breaking news
Subcommittee
-
కరోనా సంక్షోభంపై టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల విజృంభణ, ఆక్సిజన్ కొరత నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు, ఆక్సిజన్ పంపిణీ కోసం స్పష్టమైన విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు 6 నెలల కాలపరిమితితో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వైద్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణులైన 12 మందిని అందులో సభ్యులుగా చేర్చింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రణాళికను రూపొందించే బాధ్యతను కూడా ఆ కమిటీకి అప్పగించింది. అలాగే, ఎయిమ్స్‌కు చెందిన రణదీప్ గులేరియా, మాక్స్ హెల్త్‌కేర్‌కు చెందిన సందీప్ బుధిరాజా, సంయుక్త కార్యదర్శి హోదాకు తగ్గని ఇద్దరు ఐఏఎస్ అధికారులతో ఒక సబ్ కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా, నగరంలో వైద్య వ్యవస్థ మౌలిక వసతులను ఆ కమిటీ సమీక్షిస్తుంది. విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారం జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు కన్వీనర్‌గా కేంద్ర కేబినెట్ సెక్రటరీని, ఎక్స్ అíఫీషియో మెంబర్‌గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం నియమించింది. ఈ మేరకు గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెబ్సైట్లో శనివారం అప్లోడ్ చేశారు. టాస్క్‌ఫోర్స్‌లో బాబాతోష్ బిశ్వాస్(వెస్ట్‌బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్స్‌లర్), దేవేందర్ సింగ్ రాణా(ఢిల్లీ్లలోని సర్ గంగారామ్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్పర్సన్), దేవీప్రసాద్ శెట్టి(బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్ చైర్పర్సన్, ఈడీ), గగన్‌దీప్ కాంగ్(వెల్లూర్ క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్) తదితరులున్నారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శాస్త్రీయ ప్రణాళికలను టాస్క్‌ఫోర్స్ నిపుణులు రూపొందిస్తారని, అలాగే, విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అవసరాల మేరకు ఆక్సిజన్ డిమాండ్, సరఫరాలపై శాస్త్రీయ అంచనా సహా 12 విధులను కోర్టు ఈ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది. ఇందుకు రాష్ట్రాల వారీగా సబ్ కమిటీలను టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది. ఈ సబ్ కమిటీల్లో ఆయా రాష్ట్రాల కార్యదర్శి స్థాయి అధికారి, అదనపు కార్యదర్శి హోదాకు తగ్గని కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇద్దరు వైద్య నిపుణులు సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. పేషెంట్ల చికిత్స సమయంలో వైద్యులు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉద్దేశం కాదని, మెడికల్ ఆక్సిజన్ పంపిణీ, వినియోగంలో పారదర్శకత నెలకొనాలని, అవసరాల మేరకు ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా జరగాలనేదే తమ ఉద్దేశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ నివేదికను సమర్పించేంతవరకు.. రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని పేర్కొంది. ఎప్పటికప్పుడు తమకు మధ్యంతర నివేదికలు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించింది. -
ఏకరీతి ఎస్కలేషన్‌కు ‘నో’
ప్యాకేజీల వారీగా పరిశీలించాకే కాంట్రాక్టర్లకు చెల్లింపు సాగునీటి ప్రాజెక్టుల సబ్‌కమిటీ నిర్ణయం హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించి, పూర్తిగా పరిశీలించిన తర్వాత... అర్హులైన పనులకు మాత్రమే ఎస్కలేషన్ చెల్లించాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం మాదిరి కాకుండా కాంట్రాక్టులందరికీ ఒకేరీతిన ఎస్కలేషన్ చెల్లించడం కాకుండా పనులు పూర్తి చేస్తామని విశ్వాసం ఉన్నచోటే పెంచిన ధరలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. శనివారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సాగునీటి ప్రాజెక్టుల సబ్‌కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. పనులు జరగని చోట, కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శించిన చోట ఎస్కలేషన్‌కు అనుమతించరాదని నిర్ణయించారు. ప్రాజెక్టుల వారీగా.. ప్యాకేజీల వారీగా పనులను పూర్తిగా అధ్యయనం చేయాలని, రీటెండరింగ్ చేస్తే అయ్యే భారం, ఎస్కలేషన్‌కు అయ్యేభారాన్ని లెక్కించి నివేదిక తయారు చేయాలని సాగునీటి పారుదల శాఖను ఆదేశించారు. దీనిపై చర్చించేం దుకు ఈ నెల 17న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు సత్వరం పూర్తిచేసేందుకు చీఫ్ ఇంజనీర్‌ను నియమించాలని ఆదేశించారు. భూసేకరణకు ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సభాసంఘం
హైదరాబాద్: ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై తెలంగాణ ప్రభుత్వం మూడు శాసన సభా సంఘాలు ఏర్పాటు చేసింది. అలాగే వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్ గా 13 మందితో కమిటీ ఏర్పాటయింది. హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఎమ్మెల్యే రమేష్ చైర్మన్ గా, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చైర్మన్ గా కమిటీలు ఏర్పాటయ్యాయి. రాబోయే మూడు నెలల్లో ఈ కమిటీలు సభకు నివేదికలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.