breaking news
Telugu Academy books
-
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన ఆదిమూలపు సురేష్
సాక్షి, విజయవాడ: తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం విజయవాడలో జరిగింది. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, అకాడమి చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, సంచాలకులు వి. రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘ఏపీ విభజన తర్వాత తెలుగు అకాడమీ హైదరాబాద్‌లో ఉండిపోయింది. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ప్రారంభించాం. తెలుగు, సంస్కృతి అకాడమీగా మార్పు చేసి భాషాభివృద్దికి కృషి చేస్తున్నాం. అకాడమీ ఏర్పాటు తర్వాత మొదటి సారిగా ఇంటర్ పాఠ్యపుస్తకాలని రూపొందించి ముద్రించడం అకాడమీ ఘనవిజయం’’ అన్నారు. (చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’) ‘‘తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో ఇపుడు ముద్రణ జరిగింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి 54 పుస్తకాలని ముద్రించాం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి. డీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకి అనుగుణంగా పుస్తకాలు ముద్రించాం. డిగ్రీ, అనువాద పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక పుస్తకాల ముద్రణకి తెలుగు, సంస్కృత అకాడమీ చర్యలు తీసుకోవాలి. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన తెలుగు అకాడమీ నిధులు, ఉద్యోగుల విషయమై సుప్రీం తీర్పుకి అనుగుణంగా ముందుకు వెళ్తాం. తిరుపతి కేంద్రంగా తెలుగు, సంస్కృతి అకాడమీ నడుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కరించి తెలుగు, సంస్కృత అకాడమీని బలోపేతం చేస్తాం’’ అన్నారు. (చదవండి: తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి) తెలుగు అకాడమీ పుస్తకాలంటే విద్యార్థులకు మక్కువ: లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ విభజనపై ఎపికి అనుకూల మైన తీర్పు వచ్చిందన్నారు తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘వచ్చే నెల మొదటి వారంలోపు తెలుగు అకాడమీ విభజన పూర్తి అవుతుందని భావిస్తున్నాం. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలపై విద్యార్ధులలో మక్కువ ఎక్కువ. పుస్తకాలలో నాణ్యత ఉంటుందని భావిస్తారు. పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాల ముద్రణ కూడా తయారవుతోంది. సీఎం వైఎస్ జగన్ సూచనలకి అనుగుణంగా తెలుగు, సంస్కృతి అకాడమీని తీర్చుదిద్దుతున్నాం’’ చదవండి: ‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’ -
పోటీ పరీక్షలకు అకాడమీ పుస్తకాలు!
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక పుస్తకాలను మార్కెట్లోకి తెచ్చే ఏర్పాట్లు చేసింది. పోటీ పరీక్షల కోసం ఇన్నాళ్లు కోచింగ్‌లకు వెళ్లినా.. మార్పు చేసిన పరీక్షల విధానం, సిలబస్ కారణంగా అకాడమీ రూపొందించే పుస్తకాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా జాతీయ స్థాయి అంశాలకు సంబంధించిన పుస్తకాలను రాయించి ముద్రించింది. వాటితోపాటు జనరల్ స్టడీస్ పుస్తకాలను తెచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో మరిన్ని పుస్తకాలను ప్రొఫెసర్లతో రాయిస్తోంది. త్వరలోనే మరిన్ని పుస్తకాలను తీసుక వస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల పేపర్లు, అందులో వచ్చే వివిధ అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి ఈ కసరత్తు చేపట్టింది. గతంలోనే తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలపై పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన తెలుగు అకాడమీ.. ఇప్పుడు తెలంగాణ చరిత్ర-సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాలను రాయిస్తోంది. వీటితోపాటు భూగోళ శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు సాహిత్యం, భౌగోళిక విజ్ఞాన శాస్త్రం, భూసంస్కరణలపై క్వశ్చన్ బ్యాంకులు రూపొందిస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 లక్ష్యంగా.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వంటి పోటీ పరీక్షలే ప్రధాన లక్ష్యంగా, వాటి సిలబస్ ఆధారంగా పుస్తకాల రచనకు అకాడమీ చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయి సిలబస్ వచ్చిన వెంటనే ఆయా అంశాలతో కొత్త పుస్తకాలను సరిచూసుకొని ముద్రించి మార్కెట్లోకి తేనుంది. ఇప్పటికే జాతీయ స్థాయి అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, రాజ్యాంగం, ప్రభుత్వ పాలన శాస్త్రం, భౌతిక, భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర తదితర పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాల్లో... తెలంగాణ పరిచయం, పూర్వ తెలంగాణ చరిత్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పాలన, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకర్ల వ్యవస్థ, ముసునూరి నాయకులు, బహమని సుల్తాన్లు, కుతుబ్‌షాహీలు, నిజాంల పాలన, హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజాసంఘాలు, కవులు, కళాకారుల పాత్ర తదితర అంశాలను పొందుపరుస్తోంది. ఉపయుక్తంగా ఇంటర్, డిగ్రీ పుస్తకాలు ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్మీడియెట్, డిగ్రీలోని పాఠ్య పుస్తకాలను పోటీ పరీక్షల కోసం సిలబస్‌కు అనుగుణంగా తీసుకొచ్చాయి. సిలబస్‌లోని అంశాలపై ప్రత్యేకంగా పాఠాలు ఉన్నాయి. దీంతో పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ పుస్తకాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో వాటిని పునర్ ముద్రించే పనిలో పడింది. తెలంగాణ చరిత్ర, భూగోళం, ఆర్థికశాస్త్రం, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీలు, జేఏసీల పాత్ర, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇంటర్ పుస్తకాల్లోని ఈ అంశాలు అభ్యర్థులకు ఉపయోగపడనున్నాయి. అలాగే, తెలంగాణకు అనుగుణంగా మార్పు చేసిన డి గ్రీ పుస్తకాల ముద్రణ పైనా తెలుగు అకాడమీ దృష్టి పెట్టింది.