breaking news
State tribal welfare department
-
ఆశ్రమ పాఠశాలల్లో గిరిపోషణ
సాక్షి, హైదరాబాద్: గిరిపుత్రుల్లో పౌష్టికాహార లోపాల్ని అధిగమించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన ‘పోషణ్ అభియాన్’పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం పోషణ్ అభియాన్ పథకాన్ని ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లోని దాదాపు 15వేల మంది చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సంఖ్య తక్కువగా ఉండడంతో పౌష్టికాహార లోపాల్ని అధిగమించడం కష్టమని భావించిన యంత్రాంగం... ఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పౌష్టికాహారం పంపిణీ చేపట్టాలని భావించింది. గిరిపోషణ పేరిట చేపట్టే ఈ కొత్త కార్యక్రమానికి సంబంధించి ఆ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లో కంటే గిరిజన ప్రాంతాల్లోనే పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ముందుగా గిరిపోషణ కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనే అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో గిరిపోషణను అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలకు పూర్తిస్థాయిలో వసతి, భోజన సౌకర్యాన్ని కల్పిస్తుండగా... ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం మధ్యాహ్న భోజన పథకాన్నే అమలు చేస్తున్నారు. తాజాగా గిరిపోషణతో ఆయా విద్యార్థులకు అదనంగా చిరుతిళ్లను అందిస్తారు. చిరుతిళ్ల కింద తేనె, పల్లీపట్టి, బిస్కట్లు, చాక్లెట్లు, చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను ఇవ్వనున్నారు. జీసీసీ ఉత్పత్తులే... గిరిపోషణ ద్వారా పంపిణీ చేసే పదార్థాలన్నీ సహజసిద్ధంగా ఉండాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) పలు రకాల ఉత్పత్తులు చేస్తోంది. ఇందుకు సంబంధించి తయారీ యూనిట్లు సైతం ఉన్నాయి. దీంతో గిరిజన విద్యార్థులకు పంపిణీ చేసే పౌష్టికాహారమంతా జీసీసీ ద్వారా సరఫరా చేయాలని యంత్రాంగం భావిస్తోంది. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలను జీసీసీ విజయవంతంగా సరఫరా చేస్తోంది. మరోవైపు ఆహార ఉత్పత్తులు, తృణ ధాన్యాలతో కూడిన పదార్థాలను కూడా తయారు చేస్తుండడంతో గిరిపోషణ బాధ్యతలను జీసీసీకి ఇవ్వనుంది. -
ఆదిచిత్ర అదరహో
కొండగాలికి ఊగిసలాడే కొమ్మలు.. గిరికోనలో కదలాడే సెలయేళ్లు.. ఆదివాసీలు కొలిచే దేవుళ్లు.. ఇవన్నీ కాన్వాస్‌పై కదలాడాయి. గిరిజనుల కుంచె నుంచి జాలువారిన చిత్రరాజాలు వారి జీవనశైలిని కళ్లముందుంచాయి. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘ఆదిచిత్ర’ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ప్రారంభించారు. గోండ్, భిల్, రత్వా, సౌర, వర్లి, మౌరియా గిరిజన తెగలకు చెందిన ఆర్టిస్టుల చేతుల్లో రంగులద్దుకున్న చిత్రాలు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. వారు ఆరాధించే పక్షులు, జంతువుల చిత్రాలు, పామ్ లీఫ్ పెయింటింగ్‌తో తీర్చిదిద్దిన వినాయకుడి చిత్రం కళాప్రియుల మనసులను దోచుకుంటున్నాయి. ఈ సందర్భంగా ‘నాయక పోడ’ గిరిజనులు తమ నృత్యంతో అలరించారు. ఈ ప్రదర్శన ఈ నెల 21 వరకూ కొనసాగనుంది. - సాక్షి, సిటీప్లస్