breaking news
statewide shutdown
-
కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్
-
తెలంగాణ బంద్
-
తెలంగాణ బంద్; అందరికీ కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బంద్‌కు మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు బంద్‌కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బంద్ సంపూర్ణంగా విజయవంతం అయిందన్నారు. అయితే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్ట్ చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరగాలి : భట్టి పోలీసులతో బంద్‌ను అణచివేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రజానికం మొత్తం అండగా ఉందన్నారు. శనివారం ఆయన ఆర్టీసీ కార్మికులతో కలిసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలు లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మెల్కొని ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు ఎందుకు మాట్లాడడం లేదు ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్.. 48 గంటల అధికారులతో చర్చించేబదులు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపితే సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. ఉద్యమంలో ఉన్న మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ సమ్మెపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్, బీజేపీ నేతల అరెస్ట్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో అబిడ్స్ లో జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆందోళకారులతో పాటు వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ మండిపడ్డారు. ఇది నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పోరు అని.. ఆర్టీసీ కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒయూలో ఆందోళనలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎన్సీసీ గేటు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను విద్యార్థి సంఘం నేతలు దగ్ధం చేశారు. ఎన్సీసీ గేటు నుంచి బయటకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంపాల రాజేశ్ రాజేశ్ నేతృత్వంలో తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్(టీఎస్ఎస్) సభ్యులు ఆర్ట్స్ కాలేజీ ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఓయూ ఉద్యోగుల సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉద్రిక్తత ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆందోళన చేపట్టిన వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ్మినేని వీరభద్రం విమలక్క, చెరుకు సుధాకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు నిరసనలు, పోలీసులు అరెస్ట్‌లతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రైవర్‌ను చితకబాదారు హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రికత పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులు బస్సు డీజిల్ ట్యాంకర్‌కు, టైర్లకు మేకులు కొట్టారు. ఓ ప్రైవేటు డ్రైవర్‌ను కూడా ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. పోలీసులు వారిని అడ్డుకుని ప్రైవేటు డ్రైవర్‌ను కాపాడారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏడుగురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ దగ్గరా కూడా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుపై రాళ్ల దాడి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సుపై రాళ్లతో ఆందోళనకారులు దాడి చేయడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఈ బస్సును బందోబస్తు మధ్య ఆర్మూర్ పోలీసులు దాటించారు. బంద్ నేపథ్యంలో ఆర్మూర్‌లో డిపోకే బస్సులు పరిమితయ్యాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రయాణికులు లేక బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. పరకాలలో అరెస్ట్‌ల పర్వం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. పరకాల పట్టణం నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక పరకాల బస్టాండ్ వెలవెలబోతోంది. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు విధులకు హాజరు రాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ప్రాంగణంలో భారీగా పోలీసులను మొహరించారు. పరకాల ఆర్టీసీ జేఏసీకి చెందిన 20 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం 5 గంటల నుండే ఇండ్లలోకి పోయి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్ డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల పర్యవేక్షణలో... ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. పోలీసుల పర్యవేక్షణలో డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను అధికారులు బయటకు పంపుతున్నారు. ప్రతీ బస్సులో పోలీస్ సిబ్బంది ఉన్నారు. డిపో నుంచి బస్సులు బయటకు రాగానే ఆర్టీసీ కార్మిక నేతలు, కార్మికులు వాటిని అడ్డుకుంటున్నారు. పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. జిల్లాలోని అన్ని డిపోలు, బస్టాండ్లు, వాటి పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలను మొహరించారు. ఆర్టీసీ బంద్‌కు వాణిజ్య, వర్తక సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ బంద్ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల వద్ద భారీగా పోలీస్ బలగాలన మొహరించారు. బీజేపీ, వామపక్షాల నేతల అరెస్ట్ రాష్ట్ర బంద్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 14 మంది బీజేపీ, సీపీఐ, ఆర్టీసీ నాయకులను తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ బస్ డిపో ముందు ఎస్పీ శశిధర్ రాజు పర్యవేక్షణలో పోలీసులు మొహరించారు. ఆసిఫాబాద్ బస్సు డిపో ముందు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మతో ఎక్కడికక్కడే బస్సు లు నిలిచిపోయాయి. భారీగా పోలీసుల మొహరింపు నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో 6 డిపోల పరిధిలో 670 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్డు ఎక్కని బస్సులతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. బోధన్ బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడే తెలంగాణ రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసే చర్యల్లో భాగంగా శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేయనుంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమని ప్రకటిస్తూనే సమ్మెను మాత్రం ఆపేది లేదని ప్రకటించింది. బంద్ లో భాగంగా శుక్రవారం 14వ రోజున సమ్మె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలతో ఆర్టీసీ జేఏసీ హోరెత్తించింది. అన్ని డిపోల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్‌లు నిర్వహించింది. వ్యాపారులు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఆర్టీసీ పరిరక్షణ కోసం చేస్తున్న బంద్ అయినందున ప్రజలు కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది. బంద్‌కు టీఆర్ఎస్, మజ్లిస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, ప్రజాసంఘాలు, ఆటో, క్యాబ్ సంఘాలు మద్దతు ఇప్పటికే పలి కాయి. బంద్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ శనివారం మధ్యాహ్నం లంచ్ అవర్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన బైక్ ర్యాలీల్లో బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని రామ్ నగర్ కూడలి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్టీ కార్యకర్తలు, òకార్మికులు జేఏసీ–1 కన్వీనర్ హన్మంతు ఆధ్వర్యంలో పాల్గొన్నారు. అంతకుముందు బాగ్‌లింగంపల్లి వద్ద ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చిన జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత వదిలిపెట్టారు. ఇబ్రహీంపట్నం డిపో ఎదుట కార్మికులు బస్సులను బయటకు రాకుండా అడ్డుకోగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. షాద్‌నగర్‌లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ కార్మికులు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బైక్ ర్యాలీకి కేవీసీఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాదిగ దండోరా నాయకులు మద్దతు పలికారు. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ తాత్కాలిక డ్రైవర్ గురువారం రాత్రి‡ అదే బస్సులోని తాత్కాలిక మహిళా కండక్టర్‌పై అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. బస్సులు తిప్పేలా సర్కారు ఏర్పాట్లు ఆర్టీసీ జేఏసీ శనివారం తెలంగాణ బంద్ చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం బంద్ ప్రభావం పడకుండా వీలైనన్ని ఎక్కువ బస్సులు తిప్పేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశంతో శుక్రవారం చాలా బస్సుల్లో కండక్టర్లకు టికెట్ల జారీ యంత్రాల వాడకంపై శిక్షణ ఇచ్చి అందించినా చాలా మంది కండక్టర్లు వాటిని ఆపరేట్ చేయలేక సంప్రదాయ టికెట్ ట్రేలు అడిగి తీసుకెళ్లారు. సమ్మె యథాతథం: అశ్వత్థామరెడ్డి కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వమే స్పందించలేదని, కోర్టు ఆదేశంతోనైనా సర్కారు చర్చలకు సిద్ధం కావాలన్నారు. తాము ప్రభుత్వం ముందుంచిన 26 డిమాం డ్లపై చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధం కావాలని కోర్టు చెప్పినంత మాత్రాన సమ్మెను విరమించాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ప్రకటించినట్టుగా శనివారం రాష్ట్ర బంద్ నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల కడుపు మండి ఉద్యమం చేస్తున్నామని, రాజకీయ లబ్ధి కోసం మాత్రం కాదని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బంద్‌కు మద్దతుగా జరిగిన సదస్సులో అశ్వత్థామరెడ్డి పాల్గొని మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చర్చలపై ప్రతిష్టంభన! ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు సీఎంతో భేటీ కోసం ప్రగతి భవన్ వెళ్లారు. అయితే ఓ వివాహ కార్యక్రమం, మరో వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ వెళ్లడంతో ఈ భేటీ సాధ్యం కాలేదు. శనివారం ఉదయం చర్చిద్దామని సీఎం చెప్పడంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు. చర్చల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం ప్రారంభించాలంటూ హైకోర్టు స్పష్టం చేయడంతో ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ అందుకు సమాయత్తమవుతున్నారు. చర్చలు ప్రారంభిస్తే అనుసరించాల్సిన వ్యూహం కోసం ఆర్టీసీ ఈడీలతో శనివారం ఉదయం 10 గంటలకు ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మంత్రులతో కలసి సీఎంతో భేటీ అయ్యే అవకాశముంది. -
తమిళనాడులో స్తంభించిన జనజీవనం
-
తమిళనాడులో స్తంభించిన జనజీవనం
చెన్నై: రైతులకు మద్దతుగా అఖిలపక్షాల ఆధ్వరంలో జరుగుతున్న రాష్ట్ర బంద్ తో మంగళవారం తమిళనాడులో జనజీవనం స్తంభించింది. దుకాణాలు, హోటళ్లు మూతబడ్డాయి. ఆటో, వ్యాన్, లారీ, ప్రైవేటు వాహనాల సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. రాజధాని చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా థియేటర్లలో ప్రదర్శనలు, షూటింగ్‌లు ఆగిపోయాయి. రైల్ రోకోలు, రాస్తారోకోలకు డీఎంకే నేతృత్వంలోని అఖిల పక్షం సిద్ధమైంది. తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ, పీఎంకేలు బంద్‌కు దూరం అని ప్రకటించగా, ఎండీఎంకే మాత్రం తటస్థంగా వ్యవహరిస్తోంది. డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకేల అనుబంధ రవాణా సంస్థలు బంద్ ప్రకటించడంతో ప్రభుత్వ బస్సుల సేవలు ఆగే అవకాశాలు ఉన్నాయి. ఆటో, వ్యాన్, లారీ, ప్రైవేటు వాహనాల సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో ఆ సేవలు ఆగినట్టే. అన్ని రకాల సేవల నిలుపుదలతోపాటుగా, తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేసే విధంగా రైల్‌రోకోలు, రాస్తారోకోలు సాగించేందుకు నేతలు సిద్ధం అయ్యారు. తిరువారూర్‌లో జరిగే నిరసనకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేతృత్వం వహించనున్నారు. అన్ని రకాల సేవలు బంద్ కానున్న నేపథ్యంలో అన్నా కార్మిక సంఘం ద్వారా బస్సుల్ని రోడ్డెక్కించేందుకు రవాణా మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్ చర్యలు చేపట్టారు. బస్సుల మీద ప్రతాపం చూపించే యత్నం చేస్తే కఠినంగా వ్యవహరింస్తామని హెచ్చరికలు చేశారు. ఈ బంద్‌ను అడ్డుకునే విధంగా రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. లక్షల మంది సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నం అయ్యారు. ఈ బంద్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ వ్యతిరేకించారు. బంద్ ముసుగులో శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇక, ఢిల్లీలో నిరసనకు విరామం ఇచ్చిన రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలోని 70 మంది అన్నదాతలు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఉదయం చెన్నైకు చేరుకునే ఈ బృందం రైల్ రోకో చేయాలని నిర్ణయించడంతో చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బంద్ నేపథ్యంలో రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉందని చాటుకునే రీతిలో ఆగమేఘాలపై పంట బీమా నష్ట పరిహారం పంపిణీకి సీఎం ఎడపాడి కే పళనిస్వామి చర్యలు తీసుకోవడం గమనార్హం. సోమవారం సాయంత్రం సచివాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురు రైతులకు పరిహారం పంపిణీ చేశారు.