breaking news
Telugu varsity services
-
ఇరు రాష్ట్రాలకూ తెలుగువర్సిటీ సేవలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగువర్సిటీ సేవలు ఇరు రాష్ట్రాలకూ అందనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఉమ్మడి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పదో షెడ్యూల్లో ఉన్న ఈ వర్సిటీ విభజనకోసం అధికారులు, సిబ్బంది అభ్యర్థించినా ఇటువంటి సంస్థలను ఉమ్మడిగానే కొనసాగాలనే ఉద్దేశంతో ఏపీ ఈ విషయంలో మౌనం వహించింది. పైగా ఈ వర్సిటీకి తన వాటాగా ఇవ్వాల్సిన 58 శాతం నిధులనుకూడా విడుదల చేయలేదు. ఏపీ నుంచి స్పందన లేకపోవడం తో ఈ వర్సిటీ సేవలను కేవలం తెలంగాణకే పరిమితం చేయాలంటూ తెలంగాణ ఉన్నత విద్యా కార్యదర్శి రాజీవ్‌రంజన్ ఇటీవల ఆచార్య వీసీ శివారెడ్డిని ఆదేశించారు. ఈ వర్సిటీకి హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉండగా... ఏపీలోని శ్రీశైలం (చరిత్ర, పురావస్తు తదితర శాఖలు), కూచిపూడి (నాట్యం), రాజమండ్రి (సాహిత్యం) ప్రాంగణాల్లో అడ్మిషన్ల అంశం సందిగ్ధంగా మారింది. అయి తే పదో షెడ్యూల్ సంస్థలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో వేరుపడడం మంచిదికాదన్న ఏపీ అధికారులు తాజాగా భావించారు. -
తెలుగు వర్సిటీ సేవలు గ్రామాలకు విస్తరించాలి
తెలంగాణ విద్యామంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి భాషను బతికించుకోవాలి తెలుగు భాషను పోగొట్టుకుంటే తెలంగాణను పోగొట్టుకున్నట్లే.. ఒగ్గుకళాకారుడు చుక్కా సత్తయ్యకు విశిష్ట పురస్కారం ప్రదానం సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సేవలు గ్రామాలకు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి చెప్పారు. మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం 29వ వ్యవస్థాపన దినోత్సవం-విశిష్ట పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థుల సేవలను సరిగా వినియోగించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. వారిని, వారి కళలను గ్రామస్థాయిలో వివిధ రంగాల్లో ఉపయోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్లబోధన కంటే మూడవ తరగతి వరకు తెలుగు పాఠాల్లోనే పిల్లలను చదివించి, నాలుగు నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే బాగుంటుం దన్నారు. భాష - సంస్కృతిపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, బతుకమ్మ, బోనాలను ఇంగ్లిషులో ఎలా బోధిస్తారని పేర్కొన్నారు. భాషను బతికించుకోవాల్సిన అవసరం చాలా ఉందని, మనకు మనమే తెలుగును నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగు వర్సిటీని విస్తరించుకోవాల్సి ఉందని, తెలుగు భాషను పోగొట్టుకుంటే తెలంగాణను పోగొట్టుకున్నట్లేనని చెప్పారు. తెలంగాణ ప్రభు త్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, భాషను నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రస్తు త పరిస్థితుల్లో ఎంతైనా ఉందన్నారు. భాష-సంస్కృతి-కళాకారులను దృష్టిలో పెట్టుకొని ఆనాటి తెలుగు వర్సిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ, తెలుగు వర్సిటీకి గ్రామీణ నేపథ్యం ఉన్నవారే వస్తారని, వారికి స్కాలర్షిప్లు పెంచాల్సి ఉందన్నారు. అంతకముందు ఒగ్గుకథ కళాకారుడు డాక్టర్ చుక్కా సత్తయ్యకు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. జ్ఞాపికతోపాటు రూ. లక్ష నగదును బహుకరించారు. తనకు ఈ స్థాయి రావడం తెలుగు వర్సిటీ పుణ్యమేనని ఆయన చెప్పారు. అంతర్జాతీయ చిత్రలేఖనంలో కాంస్య పతకం సాధించిన సోనీని అభినందించారు. ప్రజా వాగ్గేయకారులు గోరటి వెంకన్న పాడిన శారదమ్మ పాట అందర్నీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో వర్సిటీ రిజిష్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య, విస్తరణ సేవా విభాగం ఇంచార్జి డాక్టర్ జె.చెన్నయ్య పాల్గొన్నారు.