team selction
-
ఆటగాళ్ల ఎంపికపై ‘సెలక్షన్ షీట్’
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో పాల్గొనే హైదరాబాద్ జట్ల ఎంపికలో మరింత పారదర్శకత పాటిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆపరేషన్స్ హెడ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు. ప్రతిభ గల ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ‘సెలక్షన్ షీట్’ను తీసుకొస్తున్నామని అతను చెప్పాడు. దీని ప్రకారం ఇకపై ఎవరిని జట్టులోకి ఎంపిక చేసినా అందుకు తగిన కారణం, వారి ప్రదర్శన వివరాలతో పాటు ఎవరినైనా తప్పిస్తే అందుకు గల కారణాలను కూడా రాతపూర్వకంగా నమోదు చేస్తారు. కాబట్టి క్రికెటర్ల ఎంపిక ఎవరికీ అనుమానాలు లేని రీతిలో సాగుతుందని రాయుడు స్పష్టం చేశాడు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి ఎం.జీవన్ రెడ్డితో కలిసి రాయుడు ఈ వివరాలు వెల్లడించాడు. త్వరలోనే ఓపెన్ సెలక్షన్స్ కూడా నిర్వహిస్తామని... హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే విషయంలో కూడా మూడు అంచెల్లో ఎంపిక జరుగుతుందని అతను వివరించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీలను రాయుడు ప్రకటించాడు. సీనియర్ సెలక్షన్ కమిటీకి అక్షత్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనుండగా... తిరుమలశెట్టి సుమన్, మెహదీ హసన్, టి.పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. పి.రమేశ్ కుమార్, షోయబ్, సర్వేశ్ కుమార్, టిమోతీ కుమార్ సభ్యులుగా ఉన్న జూనియర్ సెలక్షన్ కమిటీకి ఆకాశ్ భండారీని చైర్మన్‌గా ఎంపిక చేశారు. -
టి20 ప్రపంచ కప్ వంతు
‘గత ప్రపంచ కప్ విజయం ఎంతో ప్రత్యేకం... కానీ మేం చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. ఫార్మాట్లు వేరైనా తీవ్రతలో తేడా లేదు’... భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్య ఇది. 2025లో వన్డే వరల్డ్ కప్ గెలిచి ఈ ఫార్మాట్లో ప్రపంచ కప్ లేని లోటు తీర్చుకున్న భారత్ ఇప్పుడు టి20 ప్రపంచకప్‌పై గురి పెట్టింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యుల టీమ్‌ను బీసీసీఐ విభిన్న రీతిలో ప్రకటించింది. హర్మన్, కోచ్ అమోల్ మజుందార్ వ్యాఖ్యల తర్వాత ఆటగాళ్లు పేర్లు వరుసగా వెల్లడిస్తూ ఆపై అభిమానుల అంచనాలతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ద్వారా సెలక్షన్ వివరాలను చెప్పడం విశేషం.ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టును శనివారం సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అమితా శర్మ నేతృత్వంలోని బృందం ఎలాంటి సంచలనాలు, అనూహ్య ఎంపికలకు అవకాశం ఇవ్వకుండా టీమ్‌ను వెల్లడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి సారథిగా బాధ్యతలు నిర్వర్తించనుండగా, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 5 వరకు ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ టోర్నీకి ముందు సన్నాహకంగా ఇంగ్లండ్‌తోనే భారత్ 3 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇప్పటి వరకు జరిగిన 9 టి20 వరల్డ్ కప్‌లలోనూ పాల్గొన్న భారత్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2020లో రన్నరప్‌గా నిలవడమే జట్టు అత్యుత్తమ ప్రదర్శన. హర్మన్ నాయకత్వంలో ఐదో సారి భారత్ టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగుతోంది. నందనికి తొలి చాన్స్... దక్షిణాఫ్రికాతో ఇటీవల టి20 సిరీస్ ఆడిన జట్టులో స్వల్ప మార్పులతో వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించారు. ఈ సిరీస్ కోసం జట్టులో ఉన్న అనుష్క శర్మ, ఉమా ఛెత్రి తమ స్థానాలు కోల్పోయారు. కాశ్వీ గౌతమ్ గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. గాయంనుంచి కోలుకోకపోవడంతో దక్షిణాఫ్రికా టూర్‌కే వెళ్లని ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్‌ను కూడా వరల్డ్ కప్ కోసం పరిశీలించలేదు. మెగా టోర్నీ కోసం ముగ్గురు ప్లేయర్లు నందని శర్మ, రాధ యాదవ్, యస్తిక భాటియాలను ఎంపిక చేశారు. రెండేళ్ల క్రితం భారత్‌కు చివరి సారి టి20 మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్ యస్తిక వరుస గాయాలతో ఇబ్బంది పడింది. ఎట్టకేలకు ఆమె ఇప్పుడు పునరాగమనం చేసింది. ఈ స్థానం కోసం ప్రతీక రావల్ పేరు కూడా పరిశీలించామని... అయితే అనుభవజు్ఞరాలైన యస్తికకు ఓటు వేసినట్లు చీఫ్ సెలక్టర్ అమితా శర్మ వెల్లడించింది. అమన్‌జోత్, కాశ్వీ దూరం కావడంతో సీనియర్ ఆల్‌రౌండర్ అవసరం ఏర్పడింది. దాంతో రాధ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెప్పారు. పేస్ బౌలర్ నందని శర్మకు మాత్రం భారత్ తరఫున ఇదే తొలి అవకాశం కావడం విశేషం. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని నేరుగా వరల్డ్ కప్‌కే ఎంపికైంది. డబ్ల్యూపీఎల్‌లో 17 వికెట్లతో ఆమె ఆకట్టుకునే ప్రదర్శన నమోదు చేసింది. జట్టులో అరుంధతి, శ్రీచరణి... గత కొంత కాలంగా భారత జట్టులో రెగ్యులర్ సభ్యులుగా ఉన్న తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, నల్లపురెడ్డి శ్రీచరణి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలోనూ వీరిద్దరు జట్టులో భాగంగా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి ఇప్పటి వరకు 49 టి20ల్లో 7.78 ఎకానమీతో 46 వికెట్లు పడగొట్టగా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి 17 టి20ల్లో 7.60 ఎకానమీతో 24 వికెట్లు తీసింది. మరో వైపు శ్రీచరణికి భారత టెస్టు టీమ్‌లో కూడా తొలి సారి చోటు దక్కడం విశేషం. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత్ జులై 10 నుంచి 13 వరకు లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడుతుంది. ఈ టెస్టులో పాల్గొనే జట్టును కూడా సెలక్టర్లు శనివారమే ప్రకటించారు.పాక్ మ్యాచ్‌తో మొదలు... టి20 వరల్డ్ కప్ ఫార్మాట్లో మార్పు లేకుండా ఎప్పటిలాగే 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని ఐదు టీమ్‌లతో తలపడుతుంది. టాప్–2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ‘1’లో ఉన్న భారత్ వరుసగా పాకిస్తాన్ (జూన్ 14), నెదర్లాండ్స్ (జూన్ 17), దక్షిణాఫ్రికా (జూన్ 21), బంగ్లాదేశ్ (జూన్ 25), ఆ్రస్టేలియా (జూన్ 28)లతో తలపడుతుంది. -
పాక్ సీనియర్ ఆటగాళ్లపై వేటు
కరాచీ: కొంత కాలంగా పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా తయారైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథులు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతోపాటు పేసర్ మొహ్మమ్మద్ అమీర్‌పై వేటు పడింది. జింబాబ్వేతో ఆరంభమయ్యే వన్డే, టి20 సిరీస్‌ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో వీరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చోటు కల్పించలేదు. అయితే ఇటీవల ముగిసిన దేశవాళీ టి20 లీగ్ నేషనల్ టి20 కప్‌లో రాణించిన సెంట్రల్ పంజాబ్ జట్టు యువ ఆటగాడు అబ్దుల్లా షఫీక్‌కు మొదటిసారి సీనియర్ జట్టులో స్థానం లభించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని పేస్ ద్వయం హసన్ అలీ, నసీమ్ షా పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ను నియమించిన పీసీబీ... వైస్ కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను నియమించింది. పాక్, జింబాబ్వే మధ్య తొలి వన్డే ఈనెల 30న జరగనుండగా... నవంబర్ 1, 3వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం నవంబర్ 7, 8, 10వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. మా వీసాల అంశాన్ని ఐసీసీ చూస్తుంది భారత్‌లో ఆడేందుకు తలెత్తే వీసా ఇబ్బందులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చూసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వీసాల బాధ్యత పూర్తిగా ఐసీసీదేనని పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ తెలిపారు. ఐసీసీ ఈ అంశంపై తమకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే దేనికైనా నిర్దిష్ట గడువు అంటూ ఉండాలని వచ్చే జనవరిదాకా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు చెప్పారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమీప భవిష్యత్తులో ముఖాముఖి టోర్నీలు జరుగుతాయన్న ఆశలేవీ లేవని ఆయన చెప్పారు. -
ఆదివారానికి వాయిదా!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరుగనున్న మూడు టి20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌కు శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్ జట్టు ఎంపిక ఆదివారానికి వాయిదా పడింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంతవరకు అందుబాటులో ఉంటాడు? వెటరన్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం రెండు రోజుల తర్వాతే లభించనుంది. శుక్రవారం నాటి సమావేశం వాయిదాకు బీసీసీఐ కొత్త రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధన ఒక కారణం కాగా, అందరు ఆటగాళ్ల ఫిట్నెస్ నివేదికలు శనివారం నాటికి అందే వీలుండటం మరో కారణంగా తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి ఇప్పటివరకు సెలక్షన్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టు ఎంపిక వివరాలు ఆయన పేరిటే విడుదలయ్యేవి. కొత్త రాజ్యాంగం ప్రకారం కార్యదర్శిని ఈ బాధ్యత నుంచి తప్పించారు. సెలక్షన్ కమిటీ ఛైర్మనే... కన్వీనర్‌గా ఉంటారు. ఈ విషయమై క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ), బీసీసీఐ మధ్య సంఘర్షణ నెలకొంది. కొత్త నిబంధన ప్రకారం క్రికెట్ కమిటీ సమావేశాల్లో బోర్డు ఆఫీస్ బేరర్లు, సీఈఓ పాల్గొనడానికి వీల్లేదు. మరోవైపు విజయ్ శంకర్, శిఖర్ ధావన్‌ల ఫిట్నెస్ నివేదికలు కూడా ఇంకా బోర్డు అందలేదు. దాంతో జట్టు ఎంపికను ఆదివారానికి వాయిదా వేశారు. -
13న అండర్–16 బాలికల క్రికెట్ జట్టు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 13న అండర్–16 బాలికల క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. కడపలో ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే అండర్–16 బాలికల అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో పాల్గొనే అనంతపురం జిల్లా జట్టుకు 13న ఉదయం 9 గంటలకు అనంత క్రీడాగ్రామంలో క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 1, 2000 సంవత్సరంలోపు పుట్టిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారిణులు యూనిఫాంతో హాజరుకావాలన్నారు.


