breaking news
Tejavat rancandrunayak
-
కలల లైన్‌కు పచ్చజెండా
కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతించిన రైల్వే బోర్డు యాన్యుటీ పద్ధతిలో ఐదేళ్ల నష్టాలనూ భరించాల్సిందే సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లా ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రాజధానితో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. కరీంనగర్ నుంచి సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే బోర్డు కార్యనిర్వాహక సంచాలకుడు అంజుమ్ పర్వేజ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో దాదాపు 149 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాదాపు పదేళ్ల కింద కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడి మేరకు రైల్వే శాఖ ఈ లైన్ సర్వేకు సమ్మతించగా.. ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో ఆయన ప్రయత్నం ఫలించి పనులు ప్రారంభించేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 925 కోట్లు అవసరమవుతాయని తాజా అంచనా. మనోహరాబాద్ లైన్‌తో లింకు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు ఈ రైల్వేలైన్ నిర్మించనున్నారు. అయితే హైదరాబాద్ శివారులోని బొల్లారంలో రక్షణ శాఖ భూములుండటంతో... ఈ లైన్‌ను నేరుగా సికింద్రాబాద్ స్టేషన్‌తో అనుసంధానం చేయడం సాధ్యం కాలేదు. దీంతో సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైన్‌కు మనోహరాబాద్ వద్ద అనుసంధానిస్తారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ దాటిన తరువాత మనోహరాబాద్ వస్తుంది. అక్కడి నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మండలాల నుంచి కరీంనగర్ శివారులోని కొత్తపల్లికి ఈ రైల్వేలైన్ చేరుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నేరుగా వేములవాడ పుణ్యక్షేత్రానికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. మూడు షరతులకు ఓకే అన్నాకే.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ అంత సులభంగా అంగీకరించలేదు. నష్టాలను బూచిగా చూపి షరతుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపింది. వాటి ప్రకారం.. నిర్మాణ వ్యయంలో మూడోవంతు (33 శాతం) భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత లెక్కన దాదాపు రూ. 308 కోట్లను రాష్ట్రం భరించాలి. ఇక భూసేకరణ భారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. దీనికితోడు ఐదేళ్లదాకా ఏవైనా నష్టాలు వస్తే.. వాటిని రాష్ట్రప్రభుత్వమే భరించాలనే (యాన్యుటీ విధానం) షరతు కూడా ఉంది. వీటన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో... రైల్వే లైన్‌కు ఆమోదం వచ్చింది. కేసీఆర్ ప్రతిపాదన ఇదీ... ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలల ప్రాజెక్టు ఇదని, 2004లో ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు దీనికి ప్రతిపాదన చేశారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, తేజావత్ రాంచంద్రు, ఎంపీ వినోద్‌కుమార్ బుధవారం వెల్లడించారు. 2006-07 బడ్జెట్లోనే సర్వేకోసం దీన్ని పొందుపరిచారని, దక్షిణ మధ్య రైల్వే సమగ్ర అంచనా నివేదికను తయారు చేసి రైల్వే బోర్డుకు ఇచ్చిందని వారు చెప్పారు. ‘‘సాధారణంగా రేట్ ఆఫ్ రిటర్న్ (ఆర్ఓఆర్) 14 శాతం ఉంటే గానీ కొత్త రైల్వేలైన్ మంజూరు చేయరు. ఈ లైన్ ఆర్ఓఆర్ 2.64 శాతం మాత్రమే ఉండడంతో.. కేంద్రం పలు షరతులు పెట్టింది. టీఆర్ఎస్ 2006లో యూపీఏ నుంచి వైదొలిగింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో కదలిక లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. మేం ముగ్గురం తరచుగా రైల్వే బోర్డు అధికారులను కలసి ఒత్తిడి తెచ్చాం. దాంతో పాటు షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో దీనికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. వెనకబడిన ప్రాంతంలో కొత్త రైల్వే లైను రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రైలు మార్గం ద్వారా భవిష్యత్‌లో సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా ఢిల్లీకి రైలు సౌకర్యం ఏర్పడే అవకాశముంది.’’ అని వారు పేర్కొన్నారు. -
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాంచంద్రునాయక్
డోర్నకల్, న్యూస్‌లైన్ : మాజీ ఐఏఎస్ అధికారి తేజావత్ రాంచంద్రునాయక్ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యూరు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆయనను నియమించారు. కురవి మండలం సీరోలు శివారు రూప్లాతండాకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి రాంచంద్రునాయక్ మూడు నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొదటి నుంచీ తెలంగాణవాది అయిన రాంచంద్రునాయక్ టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యునిగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాంచంద్రునాయక్.. కేంద్రం, రాష్ట్రానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. రైతు కుటుంబానికి చెందిన రాంచంద్రునాయక్ ఐఏఎస్ అధికారిగా కీలక పదవులు నిర్వహించారు. మొదట ఐపీఎస్‌గా సెలక్ట్ అయినా శిక్షణ పొందే సమయంలో ఐఏఎస్‌గా సెలెక్ట్ అయ్యారు. సీరోలులో ప్రాథమిక విద్య, మహబూబాబాద్‌లో ఇంటర్మీడియట్ చదివారు. 1971 నుండి 1975 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ సిస్టం పూర్తి చేశారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత 1983లో బీహార్ కేడర్ ఐపీఎస్‌కు ఎంపికై.. ఈ ప్రాంతం నుంచి ఐపీఎస్ సాధించిన మొదటి గిరిజనుడిగా రికార్డు సృష్టించారు. ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐఏఎస్‌గా ఒరిస్సా కేడర్‌కు ఎంపికయ్యారు. 1991-92లో ఒరిస్సాలోని నవరంగపూర్ జిల్లా కలెక్టర్‌గా, 1992-93లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ భారత ప్రభుత్వ కార్యదర్శిగా, డిఫెన్స్ కార్యదర్శిగా, ఒరిస్సా గవర్నర్ కార్యదర్శిగా రెండు సార్లు పనిచేశారు. అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్గోమాంగో వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఒరిస్సా రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ 2013 ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ఐఏఎస్‌గా కేంద్రంలో పలు కీలక పదవులు నిర్వహించిన రాంచంద్రునాయక్‌కు గుర్తింపునిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు.