breaking news
SR Congress Party
-
రెండోరోజూ బంద్ ప్రశాంతం
=సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర =నిలిచిన బస్సులు = స్వచ్ఛందంగా మద్దతిచ్చిన వ్యాపారులు, ఉద్యోగులు సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సమైక్యవాదులు శనివారం నిర్వహించిన రెండోరోజు బంద్ విజయవంతమైంది. ఉదయం ఆరుగంటల నుంచే వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు, టీడీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి బంద్‌కు సిద్ధమయ్యారు. సమైక్యవాదులు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వద్ద బైఠాయించడంతో బస్సులు బయటకు రాలేదు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మాత్రమే బస్సులు తిరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ జెండాలను చేతపట్టుకుని బైక్‌లపై తిరుగుతూ దుకాణాలు మూయించారు. నగరంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. జిల్లాలోనూ.... సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. వైఎస్సార్ సీపీ నేతలు, సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూయించి, ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. ఉద్యోగులు బంద్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుడివాడలో ఏరియా ఆస్పత్రి సిబ్బంది విధులు పక్కన పెట్టి కొద్దిసేపు ఆందోళనలు చేపట్టారు. జగ్గయ్యపేటలో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు కళ్లకు గంతలు కట్టుకొని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాగడాల ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్‌బాబుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్సీపీ, టీడీపీ విడివిడిగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి, రహదారిపై నాయకులు, కార్యకర్తలు భోజనాలు చేశారు. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌కు నియోజకవర్గ కోఆర్డినేటర్ వల్లభాయ్ నాయకత్వం వహించారు. నూజివీడులో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మేకా ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో గంటసేపు ధర్నా చేశారు. కైకలూరులో వైఎస్సార్సీపీ, టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. చల్లపల్లిలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దెబ్బతిన్న పంటల పరిశీలన నేడు
విజయవాడ, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటను సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం పరిశీలించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెడన, పామర్రు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే పై-లిన్ తుపానుతో పాటు అకాల వర్షాలకు వరి పంట 50 శాతం మేర దెబ్బతిందని తెలిపారు. వెనువెంటనే హెలెన్ రూపంలో మరో తుపాను డెల్టా రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్ సీపీ దెబ్బతిన్న పొలాలను పరిశీలించే కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. సోమవారం ఉదయం గూడూరు మండలంలోని తరకటూరు నుంచి ఈ పరిశీలన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ బృందంలో తనతో పాటు పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ క్యాడర్ పాల్గొంటారని తెలిపారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరకటూరులో ప్రారంభమయ్యే ఈ యాత్ర చిట్టిగూడూరు, గూడూరు, రామరాజుపాలెం, ఆకుమర్రు, మల్లవోలు, పోలవరం, రాయవరం, తుమ్మలపాలెం, శారదాయిపేట, ఆకులమన్నాడు, కప్పలదొడ్డి గ్రామాల్లో సాగుతుందని వివరించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పెడన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఉంటుందని తెలిపారు. తరువాత పెడన మండలంలోని పెడన, కొంకేపూడి గ్రామాల్లో పర్యటిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పామర్రు నియోజకవర్గంలోని ఉండ్రుపూడి, పామర్రు, రాపర్రు, పోలవరం గ్రామాల్లో పర్యటిస్తామని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు పామర్రు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నష్ట తీవ్రతను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగిన విధంగా పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందని వివరించారు. పెడన, పామర్రు నియోజకవర్గాల్లోని పార్టీ మండల కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల వారు, రైతులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వర్ల రామయ్యకు మతి భ్రమించింది తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్యకు మతిభ్రమించిందని ఉదయభాను విమర్శించారు. హఠాన్మరణం చెందిన జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఒక బలహీన వర్గాలకు చెందిన నేతను జిల్లా పరిషత్ స్థానంపై కూర్చబెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కితే అదే నేతను మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తగా నియమించిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కిందని గుర్తుచేశారు. ఆకస్మికంగా మరణించిన వ్యక్తి గురించి అసత్య ఆరోపణలు చేయడం నీతిమాలిన రాజకీయమని విమర్శించారు. సీట్లు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీదేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే ధనవంతులైన సుజనాచౌదరి, సీఎం రమేష్‌లకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్న ఘనత చంద్రబాబుది కాదా అని ఉదయభాను ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గుడివాడ నుంచి కోసూరుకు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడున్నర గంటలు పట్టిందని, ప్రతిచోట జగన్మోహన్రెడ్డిని జనం అక్కున చేర్చుకున్నారని, ఈ ఆదరణ చూసి ఓర్పలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు.