breaking news
sundargadh
-
ఎలాగైనా గెలవాలని..
ఒడిశా అంటే నవీన్ పట్నాయక్.. నవీన్ పట్నాయక్ అంటే ఒడిశా అన్నట్టుగా 20 ఏళ్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఒడిశా ఎన్నికల చరిత్రలో బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రస్థానం తిరుగులేనిది. ఒడిశా.. రాష్ట్రంగా చూస్తే వెనుకబడిందే.. కానీ ఖనిజ సంపదలో చాలా విలువైనది. ఈ ఖనిజాల చుట్టూ జరిగే వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి నవీన్ పట్నాయక్ గత నాలుగు ఎన్నికల్లోనూ అందలాన్ని అందుకున్నారు. కానీ ఇప్పటివరకు బిజూ జనతాదళ్ అడుగు పెట్టలేకపోయిన ప్రాంతం ఏదైనా ఉందీ అంటే అది సుందర్‌గఢ్. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేడీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. అటవీ హక్కుల చట్టం అమలే ప్రధానాంశం ఒడిశాలో సుందరగఢ్ నియోజకవర్గం కీలకమైనది. ఇది ఎస్టీ రిజర్వుడు స్థానం. ప్రతీ ఐదుగురిలో ఒకరు గిరిజనుడే. 2014 ఎన్నికల్లో ఏకైక బీజేపీ ఎంపీగా జుయల్ ఒరమ్ ఇక్కడ గెలుపొంది రికార్డు సృష్టిం చారు. ఆ తర్వాత కేంద్ర గిరిజన మంత్రి పదవినీ అందుకున్నారు. జుయల్ ఒరమ్కి విజయం అంత సులభంగా లభించలేదు. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో అప్పట్లోనే ఒమర్‌కి బీజేడీ అభ్యర్థి దిలీప్ కుమార్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈసారి మోదీ వేవ్ ఆ స్థాయిలో లేకపోగా కేంద్ర గిరిజన మంత్రిగా నియోజకవర్గానికి, ఆదివాసీల సంక్షేమానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. ఆదివాసీలకు భూ యాజమాన్య హక్కుల్ని కల్పిస్తూ 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఫ్రా) తీసుకువచ్చినా వారికి ప్రయోజనం కలగలేదు. ఆ చట్టంలో లొసుగుల ఆధారంగా ఎందరో ఆదివాసీలకు యాజమాన్య హక్కుల్ని తిరస్కరించారు. తమ నియోజకవర్గం ఎంపీ కేంద్రంలో గిరిజనుల మంత్రిగా ఉన్నప్పటికీ తమకు ఒరిగిందేమీ లేదన్న అసంతృప్తి ఆదివాసీల్లో నెలకొంది. ‘ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్రా కీలకపాత్ర పోషిస్తుంది. ఒడిశాలో పార్టీలన్నీ దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి. మేనిఫెస్టోల్లో దీనినే ప్రధానంగా ప్రస్తావించాయి’ అని వసుంధర అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన గిరిరావు వ్యాఖ్యానించారు. జాతీయ సగటు కంటే ఒడిశాలో తక్కువ జాతీయ స్థాయిలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అటవీ హక్కుల గుర్తింపు చట్టంపై ఈ మధ్య కాలంలో ఆదివాసీల్లో అవగాహన పెంచుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం కానుంది. ఈ చట్టం అమల్లో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా తక్కువగా ఉంది. ఈ చట్టం కింద భూ యాజమాన్య హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతించే జాతీయ సగటు రేటు 81 శాతంగా ఉంటే, ఒడిశాలో 71 శాతమే ఉంది. షెడ్యూల్ తెగలు మాత్రమే కాకుండా ఇతర సంప్రదాయ ఆదివాసీలు తవ్వకాల కోసం పెట్టుకున్న అనుమతుల్లో 2 శాతం మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. ఇది కూడా జాతీయ సగటు (13%) కంటే చాలా తక్కువ. కేంద్ర గిరిజన మంత్రిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉన్నప్పటికీ ఫ్రా చట్టం అమలు ఇంత ఘోరంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలకు అదే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. త్రిముఖ పోటీ సుందర్గఢ్లో ఒక్కసారి కూడా నెగ్గలేకపోవడంతో బీజేడీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 33 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. సుందర్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ కుమార్తె సునీతా బిశ్వాల్‌కు అవకాశం ఇచ్చారు. ఒడిశాకు మొదటి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌కు మంచి పేరే ఉంది. అదే సునీతా బిశ్వాల్‌కు అనుకూలంగా మారుతుందన్న అంచనాలున్నాయి. ఒడిశా సుందర్‌గఢ్ నియోజకవర్గంలో 2000 సంవత్సరం నుంచి జుయల్ ఒరమ్, హేమానంద బిశ్వాల్ మధ్యే పోటీ ఉంటోంది. బిశ్వాల్ కుమార్తెను రంగంలోకి దింపడం ద్వారా నవీన్ తెలివిగా వ్యవహరించారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇక, బీరమిత్రపూర్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న జార్జ్ తిర్కీ కాంగ్రెస్ గూటికి చేరుకొని ఈ లోక్‌సభ బరిలో సవాల్ విసురుతున్నారు. సుందర్‌గఢ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2.6 లక్షల ఓట్లు సంప్రదాయంగా పడుతూ వస్తున్నాయి. దానికి తోడు తనకున్న వ్యక్తిగత ఇమేజ్ ద్వారా లక్ష ఓట్ల వరకు సంపాదించగలరని అంచనా. దీంతో జార్జ్ తిర్కీ బలమైన అభ్యర్థిగానే మారారు. అయితే అన్ని పార్టీల్లోనూ రెబెల్స్ బెడద ఉండటంతో ఈసారి వీరు ఏ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తారోనన్న ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని సాధించడం కోసం పార్టీ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా చాలామంది నాయకులపై వేటు వేసింది. వీరంతా సుందర్‌గఢ్ బరిలో నిలవడంతో అన్ని పార్టీలకు గండంగా మారింది. -
గిరిజన ‘మంత్రదండం’
హాకీ వారికి ఆరో ప్రాణం సుందర్‌గఢ్‌కు ప్రత్యేక గుర్తింపు ఆటకు బంగారు గనిగా పాపులర్ భారత్‌లాంటి క్రికెట్ క్రేజ్ దేశంలో మరో ఆటను పిచ్చిగా ఆరాధించే జనాన్ని, ప్రాంతాన్ని చూడాలంటే ఒడిశా వెళ్లాల్సిందే. అక్కడి సుందర్‌గఢ్ జిల్లా మన జాతీయ క్రీడ హాకీకి అడ్డా. ఆటపై అభిమానమే కాదు, ఆటగాళ్లను తీర్చి దిద్దడంలోనూ ఈ గిరిజన ఏరియా ముందు అన్ని ప్రాంతాలు తీసికట్టు. ఇప్పటి వరకు సుందర్‌గఢ్ జిల్లానుంచే అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు 25 మంది ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇక జాతీయ స్థాయి ఆటగాళ్లుగా ఎంత మంది ఎదిగారో లెక్కే లేదు. బాగా వెనుకబడిన ఉత్తర ఒడిశాలోని ఈ ప్రాంతంలో హాకీ పాపులార్టీ వెనక అనేక ఆసక్తికర నేపథ్యాలు ఉన్నాయి. ఎవరైనా చిన్నారిని ‘మీ అభిమాన ఆటగాడు ఎవరు అని గానీ, ఎవరిలా కావాలనుకుంటు న్నావు’ అని గానీ ఎప్పుడైనా అడిగారా... కచ్చితంగా అతను క్రికెటర్ పేరే చెబుతాడు. కానీ అక్కడ అలా కాదు. వారు ఆరాధించేది హాకీ ఆటగాళ్లను... మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండలో కొంత మంది కుర్రాళ్లు కలిసి ఏదైనా గల్లీలో ఆట ఆడుతున్నారంటే సహజంగానే మనకు క్రికెట్టే కనిపిస్తుంది. కానీ అక్కడ మాత్రం ఆ ఆటను పట్టించుకోరు. వారు మైదానంలోకి దిగేది హాకీ కోసమే... చాలా మంది అభిమానులు సుదీర్ఘంగా క్రికెట్ మ్యాచ్‌లపై చర్చించడం మనం చూస్తాం. కానీ ఆ ప్రాంతంలో అలాంటి దృశ్యం మచ్చుకైనా కనిపించదు. వారు ఏం మాట్లాడినా హాకీ గురించే... - మొహమ్మద్ అబ్దుల్ హాది క్రైస్తవ మిషనరీల వెంట... సుందర్‌గఢ్ ప్రధానంగా గిరిజన ప్రాంతం. 36 రకాల తెగల్లో ఎక్కువ మంది ఓరమ్, ముండా, భునియా తెగకు చెందినవారు ఉన్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ క్రైస్తవ మిషనరీలు పెద్ద సంఖ్యలో తమ కార్యకలాపాలు కొనసాగించాయి. వారు ఎక్కడ పాఠశాల ఏర్పాటు చేసినా అక్కడ హాకీ ఆటను తప్పనిసరి చేశారు. ఇది హాకీ ఆట మీద సానుకూల ప్రభావం చూపింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మరో కారణం కూడా ఉంది. ఇక్కడి గిరిజనులు సాధారణంగా కాస్త పొట్టిగా ఉంటారు. కానీ కాళ్లు చాలా బలంగా ఉంటాయి. కంటి చూపు కూడా చాలా చురుకైనది. ఒక కర్ర ఆధారంగా ఉన్నా సరే...దానిపై వంగి కొన్ని గంటల పాటు నిలబడగల సామర్థ్యం వారి సొంతం. ఇవన్నీ హాకీ ఆటకు సరిపోయే లక్షణాలు అని వారు చెబుతున్నారు. సూపర్ శిక్షణ... హాకీ నర్సరీ...ఈ పేరును చూస్తేనే నర్సరీ స్థాయి శిక్షణ అని అర్థమవుతోంది కదా...దేశంలోనే ఈ తరహా ఏకైక శిక్షణా కేంద్రం సుందర్‌గఢ్ సమీపంలోని రూర్కెలాలో ఉంది. పసి ప్రాయంలోనే ప్రతిభను గుర్తించి వారిని హాకీలో తీర్చి దిద్దేందుకు ఏర్పాటైన అకాడమీ ఇది. హాకీ స్టిక్ కొనుక్కునే సామర్థ్యం లేకపోయినా, షూస్ లేకపోయినా తమకు అందుబాటులో ఉన్న కర్రలనే కాస్త వంపుగా చెక్కి, వాటినే స్టిక్లుగా మలచి, ఉత్త కాళ్లతో మైదానం వైపు దూసుకుపోయేవారు ఎందరో ఇక్కడ ఉన్నారు. వారికి హాకీ అంటే ప్రాణం, హాకీ అంటే భవిష్యత్తుపై భద్రత కూడా. దీంతో తమకు అందుబాటులో ఉన్న అవకాశాలనే ఉపయోగించుకొని మెరికల్లా తయారవుతున్నారు. స్టీల్ అథారిటీలాంటి సంస్థల ప్రోత్సాహం లభిస్తుండటం కూడా వీరి అదృష్టం. దేశంలోని పెద్ద నగరాల్లోనే ఒక ఆస్ట్రోటర్ఫ్‌కు అవకాశం లేదు గానీ....ఒక్క సుందర్‌గఢ్ జిల్లాలోనే మూడు ఆస్ట్రోటర్ఫ్లు ఉండటం విశేషం. ఇక్కడ ఈ ఆట పాపులార్టీకి ఇదో ఉదాహరణ. జాబితా పెద్దదే... ఇక్కడి మిషనరీ స్కూల్లో ప్రవేశం కోసం వెళ్లేటప్పుడు చేత్తో హాకీ స్టిక్ కూడా తీసుకు వెళ్లాలి. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే.. వరుడికి ఎన్ని గొర్లు, బర్రెలు ఉన్నాయనేది ముఖ్యం కాదు. అతను స్థానిక పోటీల్లో ఎన్ని గోల్స్ చేశాడన్నది ముఖ్యం. నిద్రలో లేపి చెప్పినా, వెంటనే మైదానానికి వెళ్లి హాకీ ఆడేందుకు ఎవరైనా సిద్ధంగా ఉంటారు. సుందర్‌గఢ్ గురించి వినిపించే వ్యాఖ్యల్లో ఇవి కొన్ని. ఇన్నేళ్లలో ఆ ప్రాంతం నుంచి ఎంతో మంది జాతీయ జట్టుకు ఆడారు. భారత్‌నుంచి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దిలీప్ తిర్కీ (412) ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. మూడు ఒలింపిక్స్ ఆడిన ఏకైన గిరిజనుడు అతనే కావడం విశేషం. ఏథెన్స్ ఒలింపిక్స్‌లో దిలీప్‌తో పాటు ఈ ప్రాంతానికి చెందిన ఇగ్నీస్ తిర్కీ, విలియం గ్జాల్కో ఉన్నారు. మైకేల్ కిండో, ప్రబోధ్ తిర్కీ, లాజరస్ బర్లా, పీటర్ తిర్కీ, రోషన్ మింజ్, అమర్దీప్ ఎక్కా, బీరేంద్ర ఎక్కా, సునీత కుల్లు, సుభద్రా ప్రధాన్, అనుప, బినిత, దీప్ గ్రేక్ ఎక్కా, సునీత లక్డా, నమిత టప్పో, లిలిమా మింజ్, రోజలీన్ డుంగ్‌డుంగ్....వీరంతా భారత్‌కు ఆడినవారే. వీరిలో నలుగురు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, ముగ్గురు అర్జున అవార్డు, ఇద్దరు పద్మశ్రీలు అందుకున్నారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన మహిళల వరల్డ్ హాకీ లీగ్‌లో సుందర్‌గఢ్‌కు చెందిన ఆరుగురు అమ్మాయిలు భారత జట్టు తరఫున ఆడటం తాజా ఘనతగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తుపై భరోసా... ఆసక్తికరంగా ఇక్కడినుంచి వెలుగులోకి వచ్చినవారంతా డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్లే తప్ప ఫార్వర్డ్లు ఎవరూ లేరు. దీనిపై స్థానిక కోచ్ ఒకరు... ‘అమాయక గిరిజనులు సాధారణంగా ఎవరి జోలికీ వెళ్లరు. కానీ తమ జోలికి ఎవరైనా వస్తే దానిని అడ్డుకోగల సామర్థ్యం వారి సొంతం. అదే వారిలో ఆటలోనూ కనిపిస్తుంది’ అని చెప్పడాన్ని బట్టి చూస్తే హాకీ వారి జీవనంలోనూ భాగమైపోయిందని అర్థమవుతుంది. ఎంతో మంది ఆట ద్వారానే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ ఏరియాలో 500 మందికి పైగా ప్రొఫెషనల్ శిక్షణ పొందుతున్నారు. మిగతా భారత్‌లో క్రికెట్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ఇక్కడ హాకీకి అలాంటి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. అయితే సుందర్‌గఢ్ తన పేరును, చరిత్రను నిలబెట్టుకోవాలని అక్కడివారు పట్టుదలగా ఉన్నారు. అందుకే వేర్వేరు స్థాయిల్లో ఆటలో కొనసాగుతున్నారు. తమకు ఉద్యోగం కూడా హాకీ ద్వారానే దక్కుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటికీ ఈ ఏరియాలో ఒడిషా హాకీ అసోసియేషన్ మాత్రం చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ప్రభుత్వం తరఫున హాకీ అకాడమీతో పాటు హాకీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఆటగాళ్లు కోరుతున్నారు. పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ప్రపంచ హాకీలో వచ్చిన కొత్త తరహాలో మార్పుల గురించి ఇప్పుడు శిక్షణ అవసరమని, అందుకు నిపుణులైన కోచ్‌లను నియమించాలని కూడా వారు అంటున్నారు. సౌకర్యాలతో పాటు సంప్రదాయం కూడా కొనసాగితే భవిష్యత్తులో మరెందరో తిర్కీలు ఈ ‘సుందర్‌గఢ్- ది మక్కా ఆఫ్ హాకీ’ నుంచి భారత్‌కు ఆడటం ఖాయం. టోర్నీలే టోర్నీలు... మన వద్ద ఏడాదికో హాకీ టోర్నీ జరిగితే అదే గొప్ప. కానీ సుందర్గఢ్లో ఏడాది పొడవునా హాకీ టోర్నీలే. వీటిని అక్కడ ఖాసీ టోర్నమెంట్లుగా వ్యవహరిస్తారు. ఖాసీ అంటే మేక/ గొర్రె. గతంలో టోర్నీ గెలిస్తే ఖాసీని బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడి లల్కిడిహి, సౌనమారా, కేస్రమల్, పాన్‌పోష్ గ్రామాల్లోనైతే హాకీ టోర్నీ అంటే పండగ వాతావరణం కనిపిస్తుంది. పెళ్లి సందర్భంగా ఇరు వర్గాలు సరదాగా ఏదైనా ఆడితే అది హాకీనే. 2003లో సుందర్‌గఢ్ జిల్లా పరిసరాల్లోని 1500 గిరిజన గ్రామాలు 200 హాకీ టోర్నమెంట్లు నిర్వహించడం విశేషం. దశాబ్దం క్రితం ఈ ప్రాంతాల్లో నక్సల్స్ సమస్య పెరిగితే జిల్లా ఎస్పీ హాకీ టోర్నమెంట్లు నిర్వహించి ప్రజలను ఒక్కచోటికి చేర్చారు. టోర్నీ సాకుతో వారికి వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేయడం విశేషం. ఇక ఈ ఏడాది జనవరిలో రూ. 2 లక్షల ప్రైజ్‌మనీతో స్థానికంగా ఒక టోర్నమెంట్ నిర్వహించారు. దీనికి రికార్డు స్థాయిలో సుందర్‌గఢ్ జిల్లానుంచే 1200 జట్లు పాల్గొనడం ఒక రికార్డు. ప్రైజ్‌మనీతో పనేంటి...ఆటే మా ప్రాణం, హాకీ మా రక్తంలోనే ఉంది అంటారు వీళ్లు. నేను గర్వపడుతున్నా... మా సుందర్‌గఢ్ రక్తంలోనే హాకీ ఉంది. నేను అక్కడివాడిని కావడం నా అదృష్టం. ఆటే మా అందరినీ కలుపుతుంది. నేను అంతర్జాతీయ స్థాయికి ఎదిగానంటే మా ప్రాంతపువారి సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఎంతో ఉన్నాయి. పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా సుందర్‌గఢ్ హాకీకి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తా. - దిలీప్ తిర్కీ, భారత మాజీ కెప్టెన్