ఆలయ కవాటం

 Devotional Stories of Ancient Temples - Sakshi

ఆలయం ఆగమం–34

కవాటం అంటే తలుపు. ఆలయరక్షణకోసం.. స్వామివారి ఏకాంతం కోసం గుడి తలుపులు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాచీన ఆలయాల నుంచి నేటివరకూ ఆలయతలుపులు దారువు (కొయ్య)తోనే చేసి అవకాశాన్ని బట్టి దానికి ఇత్తడి, రాగి, వెండి, బంగారుతో చేసిన రేకులను బిగిస్తున్నారు. ఇలా లోహాలతోచ శిల్పాలతో తలుపులను అలంకరించడం వలన దేవతల ప్రీతి పొందుతారని ఆగమాలు చెబుతున్నాయి. ఆలయద్వారం, తలుపు చెక్కలను, వాటికి జోడించే నిలువు, అడ్డ పట్టికలను ఒకే జాతికి చెందిన  కొయ్యతో నిర్మించడం చాలా మంచిది. అలా కాకుండా మిశ్రదారువులతో చేస్తే విపరీతమైన ఫలితాలు ఎదురౌతాయని ఈశాన శివగురుదేవ పద్ధతి తెలిపింది. ద్వారబంధం శిలతో నిర్మించి తలుపులు కొయ్యతో చేస్తే దోషమేమీ లేదు. ద్వారబంధానికి లోపల ఇరువైపులా రెండేసి ఇనుము కమ్మీలను ఏర్పరచి తలుపులకు గుండ్రని కమ్మీలకు తగిలించి తిరగడానికి చేసే ఏర్పాటుకు భ్రమరకాసంధి అని పేరు. దేవాలయ ద్వారానికి రెండువైపులా జోడు తలుపులు ఉండాలి.

వీటిని యుగ్మకవాటం అంటారు. ఆలయాల్లో చిన్న ఆలయాలకు.. ముందున్న రెండు స్తంభాలకు కలిపి తలుపు పక్కకు జరిపి వేసే తలుపులను సంహార కవాటం అంటారు. ఆలయాల్లో గానీ.. గృహాల్లో గానీ గూడు లేదా అల్మరా నిర్మించి వాటికి ఉంచే తలుపులను ధావన కవాటం అంటారు. ప్రాచీన ఆలయాల్లో నేరుగా గర్భగుడికి తలుపులుండవు. అంతరాళ మండపం, అర్ధమండపాలకు మాత్రమే తలుపులు ఉంటాయి. కవాటాల పైన పద్మాలు, చిరుగంటలు లేదా దశావతార శిల్పాలను, అష్టలక్ష్మీ విగ్రహాలను, ఆయా దేవతాలీలల్ని లేదా తిరునామం శంఖచక్రాలు, గరుడ–హనుమ శిల్పాల్ని, అష్టదిక్పాలకులను చెక్కుతారు. అయితే కవాటాలపైన అష్టమంగళ చిహ్నాలు, లతలు, మకర, నర, నారీ, భూత, సింహాలు, గజ.. వ్యాలాది రూపాల్ని వారి వారి ఆలోచనలకు తగ్గట్టు చిత్రించాలని శ్రీప్రశ్నసంహిత సూచించింది. కవాటాలను తెరవడమంటే భగవంతుని కరుణను మనపై కురిపించడమే. ప్రకృతిసిద్ధమైన దేవతారూపాలతో నిండిన కవాటాలు భక్తులకు కటాక్ష వీక్షణా గవాక్షాలు.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top