ఆటగాళ్ల ఎంపికపై ‘సెలక్షన్‌ షీట్‌’ | Ambati Rayudu announces new HCA selection panels | Sakshi
Sakshi News home page

ఆటగాళ్ల ఎంపికపై ‘సెలక్షన్‌ షీట్‌’

May 12 2026 6:01 AM | Updated on May 12 2026 6:01 AM

Ambati Rayudu announces new HCA selection panels

హెచ్‌సీఏలో కొత్త విధానం

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనే హైదరాబాద్‌ జట్ల ఎంపికలో మరింత పారదర్శకత పాటిస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆపరేషన్స్‌ హెడ్, మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు వెల్లడించాడు. ప్రతిభ గల ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ‘సెలక్షన్‌ షీట్‌’ను తీసుకొస్తున్నామని అతను చెప్పాడు. దీని ప్రకారం ఇకపై ఎవరిని జట్టులోకి ఎంపిక చేసినా అందుకు తగిన కారణం, వారి ప్రదర్శన వివరాలతో పాటు ఎవరినైనా తప్పిస్తే అందుకు గల కారణాలను కూడా రాతపూర్వకంగా నమోదు చేస్తారు. కాబట్టి క్రికెటర్ల ఎంపిక ఎవరికీ అనుమానాలు లేని రీతిలో సాగుతుందని రాయుడు స్పష్టం చేశాడు. 

సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి ఎం.జీవన్‌ రెడ్డితో కలిసి రాయుడు ఈ వివరాలు వెల్లడించాడు. త్వరలోనే ఓపెన్‌ సెలక్షన్స్‌ కూడా నిర్వహిస్తామని... హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించే విషయంలో కూడా మూడు అంచెల్లో ఎంపిక జరుగుతుందని అతను వివరించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సీనియర్, జూనియర్‌ సెలక్షన్‌ కమిటీలను రాయుడు ప్రకటించాడు. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీకి అక్షత్‌ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనుండగా... తిరుమలశెట్టి సుమన్, మెహదీ హసన్, టి.పవన్‌ కుమార్, ఇంద్రశేఖర్‌ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. పి.రమేశ్‌ కుమార్, షోయబ్, సర్వేశ్‌ కుమార్, టిమోతీ కుమార్‌ సభ్యులుగా ఉన్న జూనియర్‌ సెలక్షన్‌ కమిటీకి ఆకాశ్‌ భండారీని చైర్మన్‌గా ఎంపిక చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement