breaking news
Suryapet Assembly Constituency
-
కాంగ్రెస్, బీఆర్ఎస్కు తెలంగాణలో చోటు లేదు.. సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
సాక్షి, నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చోటు లేదని కేంద్ర ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమని, కేంద్రం నిధులతో చేసిన పనులను తమ ఖాతాల్లో వేసుకొని ప్రచారం చేసుకుంటోందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో అరాచకాలే మిగిలాయన్నారు. 1997లోనే తెలంగాణ ఇవ్వాలని బీజేపీ తీర్మానం చేసిందని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేస్తే తండ్రీకొడుకులు కమీషన్లకు కక్కుర్తిపడి వాటిని రానివ్వడం లేదని పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. సమావేశంలో నాయకులు మధుకర్, సంకినేని వెంకటేశ్వరావు, బొబ్బ భాగ్యారెడ్డి పాల్గొన్నారు. -
సూర్యాపేటలో ఆ సెంటిమెంట్! బీఆర్ఎస్కు హ్యాట్రిక్ సాధ్యమేనా?
ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ. నాలుగుసార్లు టీడీపీ, చెరో రెండు సార్లు సీపీఐఎం, బీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి. తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐఎం అభ్యర్థి ఉప్పల మల్సూర్ ఎన్నికయ్యారు. 2004 వరకు ఎస్సీ రిజర్వుడుగా ఉన్న సూర్యాపేట 2009లో జనరల్‌గా మారింది. 2009లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించగా ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ నేత కూడా మూడోసారి విజయం సాధించిన దాఖలాలు లేవు. 1962, 67లో ఉప్పల మల్సూర్ రెండు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఆకారపు సుదర్శన్ కూడా రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఉన్న జగదీష్ రెడ్డి కూడా 2018 గెలుపుతో రెండోసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి గత చరిత్రను ఆయన తిరగరాసి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే అవుతారా లేక గతమే రిపీట్ అవుతుందా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇక్కడ ప్రధానంగా అభివృద్ధే ఎన్నికలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. సూర్యాపేట నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజ్ ఏర్పాటు, జిల్లాకు నూతన కలెక్టరేట్, రోడ్ల విస్తరణ పనులు, సమీకృత మార్కెట్ నిర్మాణంతో పాటు సద్దల చెరువును ట్యాంక్ బండ్‌గా మార్చడంతో ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కొందరు కింది స్థాయి బీఆర్ఎస్ నేతల తీరు కూడా రాజకీయంగా ఆ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. మూసీ కాలువల ఆధునికీకరణ చేయాల్సి ఉంది. దీనికి తోడు సద్దల చెరువు పొంగితే దిగువన ఉన్న కాలనీ వాసులు ముంపుకు గురవుతున్నారు. ఈ సమస్యకు శాశ్యత పరిష్కారం చూపించాల్సి ఉంది. ఉండ్రుగొండను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు : ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ కేబినేట్లో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయనకు పోటీగా బీఆర్ఎస్ నుంచి మరో నేత కనిపించడం లేదు. అయితే కొందరు నేతల్లో మాత్రం అంతర్గతంగా అసంతృప్తిని వెలుబుచ్చుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అని చెప్పుకునే ఓ నేత మంత్రికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైరి పార్టీకి చెందిన కీలక నేతతో సమావేశం అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ అనుచరుడిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూరా నర్సయ్య, వెంకటేశ్వరరావు కుమారుడు వరుణ్ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కులాల పరంగా ఓటర్లు: ► నియోవజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, రెడ్డి, వైశ్య సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. ► సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైశ్యతో పాటు రెడ్డి సామాజికవర్గపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ► ఆత్మకూరు ఎస్ మండలంలో రెడ్డి, బీసీ, ఎస్టీ సామాజిక వర్గపు ఓటర్లు నిర్ణాయాత్మక శక్తిగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : ఇక్కడ ప్రధాన నది మూసీ. సూర్యాపేట, పెన్‌పహాడ్ మండలాల గుండా మూసీ నది ప్రవహిస్తోంది. ఇక ఎస్సారెస్పీ కాలువ ద్వారా నియోజకవర్గానికి సాగు నీరు అందుతుంది. పర్యాటకం : చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో జరిగే లింగమంతుల జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్దది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి గుట్టపై నెలకొని ఉన్న లింగమంతుల స్వామిని దర్శించుకుని వెళ్తారు. ఈ జాతర మూడు రోజల పాటు సాగుతుంది. ఇక ఆరువేల ఏళ్ల చరిత్ర ఉన్న ఉండ్రుగొండ గుట్టలు కూడా సూర్యాపేటకు పదికిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆలయాలు : ఇక్కడ స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇక్కడకు భారీ ఎత్తున భక్తులు వస్తారు. ఇక వందల ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి దేవాలయంతో పాటు అంతే ప్రాచుర్యం పొందిన శివాలయాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. -
సూర్యాపేట నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...
సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేటలో టిఆర్ఎస్ పక్షాన మరోసారి పోటీచేసిన మంత్రి జగదీష్ రెడ్డి విజయం సాదించారు. దీంతో ఆయన రెండుసార్లు గెలిచినట్లు అయింది. ఆ తర్వాత మళ్లీ కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. జగదీష్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి ఆర్. దామోదరరెడ్డిపై 5941 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. జగదీస్ రెడ్డికి 66742 ఓట్లు రాగా, దామోదరరెడ్డికి 60801ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక టేశ్వరరావుకు 39 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. జగదీష్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో జగదీష్ రెడ్డి సూర్యాపేటలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక టేశ్వరరావుపై 2219 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్ ఐ నేత దామోదర రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. సంకినేని గతంలో తుంగతుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. దామోదరరెడ్డి తుంగతుర్తిలో నాలుగుసార్లు, సూర్యాపేటలో ఒకసారి గెలుపొందారు. ఈయన ఒకసారి ఇండిపెండెంటుగా గెలవగా, మిగిలిన నాలుగుసార్లు కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 1992లో నేదురుమల్లి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా 2007 నుంచి పనిచేశారు. 2009లో గెలిచిన తర్వాత ఈయనకు పదవి దక్కలేదు. ఈయన సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి గెలుపొందారు. వెంకటరెడ్డికి మంత్రి అవకాశం దక్కడంతో ఈయనకు ఛాన్స్ రాలేదు. సూర్యాపేట నుంచి పిడిఎఫ్ మూడుసార్లు, సిపిఐ ఒకసారి, సిపిఎం ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ రెండు సార్లు గెలిచాయి. కడవరకు అతి సామాన్య జీవితం గడిపి ఎందరికో ఆదర్శప్రాయుడు అనిపించుకున్న ఉప్పుల మన్సూర్ సూర్యాపేటలో నాలుగుసార్లు గెలిచారు. టిడిపి నేత ఆకారపు సుదర్శన్ రెండుసార్లు శాసనసభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1952లో ఇక్కడ ద్విసభ్య నియోజకవర్గం నుంచి ఎన్నికైన బొమ్మగాని ధర్మభిక్షం తర్వాత నకిరేకల్‌లో 1957లో, నల్గొండలో 1962లో గెలిచారు. 1957లో ఇక్కడ గెలిచిన భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి 1967లో తుంగతుర్తిలో కూడా గెలిచారు. బీమ్‌రెడ్డి మూడుసార్లు లోక్‌సభకు మిర్యాలగూడెం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో ఆయన సిపిఎంను వదలి సొంత పార్టీని పెట్టుకున్నారు. సిపిఐ నాయకుడు దర్మభిక్షం రెండుసార్లు నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సూర్యాపేట నాలుగుసార్లు రెడ్లు, ఒక గౌడ్ నేత ఎన్నికయ్యారు. మిగిలినసార్లు ఇది రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉంది. సూర్యాపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..