రాతి.. చిర ఖ్యాతి!

Telangana Construction Of Yadadri And Sri Ramanuja Millennium Temples - Sakshi

మూడు శతాబ్దాల తర్వాత రాళ్లతో భారీ దేవాలయాలు 

యాదాద్రి, రామానుజుల సహస్రాబ్ధి మందిరాల నిర్మాణం

సంప్రదాయ శైలితో అద్భుతం చేసి చూపిన వేల మంది శిల్పులు 

పూర్తి నల్ల రాతి కట్టడంగా యాదగిరీశుడి మందిరం 

రామానుజుల ప్రాంగణంలో ప్రధాన మందిరం రాతితో నిర్మాణం 

సాక్షి, హైదరాబాద్‌: పాత రాతి కట్టడాలు చూస్తే వాటిల్లోని శిల్పాలు అబ్బురపరుస్తాయి. వాటిని చెక్కిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ మండపాలు, ప్రాకారాలు, గోపురాలు.. ఒకటేమిటి అన్నీ కట్టిపడేస్తాయి. కారణం.. అవన్నీ రాతి నిర్మాణాలే. 17వ శతాబ్దంలో జటప్రోలు దేవాలయాల నిర్మాణాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆ స్థాయిలో రాతి నిర్మాణాలు జరగలేదు.

ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగాక నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది. రాతి కట్టడాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ అలనాటి అబ్బురాన్ని కళ్లకు కట్టేలా రెండు భారీ రాతి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటు యాదాద్రి.. అటు శ్రీరామానుజుల సహస్రాబ్ధి ప్రాంగణం.. సనాతన సంప్రదాయ నిర్మాణ విధానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాయి.  

మన శిల్పుల్లో ఆ కళ పదిలం 
ఎలాంటి ఆధునిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా టన్నుల బరువున్న రాళ్లను పేర్చి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసి శిల్పులు అద్భుతాలు çసృష్టించారు. అయితే ప్రస్తుతం ఆలయాల్లోని మూలవిరాట్టు మినహా మిగతా భాగాలకు రాతితో పని అవసరం లేని సమయంలో నేటి శిల్పుల చేతుల్లో నాటి పనితనం ఉండదన్న అనుమానాలుండేవి. కానీ ఈ రెండు మందిరాలను నిర్మించి వారు నాటి శిల్పుల వారసులేనని నిరూపించారు. యాదాద్రి, రామాను జుల సహస్రాబ్ది మందిరాల్లో దాదాపు 5 వేల మంది శిల్పులు అద్భుత పనితనాన్ని చూపారు.  


రామానుజుల ప్రాంగణంలో రాతి నిర్మాణాలు

యాదాద్రి మందిరానికి 86 వేల టన్నుల నల్లరాయి 
యాదాద్రి మందిరాన్ని పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించారు. ఇందుకు మేలురకమైన బ్లాక్‌ గ్రానైట్‌ కోసం వివిధ ప్రాంతాలను గాలించి ప్రకాశం జిల్లా గుర్జేపల్లి ప్రాంతంలోని క్వారీని ఎంపిక చేశారు. దాదాపు 86 వేల టన్నుల నల్లరాతిని సేకరించారు. ఇందుకు రూ. 48 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆ రాతిని చెక్కి ఇటు శిల్పాలు, అటు నగిషీలు, ప్రాకార రాళ్లు.. ఇలా రకరకాలుగా వినియోగించారు. మొత్తంగా యాదాద్రి ఆలయానికి 10 లక్షల క్యూబిక్‌ ఫీట్‌ మేర దీన్ని వినియోగించారు.  

రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణంలో మందిరాలకు రకరకాల రాళ్లు 
రామానుజుల 216 అడుగుల ఎత్తున్న విగ్రహం దిగువన ఉన్న 54 అడుగుల ఎత్తున్న భద్రపీఠానికి రాజస్తాన్‌లోని బన్సీపహాడ్‌పూర్‌ ప్రాంతం లోని లేత గులాబీ రంగు ఇసుక రాయిని వాడారు. మౌంట్‌అబూ ప్రాంతంలోని శిల్పుల చేత దాన్ని చెక్కించి తీసుకొచ్చి ఇక్కడ వినియోగించారు. సమతామూర్తి చుట్టూ విస్తరించి ఉన్న 108 దివ్యదేశ మందిరాల్లోని గర్భాలయ అంతరాలయాలకు ఏపీలోని కోటప్పకొండ, మార్టూరు పరిసరాల్లోని బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌ను వాడారు.

దివ్య మండపంలో హోయసల, కాకతీయ శైలిలో ఏర్పాటు చేసిన 468 స్తంభాలకు రాజస్తాన్‌లోని బేస్‌లానా బ్లాక్‌ మార్బుల్‌ (నల్ల చలువరాయి) వినియోగించారు. కాంచీపురం సమీపంలోని వాలాజా ప్రాంతంలోని కృష్ణ పురుష శిలను ఆలయాల్లోని ప్రధాన మూర్తులకు వాడారు. మరో 12 రోజుల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహణ జరగబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా  216 అడుగుల భారీ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 


రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణం 

17వ శతాబ్దం తర్వాత తగ్గిన రాతి నిర్మాణాలు 
తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరికెళ్లినా రాతితో నిర్మించిన చారిత్రక మందిరాలు దర్శనమిస్తాయి. శాతవాహనులు మొదలు కాకతీయులు, విజయనగర రాజుల వరకు నిర్మాణాలన్నీ రాతితోనే జరిపించారు. డంగు సున్నం మిశ్రమాన్ని నిర్మాణాలకు వినియోగించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా రాతికి రాతికి మధ్య బైండింగ్‌ వరకే దాన్ని వాడారు తప్ప ఆలయాల నిర్మాణానికి అంతగా వినియోగించలేదు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని దక్కన్‌ సుల్తాన్‌ను ఓడించిన తర్వాత భారీ రాతి నిర్మాణాలు పెద్దగా జరగలేదు.

తర్వాత సంస్థానాలు కొలువుదీరాక 17వ శతాబ్దంలో కొన్ని పెద్ద రాతి దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. జటప్రోలు సంస్థానాధీశులు స్థానికంగా మదనగోపాల స్వామి దేవాలయం, కృష్ణా తీరంలోని మంచాలకట్ట మాధవస్వామి దేవాలయాలు నిర్మించారు. మళ్లీ 3 శతాబ్దాల తర్వాత 1910లో వనపర్తి సంస్థానాధీశులు పెబ్బేరు సమీపంలోని శ్రీరంగాపురంలో రంగనా«థ స్వామి ఆలయాన్ని రాతితో నిర్మించారు. కానీ అది చిన్నగా ఉండే ఒకే దేవాలయం.

జటప్రోలు దేవాలయాల తర్వాత ఇంత కాలానికి అత్యంత భారీగా, పూర్తి రాతితో నిర్మించిన దేవాలయం యాదాద్రి. రామానుజుల సహస్రాబ్ధి మందిరాలు కూడా కొంతభాగం సిమెంటు నిర్మాణాలు పోను ప్రధాన మందిరాలను రాతితోనే నిర్మించారు. నగరం నడిబొడ్డున నౌబత్‌ పహాడ్‌పై పాలరాతితో నిర్మించిన బిర్లామందిరం కూడా రాతి కట్టడమే అయినా 
తెలుగు ప్రాంతాల సంప్రదాయ శైలికి భిన్నమైంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top