breaking news
State of India
-
పులుల పోరాటం.. ఏనుగుల ఘర్షణ
సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రతికూలతల కారణంగా మానవులు, అటవీ జంతువుల మధ్య పెరుగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అడవులు నరికివేస్తుండటంతో జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ క్రమంలో తమ స్థావరాలను కోల్పోతున్న జంతువులు మానవ పరిసరాల్లోకి చొరబడి దాడులకు తెగబడుతున్నాయి. దేశంలో ఏటా పులులు, ఏనుగుల దాడుల్లో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా, వణ్యప్రాణుల అక్రమ రవాణాలోనూ ఈ రెండు జంతువులే అత్యధికంగా వేటగాళ్ల బారిపడటం గమనార్హం. స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్–డౌన్ టు ఎర్త్ 2023 నివేదిక ప్రకారం.. 2020–21తో పోలిస్తే 2021–22లో మనుషులపై ఏనుగుల దాడులు 16 శాతం, పులుల దాడులు 2019తో పోలిస్తే 2022 నాటికి 83 శాతం పెరగడం దారి తప్పిన పరిస్థితికి అద్దం పడుతోంది. ఐదు హాట్ స్పాట్లలో.. ప్రస్తుతం భారత్‌లో 3,167 పులులు ఉన్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా గడచిన 22 ఏళ్లలో పులులను అక్రమంగా వేటాడిన కేసుల్లో 34 శాతం భారతదేశం నుంచే ఉండటం గమనార్హం. నాలుగేళ్లలో (2018–21) ఇటువంటి ఘటనలు 21% పెరిగాయి. ప్రపంచంలో మొత్తం పులులను వేటాడి వాటి శరీర అవయవాల అక్రమ రవాణా తదితర కేసుల్లో 53% చైనా, ఇండోనేíÙయా, భారత్‌లోనే ఉంటున్నాయి. ప్రపంచ దేశాల్లో 1000 కంటే ఎక్కువ ప్రదేశాల్లో పులులను వేటాడే ఘటనలు నమోదయ్యాయి. భారత్‌లో 85 శాతం అక్రమ వ్యాపార వేటలు ఉత్తరప్రదేశ్‌లోని దుద్వార్ నేషనల్ పార్కు, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ నేషనల్ పార్కు, మధ్యప్రదేశ్‌లోని కన్హా టైగర్ రిజర్వు, కర్ణాటకలోని నాగర్హోల్ టైగర్ రిజర్వు, మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వు వంటి కేవలం ఐదు హాట్స్పాట్లుగా మారడం కలవరపెడుతోంది. ఇక్కడే అత్యధికంగా దాడులు అత్యధికంగా జార్ఖండ్, ఒడిశా, అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఏనుగుల దాడుల్లో ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. మహారాష్ట్రలో ఎక్కువ మంది పులుల దాడుల్లో చనిపోతున్నారు. మహారాష్ట్రలో 2019లో 26 మంది, 2020లో 25, 2021లో 32, 2022లో రికార్డు స్థాయిలో 84 మంది పులుల దాడుల్లో మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎక్కువ మంది మృతులు ఉంటున్నారు. నాలుగేళ్లలో తెలంగాణలో ఇద్దరు, తమిళనాడులో నలుగుర్ని పులులు పొట్టన పెట్టుకున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పడి.. ఆహార అన్వేషణ, ఆవాసాలు దెబ్బతినడంతో దారి తప్పడం, అడవుల్లో జన సంచారం పెరగడం వంటి కారణాలతో ఏనుగులు, పులులు మనుషులపై దాడి చేస్తుంటే.. వన్యప్రాణుల్ని చంపి వ్యాపారం చేసే వ్యక్తులతో వీటి ప్రాణాలకు పెనుముప్పు వాటిల్లుతోంది. ఏనుగు దంతాలు, పులి చర్మం, గోళ్లకు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు ఏనుగులు, పులుల్ని వేటాడుతున్నారు. దేశంలో పులుల మరణాలు 2021తో పోలిస్తే 2022లో 21 శాతం పెరిగాయి. ఇందులో 80 శాతం మరణాలకు గల కారణాలు ఇప్పటికీ అటవీ శాఖ అధికారులకు అంతు చిక్కలేదు. ఇదిలా ఉంటే 2018–19 నుంచి 2021–22 మధ్య 389 ఏనుగులు మృతి చెందాయి. వీటిల్లో 71 శాతం మరణాలు విద్యుదాఘాతంతో సంభవించడం గమనార్హం. ప్రధానంగా ఏనుగు కారిడార్లు ఎక్కువ ఆక్రమణలకు గురవుతున్నాయి. -
ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం
అల్లవరం, న్యూస్‌లైన్ : సులువుగా డబ్బు సంపాదించడానికి ఏటీఎంలో చోరీయే మేలనుకున్నాడు ఆ దుండగుడు. అందుకనుగుణంగా సరంజామా తీసుకుని ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు, సీసీ కెమేరాకు చిక్కకుండా అప్రమత్తంగా వ్యవహరించాడు. అయితే గునపంతో ప్రయత్నించినా ఏటీఎం తెరుచుకోకపోవడంతో.. దానిని అక్కడే పడేసి ఊసూరుమంటూ వెనుదిరిగాడు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అల్లవరం బ్రాంచి కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎంలో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఏటీఎంలోని సీసీ కెమేరా ఫుటేజి ఆధారంగా దుండగుడిని గుర్తించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసులు, బ్యాంకు బ్రాంచి మేనేజర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్బీఐ అల్లవరం బ్రాంచి కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎంలోకి మంగళవారం అర్ధరాత్రి 12.08 గంటలకు ఓ దుండగుడు ప్రవేశించాడు. తలమూసి ఉన్న జర్కిన్ ధరించి ఉన్నాడు. ముఖం కనిపించకుండా కర్చీఫ్‌ను కట్టుకున్నాడు. ఏటీఎంలోని సీసీ కెమేరాకు రబ్బరు స్టిక్కర్ అతికించి అతడిని, అతడు చేసే పని రికార్డు కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఏటీఎంకు ఉన్న విద్యుత్ సరఫరా, డేటా కేబుల్లను తొలగించాడు. వెంట తెచ్చుకున్న గునపంతో ఏటీఎంను పెకలించి నగదు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అయితే ఏటీఎంను పగులగొట్టలేక పోవడంతో.. చేసేదిలేక గునపాన్ని బయట పడేసి వెనుదిరిగాడు. బుధవారం ఉదయం ఏటీఎంలో నగదు తీసుకునేందుకు వెళ్లిన ఖాతాదారులు ఏటీఎం పనిచేయకపోవడం, అందులో చోరీకి యత్నించినట్టు ఉండడాన్ని గమనించి ఆ బ్యాంక్ ఉద్యోగికి విషయం తెలిపారు. ఆయన ఈ విషయాన్ని బ్రాంచి మేనేజర్ ఎం.జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. బ్రాంచి మేనేజర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై కె.విజయబాబు సంఘటన స్థలాన్ని, సీసీ కెమేరా పుటేజిని పరిశీలించారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయబాబు తెలిపారు.