breaking news
Tamil Nadu Gang
-
అదే గ్యాంగ్.. మరో క్రైమ్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.10లో బుధవారం పట్టపగలు కత్తులతో బెదిరించి వాహనం దోచుకెళ్లిన ముఠా గురువారం కూడా పంజా విసిరింది. చోరీ వాహనం పైనే సంచరిస్తూ పాతబస్తీలోని బహదూర్‌పుర ప్రాంతంలో మరో దోపిడీకి యత్నించింది. ఈ నేరమూ పట్టపగలే జరగడం గమనార్హం. ప్రాథమిక ఆధారాలను బట్టి తమిళనాడుకు చెందిన ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. జూబ్లీహిల్స్ ఉదంతం మాదిరిగానే బహదూర్‌పుర యత్నమూ ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. బుధవారం ‘న్యూ’... గురువారం ‘ఓల్డ్’... బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్న యాదగిరి నుంచి ముగ్గురు దుండగులు బుధవారం ఉదయం బైక్, సెల్ఫోన్లు, పర్సు లాక్కెళ్లారు. ఈ ఉదంతం న్యూ సిటీలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో చోటు చేసుకుంది. గురువారం ఇదే ముఠా ఓల్డ్ సిటీలో ఉన్న బహదూర్పు ప్రాంతంలో పంజా విసిరింది. అక్కడి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ వద్దకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అదే బైక్‌పై వచ్చిన దుండగుల్లో ఇద్దరు వాహనంతో బయటే వేచి ఉండగా... మరొకరు బ్యాంకు లోపలకు వెళ్లి నగదు లావాదేవీలు చేస్తున్న వారిని దాదాపు అర్ధగంటకు పైగా గమనించాడు. ఈ దృశ్యాలు బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రూ.70 వేలు దోపిడీకి యత్నం... రామ్నాస్‌పురాకు చెందిన విద్యార్థి అబ్దుల్లా రూ.70 వేల నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చాడు. అప్పటికే బ్యాంక్‌లో డిపాజిట్లు స్వీకరించే సమయం మించిపోవడంతో అధికారులు నగదు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో అబ్బుల్లా డబ్బుతో తిరిగి వెళ్తుండగా, ఇతడి వెనుకే బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన దుండగుడు మిగిలిన ఇద్దరినీ కలిశాడు. ముగ్గురూ కలిసి అబ్దుల్లాను వెంబడించారు. అక్కడి పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే మలుపు వద్ద అబ్దుల్లా బైక్‌ను అడ్డుకున్నారు. కత్తితో బెదిరించి నగదును లాక్కునేందుకు ప్రయత్నించగా, అబ్దుల్లా ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకునే లోగా దుండగులు ఫలక్‌నుమ వైపు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్నారు. షెల్టర్, డబ్బు లేవా? సిటీలో వరుస నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు ఇక్కడ షెల్టర్, వారి వద్ద నగదు లేకపోవచ్చునేని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి రైల్వేస్టేషన్లు, బస్టాపుల్లో తలదాచుకుని పగటిపూట నేరాలకు పాల్పడుతున్నారని అంచనా వేస్తున్నారు. వీరు రెండు ఉదంతాల్లోనూ కేవలం డబ్బులు మాత్రమే డిమాండ్ చేయడాన్ని బట్టి వీరి వద్ద నగదు కూడా లేకపోవచ్చునని తెలిపారు. బుధవారం నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 నేరం చేసిన తర్వాత వీరి కదలికలు రసూల్‌పుర చౌరస్తా వరకు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ తర్వాతి ప్రాంతం గోపాలపురం పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. అయితే బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఆ ఠాణా పరిధిలోని సీసీ కెమెరాలు పని చేయలేదు. దీంతో వీరి కదలికలను పూర్తిగా కనిపెట్టలేకపోయారు. గురువారం పాతబస్తీ ఉదంతం నేపథ్యంలో ఆ పరిసరాల్లోని అన్ని సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు. ‘గోప్యతే’ వారికి కలిసి వస్తోందా? ఈ గ్యాంగ్ నేరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. రెండు ఉదంతాలూ ఓ రోజు ఆలస్యంగానే వెలుగులోకి వచ్చాయి. ఇది కూడా దుండగులకు కలిసి వస్తున్న అంశంగా మారిందనే వాదన వినిపిస్తోంది. జూబ్లీహిల్స్‌లో దోపిడీ చేసిన వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తూ బహదూర్‌పుర వరకు వచ్చారు. నిబంధనల ప్రకారం ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనే అయినప్పటికీ కనీసం ట్రాఫిక్ పోలీసుల కంట్లోనూ వారు పడకపోవడం గమనార్హం. మొదటి నేరం జరిగినప్పుడే వాహనం వివరాలు, దుండగుల కవళికలు, వస్త్రధారణ, ప్రవర్తనలపై పోలీసులు విస్త్రృత స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేస్తే దుండగులు దొరకడమో, రెండో నేరం జరగకపోవడమో అయ్యేది. పోలీసుల గోప్యతను తమకు అనువుగా మార్చుకున్న ముఠా వరుసపెట్టి సవాల్ విసురుతోంది. ఏఎన్పీఆర్ వ్యవస్థ అమలైతే... ప్రస్తుతం ట్రాఫిక్ విభాగం ఐటీఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఏర్పాటు తుది దశలో ఉన్న ఈ వ్యవస్థలో ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) విధానం కూడా ఉంది. సాఫ్ట్వేర్ ఆధారంగా పని చేసే ఇందులో ఓ వాహనం నెంబర్‌ను ఫీడ్ చేస్తే... నగరంలోని ఏ సీసీ కెమెరా ముందుకైనా ఆ వాహనం వస్తే తక్షణం గుర్తించి, కంట్రోల్ సెంటర్లోని సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. జూబ్లీహిల్స్ నేరం జరిగిన వెంటనే ఆ వాహనం నెంబర్‌ను ఇందులో పొందుపరిస్తే దుండుగుల ఎక్కడ సంచరించినా తెలిసే ఆస్కారం ఉంటుంది. ఐటీఎంఎస్ ఇంకా ఏర్పాటు దశలోనే ఉండటం సైతం ఈ నేరగాళ్ళకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇలాంటి అత్యాధునిక వి«ధానాలు ప్రస్తుతం లేకపోవడం, నేరాలపై గోప్యత పాటించడంతో దుండగులు రెచ్చిపోతున్నా పోలీసులు చోద్యం చూడాల్సి వచ్చింది. అదే బైక్.. అదే డ్రస్సు ప్రాథమికంగా సేకరించిన సమాచారం, వారి ముఖ కవళిక ఆధారంగా దక్షిణాదికి చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులను విచారించగా, నిందితులు ‘పైసే పైసే’ అంటూ సైగలతో డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిపారు. యాదగిరితో మాత్రం కొన్ని మాటలు మాట్లాడారు. తనకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు వచ్చని, దుండగులు వినియోగించింది ఈ మూడూ కాదని చెప్పాడు. దీంతో వీరు తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌గా భావిస్తున్నారు. బుధవారం దోపిడీ సమయంలో దుండగులు ధరించిన వస్త్రాలే గురువారమూ ధరించారు. జూబ్లీహిల్స్‌లో దోపిడీ చేసిన ఎఫ్‌జెడ్ బైక్ (టీఎస్ 09 ఈడబ్ల్యూ 8970) బహదూర్‌పురలో వాడారు. -
హైవే కిల్లర్స్ ఘాతుకం
కావలి : చెన్నై నుంచి హైదరాబాద్‌కు స్టీల్ సామాన్లతో వెళ్తున్న లారీని కొందరు దుండగులు హైజాక్ చేశారు. ఆ లారీ డ్రైవర్‌ను గొంతు కోసి హత్య చేసి క్యాబిన్‌లోనే పడేశారు. హైజాక్‌కు గురైన లారీని, దుండగులను పోలీ సులు శనివారం గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం మేరకు.. కావలి, ప్రకాశం జిల్లా పోలీసుల కథనం మేరకు.. చెన్నె నుంచి హైదరాబాద్‌కు స్టీల్ సామానులతో లారీ లోడ్లు ప్రతి రోజూ బయలు దేరుతాయి. శరవణన్ ట్రావెల్స్‌కు చెందిన ఓ లారీ 4వ తేదీ రాత్రి సామానులతో బయలుదేరింది. ఆ లారీకి దొరవారిసత్రం మండలం ఏకొల్లుకు చెందిన బండిళ్ల దయాసాగర్ (48) డ్రైవర్‌గా వెళుతున్నాడు. మార్గమధ్యలో దయాసాగర్ ఇంటికి వెళ్లి కొద్దిసేపు గడిపి హైదరాబాద్‌కు బయలు దేరాడు. 5వ తేదీ రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరాల్సి ఉంది. కానీ లారీ చేరలేదు. ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద చెన్నై వైపు అదే కంపెనీకి చెందిన మరో లారీ శనివారం ఉదయం వెళుతుంది. అదే సమయంలో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన లారీ తన లారీని క్రాస్చేసిపోవడంతో అనుమానం వచ్చిన ఆ లారీ డ్రైవర్ దయాసాగర్‌కు ఫోన్ చేశాడు. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ ట్రావెల్స్ మేనేజర్ గురువేంద్రకు ఫోన్ చేసి చెప్పాడు. అతను ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు జాతీయ రహదారిపై గాలింపు చర్యలు చేపట్టారు. హైజాక్‌కు గురైన లారీ కావలి వరకు వెళ్లి తిరిగి చాగల్లు వద్ద ఉన్న ఓ డాబా వద్ద ఆగి ఉంది. కావలి ఒకటో పట్టణ సీఐ వెంకట్రావు, ఇతర సిబ్బంది ఆ లారీని గుర్తించారు. లారీలో పరిశీలించగా క్యాబిన్లో డ్రైవర్ దయాసాగర్‌ను గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించా రు. క్యాబిన్లో రక్త గాయాలు, రక్తం అంటిన బ్లేడ్లు కనిపించాయి. ఆ లారీని ఎవరు ఆపారని స్థానికంగా విచారించగా పక్కనే ఉన్న ఓ మద్యం దుకాణం పక్కన ఖాళీ స్థలంలో మద్యం సేవిస్తున్న ముగ్గురిని స్థానికులు చూపించినట్లు తెలుస్తుంది. దీంతో వారిని సీఐ వెంకట్రావు అదుపులోకి తీసుకుని కందుకూరు పోలీసులకు అప్పగించారు. ముగ్గురిని ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే లారీ ట్రావెల్స్ మేనేజర్ గురువేంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితమే కుమార్తెకు వివాహం చేశాడు. కందుకూరు, కావలి సీఐలు లక్ష్మణ్, వెంకటరావు, కందుకూరు ఎస్సై రమణయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ లారీలు వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణవిగా తెలుస్తుంది. తమిళనాడు ముఠా పనే ఈ సంఘటకు పాల్పడింది తమిళనాడుకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులో తీసుకున్న వారిలో కళవరమూర్తి, మణివన్నన్, మణిగా పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో వీరు ఇలాగే లారీలను హైజాక్ చేసినట్లు పోలీసులు అనుమానంతో విచారిస్తున్నట్లు తెలుస్తుంది.