breaking news
Surgical strikes in India
-
‘సర్జికల్స్’పై అతి వద్దు
ఛండీగఢ్: రెండేళ్ల క్రితం కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేసిన సర్జికల్ దాడులు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఉడీ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ మెరుపు దాడులపై తొలినాళ్లలో సంబరాలు చేసుకోవడం సహజమేనని, కానీ అదే పనిగా ఆ విజయాన్ని ప్రచారం చేయడం తగదని మాజీ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా అన్నారు. 2016, సెప్టెంబర్ 29న సర్జికల్ దాడులు జరిగిన సమయంలో హూడా నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఛండీగఢ్‌లో శుక్రవారం ప్రారంభమైన మిలిటరీ సాహిత్య వేడుకలో ‘సీమాంతర ఆపరేషన్లు, సర్జికల్ దాడుల పాత్ర’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. మిలిటరీ చర్యల్ని రాజకీయం చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. సర్జికల్ దాడుల ఆపరేషన్‌ను రహస్యంగా చేస్తే బాగుండేదని ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. ఉగ్రవాదుల ఆవాసాల్ని కకావికలం చేయడమే కాకుండా వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం కూడా ఈ ఆపరేషన్ వ్యూహాత్మక లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు దిగే ముందు శుత్రు మూకలపై వాటి ప్రభావం దీర్ఘకాలం కొనసాగేలా చూసుకోవాలని సూచించారు. పంజాబ్ గవర్నర్ వీపీ బాద్నోర్, పలువురు మాజీ ఆర్మీ కమాండర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మీని సొంత ఆస్తిలా భావించారు: కాంగ్రెస్ డీఎస్ హూడా నిజమైన సైనికుడిలా మాట్లాడారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కితాబిచ్చారు. సర్జికల్ దాడుల్ని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్నారు. ‘ మిస్టర్ 36( 36 రఫేల్ విమానాల కొనుగోళ్లనుద్దేశిస్తూ) మిలిటరీని నిస్సిగ్గుగా తన సొంత ఆస్తిలా వాడుకున్నారు. రఫేల్ ఒప్పందంతో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్ల లబ్ధి చేకూర్చారు’ అని ట్వీట్ చేశారు. సర్జికల్ దాడులపై ఛాతీ చరుస్తూ మోదీ చేసిన చిల్లర రాజకీయాల్ని హూడా బట్టబయలు చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలపై రాజీపడి ప్రధాని దేశం ముందు దోషిగా నిలబడ్డారని పేర్కొన్నారు. -
ఏడుగురు పాక్ రేంజర్ల హతం
-
ఏడుగురు పాక్ రేంజర్ల హతం
జమ్మూ సరిహద్దులో ఓ ఉగ్రవాది కూడా.. బీఎస్ఎఫ్ జవానుకు గాయాలు పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ బలగాలు - సరిహద్దుల్లో రెండు చోట్ల కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాక్ జమ్మూ: దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత బలగాలు దీటైన సమాధానం చెప్పాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో బీఎస్ఎఫ్ దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. జమ్మూలోని కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాను కూడా గాయపడ్డాడు. శుక్రవారం ఉదయం 9.35 గంటల సమయంలో కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో భారత ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఏడుగురు పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మరణించారని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇదే ప్రాంతంలో అంతకుముందు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. గుర్నామ్ సింగ్‌ను జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికి త్స అందజేస్తున్నట్టు చెప్పారు. కథువా జిల్లాలోనే గురువారం ఆరుగురు ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేసిన కొద్ది గంటలకే పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడటం గమనార్హం. కాగా, సరిహద్దుల్లోని జమ్మూ జిల్లా అక్నూర్ సెక్టార్‌లోని పర్గ్వాల్ బెల్ట్‌లోనూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్టు శుక్రవారం ఉదయం బీఎస్ఎఫ్ ఐజీ(జమ్మూ) డీకే ఉపాధ్యాయ వెల్లడించారు. తాము పాక్ బలగాలకు దీటుగా సమాధానం చెప్పామని, వారికి భారీ నష్టాన్ని చేకూర్చామని చెప్పారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, చొరబాటు యత్నాలను ఎదుర్కొనేందుకు బలగాలను సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, వారికి సాయం చేసేందుకే పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారని ఆరోపించారు. చొరబాటు కుట్ర భగ్నం మరోవైపు.. వాస్తవాధీన రేఖకు సమీపంలోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. భారీగా ఆయుధాలతో ఉగ్రవాదులు పూంచ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించారని, దానిని భద్రతా బలగాలు సమర్థంగా భగ్నం చేశాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారన్నారు. ‘సర్జికల్’ తర్వాత 31వ సారి భారత్ సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం ఇది 31వ సారి. గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పులకు తెగబడటం ఇది ఐదోసారి. కాగా, శుక్రవారం భారత, పాక్ దళాల మధ్య కాల్పులు జరిగాయని, పంజాబ్ ప్రావిన్స్‌లోని షకార్‌గఢ్ సెక్టార్లో ఈ ఘటన చోటు చేసుకుందని పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కాల్పులు సుమారు అర గంట పాటు కొనసాగాయని తెలిపింది. అయితే పాక్ మీడియా మాత్రం భారత బలగాల కాల్పుల్లో ఐదుగురు పాక్ రేంజర్లు హతమైనట్టు పేర్కొనడం గమనార్హం. -
సాఫ్ట్వేర్ కంపెనీలపై‘ర్యాన్సమ్వేర్’ వల!
సైబర్ దాడులకు దిగిన పాకిస్తాన్ హ్యాకర్లు - ఈ-మెయిళ్లు, యాడ్ల ద్వారా వైరస్లు - కంప్యూటర్లలోని డేటాను లాక్ చేస్తూ సొమ్ము కోసం డిమాండ్లు - ఇటీవలే ఓ సంస్థ కంప్యూటర్లు హ్యాక్ - రూ. 420 కోట్లు ఇవ్వాలన్న హ్యాకర్లు! - రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సాక్షి, హైదరాబాద్: భారత్ సర్జికల్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు (హ్యాకర్లు) భారతదేశంలోని సంస్థలపై సైబర్ దాడులకు దిగుతున్నారు. ‘ర్యాన్సమ్ వేర్’గా పిలిచే వైరస్‌లను ప్రముఖ సంస్థల కంప్యూటర్లలో చొప్పించి, లాక్ చేస్తున్నారు. తిరిగి అన్‌లాక్ చేసేం దుకు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సైబరాబాద్‌లోని ఓ ప్రముఖ సంస్థపై ఇటీవల ‘ర్యాన్సమ్ ఎటాక్’ చేసిన పాకిస్తాన్ నేరగాళ్లు రూ.420 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఈ తరహా దాడులు పెరిగిపోవడంతో సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ రంగంలోకి దిగింది. ఈ-మెయిళ్లు, ప్రకటనల ద్వారా.. పాకిస్తాన్ హ్యాకర్లు ‘సైబర్ ఎక్స్టార్షన్, బ్రౌజర్ లాకర్, రాన్సమ్వేర్’ వంటి వైరస్‌లను వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన సంస్థల్లోని కంప్యూటర్లకు ఈ-మెయిల్స్, యాడ్స్ రూపంలో ఈ వైరస్‌లను పంపిస్తున్నారు. వాటిలోని లింక్‌లపై క్లిక్ చేస్తే చాలు వైరస్ కంప్యూటర్లోకి చొరబడుతుంది. వెంటనే కంప్యూటర్లోని డేటా మొత్తాన్ని ‘ఎన్‌క్రిప్ట్’ చేసి, లాక్ చేస్తుంది. మానిటర్‌పై ‘మీ కంప్యూటర్ను లాక్ చేశాం’ అనే సందేశం కనిపిస్తుంది. డేటాను అన్‌లాక్ చేసే పాస్వర్డ్ తమ వద్ద ఉందని చెబుతూ, అన్‌లాక్ చేయాలంటే భారీగా సొమ్ము ఇవ్వాలంటూ సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నా రు. ఈ కంప్యూటర్ల స్క్రీన్‌పై నిర్దేశిత గడువుకు సంబంధిం చిన కౌంట్‌డౌన్ సమయం కూడా కనిపిస్తుంది. సొమ్ము చెల్లించకపోతే తాము పాస్‌వర్డ్‌ను నిర్వీర్యం చేస్తామని, దాంతో డేటాను శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని హ్యాక ర్లు బెదిరిస్తున్నారు. ఎవరైనా ఆ టైమర్‌ను, వైరస్ ప్రోగ్రామ్‌ను మార్చాలని ప్రయత్నించినా, నగదు డిపాజిట్ చేసిన ట్లు తప్పుడు వివరాలు పొందుపరిచినా కౌంట్‌డౌన్ సమ యం మరింత తగ్గిపోవడం ఈ వైరస్‌కు ఉన్న మరో లక్షణం. నాన్-సెమెట్రిక్ విధానంలో.. కంప్యూటర్లోని డేటా ఎన్క్రిప్షన్ (లాక్ చేయడం)లో సెమెట్రిక్, నాన్ సెమెట్రిక్ అని రెండు రకాలు ఉంటాయి. సెమెట్రిక్ విధానంలో లాకింగ్, అన్‌లాకింగ్‌కు ఉపకరించే పబ్లిక్, ప్రైవేట్ ‘కీ’లు ఒకటే ఉంటాయి. నాన్-సెమెట్రిక్ విధానంలో మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ర్యాన్సమ్వేర్ పంపే హ్యాకర్లు ఈ విధానంలోనే కంప్యూటర్లను లాక్ చేస్తారు. అంటే వారి వద్ద ఉన్న ప్రైవేట్ ‘కీ’ తెలిస్తే తప్ప డేటాను అన్‌లాక్ చేయడం సాధ్యం కాదు. ఫార్మాట్ చేస్తే అందులో డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో కంపెనీలు విలువైన, అత్యవసరమైన డేటాను పోగొట్టుకోలేక.. మనీప్యాక్, ఓచర్స్, ఈ-మనీ, బిట్‌కాయిన్ రూపాల్లో హ్యాకర్లు డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించాల్సి వస్తోంది. హ్యాకర్లు సొమ్ము అందాక వైరస్ ప్రోగ్రామ్ ద్వారానే అన్‌లాక్ ‘కీ’ పంపుతున్నారు. దాన్ని వినియోగిస్తే కంప్యూటర్ యథాప్రకారం పనిచేసి, అందులోని డేటా భద్రంగా అందుబాటులోకి వస్తుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీలపై.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ర్యాన్సమ్వేర్ బారినపడినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ కంప్యూటర్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.420 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్చువల్ కరెన్సీ అయిన ‘బిట్ కాయిన్స్’ రూపంలో ఆ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ దాడులను ఎలా అడ్డుకోవాలో అర్థంకాక సైబర్ నిపుణులు తల పట్టుకుంటున్నారు. ఇటీవల ర్యాన్సమ్వేర్తో పాటు బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పు పెరిగింది. దానితో కంప్యూటర్ లాక్ కావడంతో పాటు.. ఇలా లాక్ చేసినది అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్లుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అన్ని దేశాల్లో నేరంగా పరిగణించే చైల్డ్ పోర్న్ వెబ్సైట్లు చూశారనో, మరో ఉల్లంఘనగానో పేర్కొంటూ కంప్యూటర్ను లాక్ చేసినట్లు హ్యాకర్లు పేర్కొంటారు. ఈ వైరస్‌ల్లోని మరో లక్షణం ఏమిటంటే.. అవి వెబ్‌క్యామ్‌ను ఆపరేట్ చేయడంతో పాటు కంప్యూటర్ ఐపీ అడ్రస్, లొకేషన్లను మానిటర్‌పై డిస్ప్లే చేస్తాయి. అంతేకాదు ‘మీ కదకలను గమనిస్తున్నాం. తదుపరి చర్యలు చేపట్టకూడదంటే చేసిన తప్పుకు జరిమానా చెల్లించండి’ అనే డిమాండ్ కనిపిస్తుంది. దీంతో భయపడిపోయే వినియోగదారులు సొమ్ము చెల్లిస్తున్నారు. ఫోన్లకూ ఈ వైరస్ ముప్పు ‘‘కేవలం కంప్యూటర్లు మాత్రమే కాదు స్మార్ట్ఫోన్లకూ ర్యాన్సమ్ వేర్ ముప్పు ఉంది. ఫోన్లలో ఉన్న డేటాను సైతం సైబర్ నేరగాళ్లు లాక్ చేస్తున్నారు. ఎక్కువగా వ్యక్తిగత ఫోన్లు, కంప్యూటర్లతో పాటు చిన్న చిన్న కంపెనీలు మాత్రమే దీని బారినపడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు పటిష్టమైన ఫైర్‌వాల్స్ (రక్షణ సాఫ్ట్వేర్లు) ఏర్పాటు చేసుకోవడంతో వీటి బారినపడట్లేదు. గత పదేళ్లలో భారతదేశంలో 2,400 రెట్లు సైబర్ నేరాలు పెరిగాయి. ఇటీవల ఓ సంస్థను ఎటాక్ చేసిన పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు రూ.420 కోట్లు డిమాండ్ చేశారన్న విషయం మా దృష్టికి రాలేదు. ఆ స్థాయి కార్పొరేట్ సంస్థకు అలా జరుగుతుందని మేం భావించట్లేదు..’’ - ఎ.భరణి, సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అనుమానాస్పద మెయిల్స్, యాడ్స్ ఓపెన్ చేయొద్దు ర్యాన్సమ్వేర్, బ్రౌజర్ లాకర్ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న ముప్పేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అపరిచిత ఐడీల నుంచి వచ్చే ఈమెయిల్స్, అనుమానాస్పద యాడ్స్ కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో మంచి యాంటీ వైరస్ ఏర్పాటు చేసుకోవడమే వీటిని పరిష్కారమని పేర్కొంటున్నారు. బ్రౌజర్ లాకర్ కొన్ని యాంటీ వైరస్‌లకు లొంగినా.. ర్యాన్సమ్వేర్కు మాత్రం పరిష్కారం లేదని అంటున్నారు. హ్యాకర్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే ప్రైవేట్ ‘కీ’ ఏర్పాటు చేయరని, దాంతో బాధితులంతా సొమ్ము చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. ఈ హ్యాకర్లు బోగస్ సర్వర్లు, ఐపీ అడ్రస్‌లను వినియోగిస్తారని, అందువల్ల పట్టుకోవడం కష్టసాధ్యమని పేర్కొంటున్నారు.