వానొస్తే అంతే!
♦ చిన్నపాటి చినుకులకే పొంగుతున్న నాలాలు
♦ కానరాని ముందు జాగ్రత్త చర్యలు
♦ మేలుకోని అధికారులు
♦ వర్షాకాలంలో పొంచి ఉన్న ముప్పు
సాక్షి, సిటీబ్యూరో : ‘స్వచ్ఛ హైదరాబాద్’ పేరిట ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పారిశుధ్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా చెత్త, డెబ్రిస్‌ను భారీ మొత్తంలో తరలిస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు కొంత మెరుగయ్యాయని ప్రజలు భావిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. ఈ పని పేరిట దాదాపు నెల రోజులుగా జీహెచ్ఎంసీ యంత్రాంగం మిగిలిన పనులను పక్కన పెట్టేసింది. సమస్త సిబ్బంది ఈ కార్యక్రమంలోనే నిమగ్నమయ్యారు. దీంతో మిగతా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పేటట్టు లేదు.
వానా కాలంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు వేసవిలోనే కొన్ని పనులు పూర్తి చేయాలి. నాలాల్లో పూడిక తొలగింపు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా అవసరమైన మరమ్మతులు, వర్షాలు అధికమైతే ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాల నియామకం తదితరమైనవి వీటిలో ఉన్నాయి. శిథిల భవనాలను తొలగించే పనులూ వేసవిలోనే పూర్తి చేయాలి. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. నగరంలో ముంపు సమస్యలకుప్రధాన కారణం నాలాలు. స్వచ్ఛ హైదరాబాద్‌లో సీఎం పర్యటనలో సైతం ప్రజలు నాలాలతో తలెత్తే ఇబ్బందులనే ప్రధానంగా ప్రస్తావించారు.
వీటిలో పూడిక పేరుకుపోయి... నాలుగు చినుకులు పడినా... రాదారులు గోదారులు కావడం... తాగునీరు-మురుగునీరు కలిసిపోవడం... ఇళ్లలోకి నీరు చేరడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో నాలాల్లో పూడికతీత పనులను గత ఫిబ్రవరిలోనే కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇవి సగం కూడా పూర్తి కాలేదు. మరవైపు వర్షాకాలం ముంచుకొస్తోంది. ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.
ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక చేసేందుకు కూడా అవకాశం ఉండదు. ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారు. కొంత వెసులుబాటు చేసుకొని వానాకాల సమస్యల నిరోధంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.
►రోడ్లపై నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకోనంత వరకు ఏంచేసినా ప్రయోజనం ఉండదు. వర్షం వెలిశాక గంట తర్వాత కూడా నీరు నిల్వ ఉంటున్న ప్రాంతాల జాబితాను ట్రాఫిక్ పోలీసులు అధికారులకు అందజేశారు. వాటిల్లో 40 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటి మరమ్మతులు మాత్రం పూర్తి కాలేదు. ఈ జాబితాలో కిమ్స్ ఆస్పత్రి, డీవీ కాలనీ, సీతాఫల్మండి-ఆడిక్‌మెట్, మెహదీ ఫంక్షన్‌హాల్, రవీంద్రభారతి(ఫ్రీలెఫ్ట్), తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఆంధ్రా ఫ్లోర్‌మిల్, పిల్లర్ నెంబర్ 78-80, 102 నుంచి లంగర్‌హౌస్, బాపూ ఘాట్ న్యూబ్రిడ్జి, బేగంబజార్ పీఎస్ తదితరమైనవి ఉన్నాయి.
►నగరంలోని నాలాలు చాలావరకు కబ్జాకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 7 అడుగులకు కుంచించించుకుపోయాయి. ఆధునీకరణ పనులు ముందుకు సాగడం లేదు.
►‘వర్షాకాల విపత్తు నిర్వహణ’ చర్యలకు అవసరమైన ఏర్పాట్లూ లేవు.
►దాదాపు 800 శిథిల భవనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని కూల్చివేయడమో... అవసరమైన మరమ్మతులు చేయడమో లేదు. వర్షం వస్తే వాటితో ప్రమాదం పొంచి ఉంది.
►సెల్‌టవర్లు, హోర్డింగ్‌ల స్ట్రక్చరల్ స్టెబిలిటీపై శ్రద్ధ చూపాలని గత సంవత్సరమే నిర్ణయం తీసుకున్నా... అమలు చేస్తున్న దాఖలా లేదు.