
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) రేపు తెనాలికి వెళ్లనున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్(John Victor) కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్ చేరుకుంటారని, జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి మధ్యాహ్నం 12.00గం. ప్రాంతంలో తాడేపల్లికి బయలుదేరుతారని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే.. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. పైగా పోలీస్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశారంటూ ఆరోపణలకు దిగారు. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేశాయి.