుందని, 48లక్షల ఎకరాలు బీడు భూమిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తాగునీటి సమస్య ఏర్పడుతుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీకరిస్తూ 'శని విరగడైపోయింది, అడ్డంకులు పోయాయి, రాకెట్ వేగంతో పనిచేస్తామని' సీఎం కేసీఆర్ అంటున్నారని చెప్పారు. ఇంతజరుగుతున్నా అటు కేంద్రం ఏ నోటిఫికేషన్ ఇవ్వకపోగా.. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా నీరో చక్రవర్తిలా ఊకదంపుడు ఉపన్యాసాలతో విదేశాల పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. -
బాబు వ్యాఖ్యలు పచ్చి అబద్ధం: తులసిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలన్నీ సమైక్య రాష్ట్రంలోనే ఇచ్చామనటం పచ్చి అబద్ధమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. విభజన ప్రక్రియ ముగిసిన నెల రోజుల్లోపే తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలకు విడివిడిగా మేనిఫెస్టోలను విడుదల చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత.. ఇప్పుడు హామాలను అమలు చేయటంలో చేతులు ఎత్తేయటం చంద్రబాబు పచ్చి మోసానికి నిదర్శనమని తులసిరెడ్డి విమర్శించారు.