ఎస్బీహెచ్కు తాఖీదు
‘సుప్రీం’ ఆదేశాలు పాటించలేదని
నోటీసులిచ్చిన ఏపీ ఉన్నత విద్యామండలి
తమ ఖాతాల నుంచి నిధులను తెలంగాణ ఉన్నత విద్యామండలికి విడుదల చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వడంతోపాటు తప్పును సరిదిద్దుకోకపోతే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. గతంలో ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని టీ ఉన్నత విద్యామండలి లేఖలతో ఎస్బీహెచ్ ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ విద్యామండలి హైకోర్టును ఆశ్రయించిం ది. హైకోర్టు తెలంగాణ ఉన్నత విద్యామండలికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఈలోగానే ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాలను ఎస్బీహెచ్ అధికారులు టీఉన్నత విద్యామండలి కార్యదర్శి పేరిట మార్పు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరిస్తూ ఆఖాతాలు ఏపీ ఉన్నత విద్యామండలికే చెందుతాయని, రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాలని సూచించింది.
ఈ తీర్పును అనుసరించి ఏపీ ఉన్నత విద్యామండలి తమ ఖాతాలను ఏపీ కార్యదర్శి పేరిట మార్పు చేయాలని ఎస్బీహెచ్తోపాటు అన్ని బ్యాంకులకూ లేఖలు రాసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులనూ జతపరిచింది. లేఖలు రాశాక కూడా ఎస్బీహెచ్ శాంతినగర్ బ్రాంచి అధికారులు ఖాతాలను మార్పు చేయకపోవడమే కాకుండా ఖాతాలోని రూ.15 లక్షలను తెలంగాణ ఉన్నత విద్యామండలికి విడుదల చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి వరదరాజన్ ద్వారా ఎస్బీహెచ్కు నోటీసులు జారీచేశామని మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి ‘సాక్షి’కి వివరించారు.