breaking news
special deputy collector
-
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
అన్నమయ్య జిల్లా,సాక్షి : సంబేపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ10బీఎఫ్ 4990 కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవీ మరణించారు.చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద సమయంలో ఓ కారులో ప్రయాణిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించినట్లు వైద్యులు తెలిపారు. -
బదిలీలు మా ఇష్టప్రకారమే జరగాలి
మాకు కనీస సమాచారం ఇవ్వకుండానే బదిలీలు చేస్తారా? * ముఖ్యమంత్రిపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు * ఏడుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారుల బదిలీ ఉత్తర్వుల వ్యవహారంలో టీడీపీ నేతల పంతమే నెగ్గింది. కొందరి బదిలీలను నిలిపివేసేలా ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బదిలీ ఉత్తర్వులను నిలిపివేస్తూ ప్రభుత్వం 24 గంటల్లోనే మరో జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్న ఉపముఖ్యమంత్రి చేసిన బదిలీలను ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు అడ్డుకోవడం గమనార్హం. ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేవి తమ సొంత వ్యవహారమైనట్లు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అంతా తమ ఇష్టప్రకారమే జరగాలని పట్టుబడుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా వారికి వంతపాడుతున్నారు. ఈ విషయంలో ఆయన తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త లోకేశ్ జోక్యం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా బదిలీల వ్యవహారం వల్ల సీఎం, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మధ్య దూరం మరింత పెరిగిపోయినట్లు తెలుస్తోంది. నేను చేసిన సూచనలు పాటించరా! 22 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను కేఈ అనుమతితో బదిలీ చేస్తూ మంగళవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నటు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. 24 గంటలు గడవక ముందే పాత ఉత్తర్వులను తుంగలో తొక్కడం సంచలనం సృష్టిస్తోంది. తమను సంప్రదించకుండానే అధికారులను బదిలీ చేశారంటూ డిప్యూటీ సీఎం మంత్రి కేఈ కృష్ణమూర్తిపై మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికిఫిర్యాదు చేశారు. విశాఖపట్నం ఆర్డీవో నియామకం విషయంలో వివాదం చెలరేగినప్పుడు తాను చేసిన సూచనలకు విరుద్ధంగా ఇప్పుడు ఎలా బదిలీలు చేస్తారంటూ డిప్యూటీ సీఎం కేఈపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఏడుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జేసీ శర్మ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు నిలిపివేత కృష్ణా జిల్లాలో జాయింట్ కలెక్టర్-2గా పనిచేస్తున్న ఒ.శేషయ్యను అదే జిల్లాలో డీఆర్వోగా, విశాఖపట్నం ఆర్డీవో ఎస్.వెంకటేశ్వర్లును అదే జిల్లా డీఆర్వోగా నియమిస్తూ, వైఎస్సార్ జిల్లాలో జాయింట్ కలెక్టర్-2గా సి.చంద్రశేఖరర్రెడ్డిని కొనసాగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా డీఆర్వోగా పనిచేస్తోన్న బి.యాదగిరి, నంద్యాల ఆర్డీవోగా పనిచేస్తోన్న సి.సుధాకర్‌రెడ్డిలను హైదరాబాద్‌లో ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సెలవులో ఉన్న ఎం.వెంకటేశ్వర్లును తూర్పుగోదావరి జిల్లా డీఆర్వోగా, తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించిన తిప్పే నాయక్‌ను నంద్యాల ఆర్డీవోగా నియమించింది. కానీ బుధవారం వీరి బదిలీ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు
హైదరాబాద్: నిబంధనలు పాటించకుండా భూమి కేటాయింపులు జరిపారని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రయ్యను వనస్థలిపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓ స్వాతంత్ర్య సమరయోధుడికి ఆయన భూమిని కేటాయించిన కేసులో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. హయత్ నగర్ మండలం తుర్కయాంజల్‌లోని సర్వే నంబర్ 52లో పది ఎకరాల భూమిని నిబంధనలు పాటించకుండా డిప్యూటీ కలెక్టర్ రామచంద్రయ్య మంజూరు చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. -
స్వచ్ఛ జెడ్పీయే లక్ష్యం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆమె హోదా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. కానీ ఆమె ఇప్పుడు చేపడుతున్న బాధ్యతలు అంతకు మించి కీలకమైనవి. జిల్లా పరిపాలన వ్యవస్థకు గుండెకాయ లాంటి జిల్లా పరిషత్ సీఈఓ పోస్టుతో పాటు పల్లెల బాగోగులను చూసుకునే జిల్లా పంచాయతీ అధికారి బాధ్యతల్ని అదనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోనే రెండు కీలక పోస్టుల్లో కొనసాగుతున్న గనియా రాజకుమారి అటు జిల్లా పరిషత్, ఇటు పంచాయతీ శాఖలో తన మార్క్ చూపిస్తాన ని చెప్పారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఆమె, తన లక్ష్యాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు... ప్రశ్న ఉద్యోగ నేపథ్యం జ 2007లో గ్రూప్ 1లో సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టును సాధించాను. విజయనగరంలోనే ఆ బాధ్యతల్ని చేపట్టాను. అంతటితో వదిలేయకుండా తన లక్ష్యమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టును 2009 గ్రూప్ 1లో సాధించాను. రెండేళ్ల పాటు విజయనగరం జిల్లాలో శిక్షణ పొందాను. 2011 ఏప్రిల్‌లో విజయనగరం ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టాను. అనంతరం సింహాచలం దేవస్థానం ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, ఆ తర్వాత పాడేరు ఆర్డీఓగా పనిచేశాను. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సీఈఓగా బదిలీపై ఇక్కడకు వచ్చాను. ఇంతలోనే డీపీఓ పోస్టు ఖాళీ కావడంతో అదనపు బాధ్యతల్ని అప్పగించారు. ప్రశ్న ః జెడ్పీ సీఈఓగా ఇంతవరకేం చేశారు? జ ః జెడ్పీకి ఏటా రూ.24 కోట్లు ఆదాయం వచ్చే బీఆర్జీఎఫ్పై ప్రధానంగా దృష్టి సారించాను. నాకు ఇదొక సవాల్‌గా నిలిచింది. ఎన్నో ఏళ్లగా స్తంభించిన అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై చాలా కసరత్తు చేశాను. చివరికి లెక్క తేల్చాం. 2007-08 నుంచి 2014-15వరకు పెండింగ్‌లో ఉన్న పనుల జాబితా తయారు చేశాం. గ్రామ పంచాయతీ స్థాయిలో రూ.15.23కోట్ల విలువైన 1,420 పనులు, మండల పరిషత్ స్థాయిలో రూ.7.33 కోట్ల విలువైన 328 పనులు, జిల్లా పరిషత్ స్థాయిలో రూ.7.51కోట్ల విలువైన 38పనులు పెండింగ్‌లో ఉన్నట్టు తేల్చాం. అలాగే మున్సిపాల్టీలో రూ.6.54కోట్ల విలువైన పనులు నేటికీ ప్రారంభించలేదన్న విషయాన్ని గుర్తించాం. వీటిన్నింటిని మార్చి 31లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు డెడ్‌లైన్ పెట్టాను. ప్రశ్న ః ప్రక్షాళన దిశగా చర్యలేంటి? జ ః జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణితో సమన్వయం చేసుకుని ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ముఖ్యంగా అధికారుల బదిలీల విషయంలో కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేశాం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న డిప్యూటేషన్లు రద్దు చేసి, ఉద్యోగులందర్ని వెనక్కి తెప్పించాం. ప్రశ్న ః ప్రస్తుత లక్ష్యమేంటి? జ ః విజయనగరం జెడ్పీని స్వచ్ఛ జెడ్పీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇప్పటికే స్వచ్ఛ భారత్‌లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టాం. జిల్లా పరిషత్ ప్రాంగణంలో పురుషులకొకటి, మహిళలకొకటి చొప్పున టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మించే యోచనలో ఉన్నాం. వాటికి సంబంధించిన అంచనాలు తయారు చేస్తున్నాం. మండల స్థాయిలో కూడా ఇదే తరహాలో అటు మహిళలకు, ఇటు పురుషులకు వేర్వేరుగా టాయిలెట్ కాంప్లెక్స్‌లను నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నాం. అలాగే 921పంచాయతీల్లో కూడా టాయిలెట్లు నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. ప్రాధాన్యాతా క్రమంలో పనులు చేపడుతాం. ప్రశ్న ః డీపీఓగా తీసుకున్న నిర్ణయాలేంటి? జ ః డీపీఓగా అదనపు బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ప్రత్యేక దృష్టి సారించాను. ఈ పంచాయతీ అమల్లో విజయనగరం జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు తొలి విడతగా 203 క్లస్టర్లో 382పంచాయతీల్లో ఆన్లైన్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాను. రెండేసి పంచాయతీలకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ చొప్పున, 203 పంచాయతీల్లో కంప్యూటర్లు కేటాయించాం. మిగతా వాటికి సమకూర్చే పనిలో ఉన్నాను. ప్రశ్న ః పంచాయతీ ఆదాయ వనరులు పెంచేందుకు తీసుకున్న చర్యలేంటి? జ ః పంచాయతీల్లో 47పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. కనీసం అందులో కొన్నైనా అమలు చేసి పంచాయతీల ఆదాయాన్ని మెరుగు పర్చాలని యోచిస్తున్నాను. ఇప్పటికే ఇంటి పన్నుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చే శాం. కేవలం పన్నుల ద్వారా రూ. 7.90కోట్ల మేర ఆదాయం రావల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శులందరికీ ఇటీవల లక్ష్యాల్ని నిర్ధేశించాం. మార్చి 31లోగా శతశాతం పూర్తి చేయాలని ఆదేశించాను. అందులో భాగంగా ఇప్పటికే రూ.2.36కోట్లు వసూలైంది. అలాగే పన్నుయేతర ఆదాయం రూ.1.76కోట్లు రావల్సి ఉండగా రూ.69.11లక్షలు వసూలు చేశాం. ప్రశ్న ః పంచాయతీల్లో పారిశుద్ధ్యం మాటేంటి ? జ ః పంచాయతీల పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ముఖ్యంగా అనేక గ్రామాల్ని పట్టిస్తున్న డంపింగ్ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీకొక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే 423 పంచాయతీలకు సంబంధించి స్థలాన్ని గుర్తించాం. ఒక్కొక్క పంచాయతీకి రూ. లక్షా 41వేలు మంజూరు చేస్తాం. వీటిలో 213 పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి చేస్తాం. మండల డంపింగ్ యార్డ్‌ను మోడల్‌గా తీసుకుని పనిచేస్తాం. ప్రశ్న ః స్వచ్ఛభారత్ అభియాన్ అమలు చర్యలేంటి? జ ః జిల్లాలో లక్ష టాయిలెట్లు నిర్మిస్తాం. ఇప్పటికే బేస్ లైన్ సర్వేలో గుర్తించాం. వాస్తవానికైతే జిల్లాలో 3.5లక్షల మేర డిమాండ్ ఉంది. దశల వారీగా ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న ః నిధుల పరిస్థితేంటి? జ ః పంచాయతీలకు నిధుల సమస్య లేదు. 13వ ఆర్థిక సంఘం కింద విడుదలైన రూ.25.80 కోట్లు ఇప్పటికే పంచాయతీల్లో ఉన్నాయి. అలాగే, సీనరేజీ గ్రాంట్ రూ.12.39 లక్షలు, నాలుగు శాతం తలసరి ఆదాయం గ్రాంట్ రూ.18లక్షలు, వృత్తి పన్ను ఆదాయం రూ. కోటీ 31లక్షలు ఉన్నాయి. ప్రశ్న ః ఇసుక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కన్వీనర్‌గా తీసుకున్న చర్యలేంటి? జ ః గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీ వేశాం. నిఘా పెంచుతాం. ప్రభుత్వానికి ఆదా యంపెంచడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం. అక్రమ తవ్వకాలు, తరలింపు పూర్తిగా నియంత్రిస్తాం. ప్రశ్న ః పంచాయతీ భవనాల మాటేంటి? జ ః జిల్లాలో 921పంచాయతీలకు గాను 477పంచాయతీలకు మాత్రమే పక్కాభవనాలు ఉన్నాయి. భవనాలు లేని చోట పంచాయతీ స్వశక్తి కరణ్ అభియాన్ కింద నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. ఒక్కొక్క పంచాయతీకి రూ.12 లక్షల చొప్పున తొమ్మిది పంచాయతీలకు నిధులు మంజూరయ్యాయి. అలాగే, 11 మండలాల కేంద్రాల్లో మండల పంచాయతీ రిసోర్స్ సెంటర్ పేరుతో ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు ఒక్కొక్క దానికి రూ.10 లక్షల చొప్పున మంజూరయ్యాయి. జిల్లా కేంద్రానికి జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్ మంజూరైంది, రూ.2కోట్లు ప్రభుత్వం కేటాయించింది, టెండరు కూడా పిలిచాం. -
కలెక్టర్ సతీమణి జిల్లాకు బదిలీ
సాక్షి, కరీంనగర్ : జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య సతీమణి విజయలక్ష్మి బదిలీపై జిల్లాకు వస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆమెను.. కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరబ్రహ్మయ్య ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందారు. ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం రోజుల్లో ఆయన విధులకు హాజరుకానున్నారు. ఆయన అనారోగ్యం కారణంగా విజయలక్ష్మిని బదిలీ చేయాలని నిర్ణయించారు.