టోర్నీకి భారత జట్టు ప్రకటన
మెగా టోర్నీ వేటలో హర్మన్ బృందం
‘గత ప్రపంచ కప్ విజయం ఎంతో ప్రత్యేకం... కానీ మేం చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. ఫార్మాట్‌లు వేరైనా తీవ్రతలో తేడా లేదు’... భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్య ఇది. 2025లో వన్డే వరల్డ్ కప్ గెలిచి ఈ ఫార్మాట్‌లో ప్రపంచ కప్ లేని లోటు తీర్చుకున్న భారత్ ఇప్పుడు టి20 ప్రపంచకప్‌పై గురి పెట్టింది.
ఈ మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యుల టీమ్‌ను బీసీసీఐ విభిన్న రీతిలో ప్రకటించింది. హర్మన్, కోచ్ అమోల్ మజుందార్ వ్యాఖ్యల తర్వాత ఆటగాళ్లు పేర్లు వరుసగా వెల్లడిస్తూ ఆపై అభిమానుల అంచనాలతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ద్వారా సెలక్షన్ వివరాలను చెప్పడం విశేషం.
ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టును శనివారం సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అమితా శర్మ నేతృత్వంలోని బృందం ఎలాంటి సంచలనాలు, అనూహ్య ఎంపికలకు అవకాశం ఇవ్వకుండా టీమ్‌ను వెల్లడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి సారథిగా బాధ్యతలు నిర్వర్తించనుండగా, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది.
ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 5 వరకు ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ టోర్నీకి ముందు సన్నాహకంగా ఇంగ్లండ్‌తోనే భారత్ 3 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇప్పటి వరకు జరిగిన 9 టి20 వరల్డ్ కప్‌లలోనూ పాల్గొన్న భారత్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2020లో రన్నరప్‌గా నిలవడమే జట్టు అత్యుత్తమ ప్రదర్శన. హర్మన్ నాయకత్వంలో ఐదో సారి భారత్ టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగుతోంది.
నందనికి తొలి చాన్స్...
దక్షిణాఫ్రికాతో ఇటీవల టి20 సిరీస్ ఆడిన జట్టులో స్వల్ప మార్పులతో వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించారు. ఈ సిరీస్ కోసం జట్టులో ఉన్న అనుష్క శర్మ, ఉమా ఛెత్రి తమ స్థానాలు కోల్పోయారు. కాశ్వీ గౌతమ్ గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. గాయంనుంచి కోలుకోకపోవడంతో దక్షిణాఫ్రికా టూర్‌కే వెళ్లని ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్‌ను కూడా వరల్డ్ కప్ కోసం పరిశీలించలేదు. మెగా టోర్నీ కోసం ముగ్గురు ప్లేయర్లు నందని శర్మ, రాధ యాదవ్, యస్తిక భాటియాలను ఎంపిక చేశారు. రెండేళ్ల క్రితం భారత్‌కు చివరి సారి టి20 మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్ యస్తిక వరుస గాయాలతో ఇబ్బంది పడింది.
ఎట్టకేలకు ఆమె ఇప్పుడు పునరాగమనం చేసింది. ఈ స్థానం కోసం ప్రతీక రావల్ పేరు కూడా పరిశీలించామని... అయితే అనుభవజు్ఞరాలైన యస్తికకు ఓటు వేసినట్లు చీఫ్ సెలక్టర్ అమితా శర్మ వెల్లడించింది. అమన్‌జోత్, కాశ్వీ దూరం కావడంతో సీనియర్ ఆల్‌రౌండర్ అవసరం ఏర్పడింది. దాంతో రాధ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెప్పారు. పేస్ బౌలర్ నందని శర్మకు మాత్రం భారత్ తరఫున ఇదే తొలి అవకాశం కావడం విశేషం. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని నేరుగా వరల్డ్ కప్‌కే ఎంపికైంది. డబ్ల్యూపీఎల్‌లో 17 వికెట్లతో ఆమె ఆకట్టుకునే ప్రదర్శన నమోదు చేసింది.
జట్టులో అరుంధతి, శ్రీచరణి...
గత కొంత కాలంగా భారత జట్టులో రెగ్యులర్ సభ్యులుగా ఉన్న తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, నల్లపురెడ్డి శ్రీచరణి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలోనూ వీరిద్దరు జట్టులో భాగంగా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి ఇప్పటి వరకు 49 టి20ల్లో 7.78 ఎకానమీతో 46 వికెట్లు పడగొట్టగా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి 17 టి20ల్లో 7.60 ఎకానమీతో 24 వికెట్లు తీసింది. మరో వైపు శ్రీచరణికి భారత టెస్టు టీమ్‌లో కూడా తొలి సారి చోటు దక్కడం విశేషం. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత్ జులై 10 నుంచి 13 వరకు లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడుతుంది. ఈ టెస్టులో పాల్గొనే జట్టును కూడా సెలక్టర్లు శనివారమే ప్రకటించారు.
పాక్ మ్యాచ్‌తో మొదలు...
టి20 వరల్డ్ కప్ ఫార్మాట్‌లో మార్పు లేకుండా ఎప్పటిలాగే 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని ఐదు టీమ్‌లతో తలపడుతుంది. టాప్–2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ‘1’లో ఉన్న భారత్ వరుసగా పాకిస్తాన్ (జూన్ 14), నెదర్లాండ్స్ (జూన్ 17), దక్షిణాఫ్రికా (జూన్ 21), బంగ్లాదేశ్ (జూన్ 25), ఆ్రస్టేలియా (జూన్ 28)లతో తలపడుతుంది.


