breaking news
spot start
-
ఓపెన్ ఇంటర్ ‘స్పాట్’ ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్) గురువారం స్థానిక గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్లో ప్రారంభమైంది. జిల్లాకు మొత్తం 32 వేల జవాబుపత్రాలు వచ్చాయి. ఈ నెల 30 వరకు స్పాట్ కొనసాగే అవకాశముంది. ఇందుకోసం 200 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 30 మంది చీఫ్ ఎగ్జామినర్లు, ఆరుమంది ఏసీఓలు, 40 మందిని స్క్రూటనైజర్లను నియమించారు. క్యాంపు ఆఫీసర్గా డీఈఓ, డెప్యూటీ క్యాంపు ఆఫీసర్గా గోవిందునాయక్ వ్యవహరిస్తారు. తొలిరోజు డెప్యూటీ క్యాంపు ఆఫీసర్ గోవిందునాయక్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. -
ఇంటర్ ‘స్పాట్’ ప్రారంభం
– ఎలాంటి పొరబాట్లకు తావివ్వొద్దు – విద్యార్థులకు నష్టం కల్గితే చర్యలు తప్పవు – ఆర్ఐఓ వెంకటేశులు – కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళన అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం స్థానిక కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమైంది. తొలిసారి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలవుతుండడంతో రిజిస్ట్రేషన్లకు చాలా సమయం పడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియే సాగింది. ఒక్కొక్కరికి 15 పేపర్లు ఇచ్చారు. తొలివిడతగా మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లిషు, గణితం, పౌరశాస్త్రం, హిందీ జవాబు పత్రాలు మూల్యాంకనం చేయనున్నారు. ముందుగా ఎగ్జామినర్లు, సీఈలతో ఆర్ఐఓ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశమని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఏస్థాయి ఉద్యోగి అలసత్వం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీసీ కెమరాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర అధికారులు ఆన్లైన్లో పర్యవేక్షిస్తారన్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్న నేపథ్యంలో అందరూ వేళకు చేరుకోవాలన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన బోర్డు అధికారులు తమను మూల్యాంకనం విధులకు నియమిస్తే ఇక్కడి అధికారులు తీసుకోవడం లేదంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు. సాంకేతిక సమస్య కారణంగానే కాంట్రాక్ట్ అధ్యాపకులను విధులకు నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయని, వాటిని రద్దుచేసి రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలంటూ రాష్ట్ర అధికారులు ఆదేశించారని ఆర్ఐఓ, డీవీఈఓ తెలిపారు. ఇందుకు కాంట్రాక్ట్ అధ్యాపకులు ససేమిరా అన్నారు. దీంతో కాస్త సమయం ఇవ్వాలని కోరగా వారు ఆందోళన విరమించారు. ఇంతలోనే నియామక ఉత్తర్వులు వచ్చిన కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.