breaking news
starmaa new logo
-
బుల్లితెరపై పుష్పరాజ్.. ఏ ఛానెల్.. ఎన్ని గంటలకో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప- 2' మూవీతో బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టించాడు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డులన్నీ రప్పా రప్పా అంటూ తుడిచి పెట్టేశాడు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో సౌత్ భాషల్లోనూ అందుబాటులో ఉంది.తాజాగా ఈ మూవీ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ విషయాన్ని హక్కులు దక్కించుకున్న ఛానెల్ రివీల్ చేసింది. స్టార్ మాలో ఏప్రిల్ 13న ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రసారం కానుందని ఆ ఛానెల్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో బుల్లితెరపై కూడా పుష్పరాజ్ సందడి చూసే అవకాశం రానుంది. కాగా..ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. Pushpa Raj is back to rule the game 🔥 #PushpagadiRuleuu #Pushpa2OnStarMaa pic.twitter.com/JQIMwCJgw6— Starmaa (@StarMaa) April 7, 2025 -
బిగ్‌బాస్ షో విన్నర్‌గా రేవంత్.. ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విన్నర్‌గా రేవంత్ నిలిచారు. రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచారు. ఈ గ్రాండ్ ఫినాలేలో మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు హీరోయిన్స్ స్పెషల్ డ్యాన్సులతో కనువిందు చేశారు. ఈ గ్రాండ్ ఫినాలేలో నిఖిల్, ధమాకా టీమ్ రవితేజ, శ్రీలీల, సీనియర్ హీరోయిన్ రాధ స్టేజీపై సందడి చేశారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే వైభవంగా జరిగింది. వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్‌తో కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఇక వచ్చీ రావడంతో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆత్మీయంగా పలకరించాడు నాగ్. అనంతరం మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేసిన శ్రీసత్యతో ముచ్చటించాడు. మరికాసేపట్లో పెళ్లి పెట్టుకుని పెళ్లికూతురి గెటప్‌లో గ్రాండ్ ఫినాలేకు వచ్చిన నేహా చౌదరిని చూసి అవాక్కయ్యాడు. ఈ షో ముగిసిన వెంటనే అందరూ మండపానికి వచ్చేసి తనను ఆశీర్వదించాలని కోరింది నేహా. బిగ్‌బాస్ మినీ అవార్డులు.. తర్వాత టాప్ ఫైనలిస్టులతో అవార్డుల పంపిణీ చేపట్టాడు నాగ్. అందులో భాగంగా ఐదు అవార్డులు ప్రవేశపెట్టాడు. మొదటగా బెస్ట్ చెఫ్ అవార్డు మెరీనాకు ఇవ్వాలన్నాడు రేవంత్. అందరికీ వంట చేసి పెడుతూనే గేమ్ ఆడేదని చెప్పాడు. దీంతో ఆ అవార్డును మెరీనాకు అందించాడు హోస్ట్. తర్వాత బెస్ట్ డ్యాన్సర్ అవార్డును ఫైమాకు ఇవ్వాలన్నాడు ఆదిరెడ్డి. ఆమె స్టేజీపైకి రాగానే చేతికి ముద్దు పెడతానంటూ ఆటపట్టించాడు నాగ్. దెబ్బకు హడలిపోయిన ఫైమా.. మీరు ముద్దులు ఇస్తే నాకు నిద్ర పట్టడం లేదంటూ దూరం జరిగింది. అనంతరం కీర్తి.. స్లీపింగ్ స్టార్ అవార్డును శ్రీసత్యకు ఇవ్వాలనడంతో నాగ్ దాన్ని ఆమెకు బహుకరించాడు. రోహిత్.. రాజ్ బెస్ట్ గేమర్ అని చెప్పడంతో అతడికి పురస్కారం ఇచ్చాడు నాగ్. శ్రీహాన్.. బెస్ట్ లవర్ బాయ్ అవార్డుకు అర్జున్ కల్యాణ్ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపై వచ్చి అవార్డు అందుకున్నాడు. తర్వాత యంగ్ హీరో నిఖిల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వెళ్లి టాప్-5 కంటెస్టెంట్స్‌లో ఒకరైన రోహిత్‌ను ఎలిమినేట్ చేసి తనతో పాటు బయటకు తీసుకొచ్చేశాడు. ధమాకా హీరోహీరోయిన్లు రవితేజ, శ్రీలీల స్టేజీపైకి వచ్చి జింతాత స్టెప్పుతో ఓ ఊపు ఊపారు. ఇంతలో ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. 'కీర్తి బిగ్‌బాస్ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత ధైర్యంగా ముందుకెళ్లడం చాలామందికి ఇన్స్పిరేషన్. రేవంత్‌లో 20 తప్పులు ఉంటే 40 పాజిటివ్‌లు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి వచ్చి హౌస్‌లో గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. నాకంటే ఆ ముగ్గురు బాగా ఆడారు. కాబట్టి వాళ్లకంటే ముందే ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు. తర్వాత రవితేజ హౌస్‌లోకి వెళ్లి టాప్ 3 కంటెస్టెంట్లకు సూట్‌కేసు ఆఫర్ చేశాడు. ప్రైజ్‌మనీలో నుంచి పది శాతం మీ సొంతమని ఊదరగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని ముప్పై శాతానికి పెంచినా సరే వద్దే వద్దన్నట్లుగా సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో రవితేజ చేసేదేం లేక కీర్తి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ఇక హౌస్‌లో రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. ఈసారి వారి కోసం నాగార్జున రంగంలోకి దిగాడు. గోల్డెన్ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్ ఆ డబ్బును రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్ అమ్మానాన్న కోసం తీసుకుంటున్నానన్నాడు. ఇద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చాక రేవంత్‌కు ట్రోఫీ బహుకరించడంతో పాటు పది లక్షల చెక్, 605 గజాల సువర్ణభూమి ప్లాట్‌ను అందించారు. చివరగా అందరికీ దిమ్మతిరిగిపోయే న్యూస్ చెప్పాడు నాగ్. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరూ విన్నర్స్ అయ్యాడన్నాడు. అదెలాగంటే ట్రోఫీ అందుకుని రేవంత్ గెలిచాడని, కానీ ప్రేక్షకుల ఓట్లు శ్రీహాన్‌కే ఎక్కువ వచ్చాయని ట్విస్ట్ ఇచ్చాడు. ఏదేమైనా ట్రోఫీ అందుకుంది రేవంత్ కాబట్టి అతడిని అఫీషియల్ విన్నర్‌గా ప్రకటించాడు. -
నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి!
‘‘సుమారు పదేళ్లు చిత్ర పరిశ్రమకీ, వినోదానికీ దూరంగా ఉన్న మాట వాస్తవమే. రీ–ఎంట్రీలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? గతంలో చూపిన ప్రేమాభిమానాలు చూపిస్తారా? అనే మీమాంస నాలో ఉండేది. ‘ఖైదీ నంబర్ 150’ విజయంతో నా అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘స్టార్‌మా’ కొత్త లోగోను ఆవిష్కరించారాయన. ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని అలరించిన ‘మాటీవీ’ ఇక నుండి ‘స్టార్‌మా’గా అలరించనుంది. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో ఛానల్ లోగో మారనుంది. ఈ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గతంలో సినిమా ఒక్కటే ప్రేక్షకులకు వినోదం. ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్‌లూ సినిమాలకు సమాంతరంగా వినోదం అందిస్తున్నాయి. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో ప్రేక్షకులకు చేరువయ్యే ఛాన్స్ వచ్చింది. ఈ షో మరో లెవల్‌కి వెళ్లడానికి నా ఇమేజ్ దోహదపడుతుంది. అలాగే ప్రేక్షకులకు మరింత దగ్గర కావడంతో పాటు విభిన్న వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది’’ అన్నారు. ఈ షోలో సినీ ప్రముఖులు ఎవరైనా పాల్గొంటున్నారా? అని చిరంజీవిని అడగ్గా... ‘‘నాగార్జున, వెంకటేశ్‌లు వస్తున్నారు. ఈరోజు నాగార్జున ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా రాధికా శరత్‌కుమార్, సుమలత వస్తారు’’ అని చెప్పారు. మరి, షోకి బాలకృష్ణను కూడా ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా... ‘‘తప్పకుండా! నా స్నేహితుడు వస్తే సంతోషమే కదా. నిర్వాహకులకు బాలయ్యను ఆహ్వానించమని చెబుతా’’ అన్నారు చిరంజీవి. సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల మధ్య ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌షో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో స్టార్ ఇండియా సౌత్ సీఈఓ కెవిన్ వాజ్, స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.