breaking news
Temple Protection Movement
-
ఆలయ కవాటం
కవాటం అంటే తలుపు. ఆలయరక్షణకోసం.. స్వామివారి ఏకాంతం కోసం గుడి తలుపులు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాచీన ఆలయాల నుంచి నేటివరకూ ఆలయతలుపులు దారువు (కొయ్య)తోనే చేసి అవకాశాన్ని బట్టి దానికి ఇత్తడి, రాగి, వెండి, బంగారుతో చేసిన రేకులను బిగిస్తున్నారు. ఇలా లోహాలతోచ శిల్పాలతో తలుపులను అలంకరించడం వలన దేవతల ప్రీతి పొందుతారని ఆగమాలు చెబుతున్నాయి. ఆలయద్వారం, తలుపు చెక్కలను, వాటికి జోడించే నిలువు, అడ్డ పట్టికలను ఒకే జాతికి చెందిన కొయ్యతో నిర్మించడం చాలా మంచిది. అలా కాకుండా మిశ్రదారువులతో చేస్తే విపరీతమైన ఫలితాలు ఎదురౌతాయని ఈశాన శివగురుదేవ పద్ధతి తెలిపింది. ద్వారబంధం శిలతో నిర్మించి తలుపులు కొయ్యతో చేస్తే దోషమేమీ లేదు. ద్వారబంధానికి లోపల ఇరువైపులా రెండేసి ఇనుము కమ్మీలను ఏర్పరచి తలుపులకు గుండ్రని కమ్మీలకు తగిలించి తిరగడానికి చేసే ఏర్పాటుకు భ్రమరకాసంధి అని పేరు. దేవాలయ ద్వారానికి రెండువైపులా జోడు తలుపులు ఉండాలి. వీటిని యుగ్మకవాటం అంటారు. ఆలయాల్లో చిన్న ఆలయాలకు.. ముందున్న రెండు స్తంభాలకు కలిపి తలుపు పక్కకు జరిపి వేసే తలుపులను సంహార కవాటం అంటారు. ఆలయాల్లో గానీ.. గృహాల్లో గానీ గూడు లేదా అల్మరా నిర్మించి వాటికి ఉంచే తలుపులను ధావన కవాటం అంటారు. ప్రాచీన ఆలయాల్లో నేరుగా గర్భగుడికి తలుపులుండవు. అంతరాళ మండపం, అర్ధమండపాలకు మాత్రమే తలుపులు ఉంటాయి. కవాటాల పైన పద్మాలు, చిరుగంటలు లేదా దశావతార శిల్పాలను, అష్టలక్ష్మీ విగ్రహాలను, ఆయా దేవతాలీలల్ని లేదా తిరునామం శంఖచక్రాలు, గరుడ–హనుమ శిల్పాల్ని, అష్టదిక్పాలకులను చెక్కుతారు. అయితే కవాటాలపైన అష్టమంగళ చిహ్నాలు, లతలు, మకర, నర, నారీ, భూత, సింహాలు, గజ.. వ్యాలాది రూపాల్ని వారి వారి ఆలోచనలకు తగ్గట్టు చిత్రించాలని శ్రీప్రశ్నసంహిత సూచించింది. కవాటాలను తెరవడమంటే భగవంతుని కరుణను మనపై కురిపించడమే. ప్రకృతిసిద్ధమైన దేవతారూపాలతో నిండిన కవాటాలు భక్తులకు కటాక్ష వీక్షణా గవాక్షాలు. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
ఆంధ్రా దేవాలయాల బకాయిలు రూ. వెయ్యి కోట్లు
‘టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్’ కన్వీనర్ సౌందరరాజన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలతోపాటు ఏపీలోని ఇతర దేవాలయాల నుంచి దేవాదాయ శాఖకు రావాల్సిన రూ.వెయ్యి కోట్ల బకాయిలను వసూలు చేయాలని ‘టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్’ కన్వీనర్ సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన మంత్రి హరీశ్‌రావును కలసి ఈ అంశాన్ని వివరించారు. మంత్రి సూచన మేరకు ప్రభుత్వ సలహాదారు రమణాచారిని కలసి వినతిపత్రాన్ని అందజేశారు. దేవాదాయ నిర్వహణ నిధి (ఈఏపీ), సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్) తదితరాలు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో టీటీడీతోపాటు ఏపీలో దేవాలయాలు రూ.2,500 కోట్లకుపైగా బకాయి పడ్డాయని, జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు అందులో రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉందన్నారు.