breaking news
SP Vishal Gunn
-
కావలిలో బాలుడి కిడ్నాప్
► రూ.10లక్షలు డిమాండ్ చేసిన దుండగుడు ► ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి చొరవతో కిడ్నాపర్ ఆటకట్టు ► పోలీసుల అదుపులో జులాయి కావలి: పట్టణానికి చెందిన 4వ తరగతి చదువుతున్న బాలుడి కిడ్నాప్ ఉదంతం గురువారం సాయంత్రం ప్రజలను కలవరపెట్టింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని జనతాపేటకు చెందిన బుర్లా శ్రీధర్‌రెడ్డి కుమారుడు జయవర్ధన్‌రెడ్డి స్థానికంగా ఉన్న శ్రీచైతన్య పాఠశాలలో 4వతరగతి చదువుతున్నాడు. ముసునూరుకు చెందిన కుందుర్తి చౌసిల్ ఉదయం పాఠశాలకు వెళ్లి ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి వారి తల్లిదండ్రులు జయవర్ధన్రెడ్డిని తీసుకురమ్మన్నారని స్కూలు ఉపాధ్యాయులకు చెప్పాడు. నిందితుడి మాటలు విన్న టీచర్లు బాలుడిని అతనికి అప్పగించారు. ఆటోలో ఎక్కించుకున్న బాలుడిని పట్టణమంతా తిప్పుతూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చౌసిల్ రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు నేరుగా స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ విశాల్ గున్నీతో మాట్లాడారు. దీంతో కావలి పోలీసులను అప్రమత్తం చేసి బాలుడిని కాపాడగలిగారు. పోలీసుల హడా వుడితో కిడ్నాపర్ పట్టణంలోనే వెంగళరావునగర్ ప్రాంతంలో బాలుడిని వదిలి వెళ్లాడు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు ఇంటికి చేరుకుని జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వైస్సార్సీపీ స్థానిక నేతలతో చర్చించి న తరువాత బాలుడిని వెంటబెట్టుకుని ముసునూరుకు తీసుకెళ్లారు. ముసునూరులో కిడ్నాపర్ ఇంటికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గరే ఉన్న కిడ్నాపర్ చౌసిల్ను బాలుడు గుర్తుపట్టాడు. వెంటనే నిందితుడిని పట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్‌నకు పాల్పడిన కుందుర్తి చౌసిల్ బీటెక్ మధ్యలోనే వదిలి జులాయిగా తిరుగుతుంటాడని పోలీసులు తెలిపారు. అతను పట్టణంలో ఓ షాపులో పనిచేస్తున్నప్పుడు శ్రీధర్‌రెడ్డి పక్కనే ఉన్న తన స్నేహితుడి షాపు వద్దకు వెళ్తుండేవాడు. శ్రీధర్‌రెడ్డి ఆస్తిపాస్తులపై ఆరా తీసిన చౌసిల్ డబ్బులు రాబట్టేందుకు ఆయన కుమారుడిపై కన్నేసి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. చౌసిల్ని అరె స్ట్ చేసి విచారిస్తున్నారు. -
ఆపరేషన్ ‘బెట్టింగ్’!
► అజ్ఞాతంలోకి బుకీలు ► టీడీపీ నేతల హస్తం నెల్లూరు(క్రైమ్): క్రికెటర్లు ఫీల్డ్‌లో పరుగులు తీస్తుంటే బయట పందాలు కాస్తూ జల్సాలు చేసిన బుకీలు, పంటర్లు, బెట్టింగ్ మాఫియా ప్రస్తుతం ఎవ్వరికి కనపడకుండా పరుగులు తీస్తున్నారు. కొంప, గోడు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వారికి దాపురించింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్ క్రికెట్ పోటీలు ప్రారంభం నుంచే జిల్లా లో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఈనెల తొమ్మిది నుంచి ఐపీఎల్-9 ప్రారంభం కానుంది. 50 రోజుల పాటు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య, ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలను గుల్లచేస్తున్న బెట్టింగ్‌ను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ చర్యలు చేపట్టారు. ఆపరేషన్ బెట్టింగ్ పేరిట బుకీల భరతం పట్టేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఎవరినీ ఉపేక్షించవద్దని హుకుం జారీచేశారు. ఆదేశాలు అందిందే తడువుగా స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ విక్రమ్‌శ్రీనివాస్ నేతృత్వంలో సిబ్బంది బుకీల ఎరివేతకు చర్యలు చేపట్టారు. ఆదివారం పొదలకూరుకు చెందిన శ్యామ్‌ప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని నెల్లూరుకు తరలించి తమదైన శైలిలో విచారించినట్లు తెలిసింది. ఆయన వద్ద నుంచి పలువురు బుకీల ఫోన్ నెంబర్లు వివరాలు సేకరించారు. వారి గురించి గుట్టుగా ఆరా తీస్తున్నారు. అజ్ఞాతంలోకి బుకీలు: పోలీసు బాస్ చర్యలతో బుకీ ల వెన్నులో వణుకు మొదలైంది. సుమారు రెండేళ్లపాటు చక్రం తిప్పిన బుకీలు ఒక్కొక్కరిగా అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన బి.వి రమణకుమార్, సెంథిల్‌కుమార్‌లు క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో బెట్టింగ్‌కు బ్రేక్‌పడింది. ఆ తర్వాత ఎస్పీలు పెద్దగా దీనిపై దృష్టిసారించలేదు. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. జిల్లా ఎస్పీగా విశాల్‌గున్నీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి క్రికెట్ బెట్టింగ్‌పై పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆపరేషన్ బెట్టింగ్ పేరుతో బుకీల భరతం పట్టేందుకు చర్యలు చేపట్టారు. పలువురు రాజకీయనాయకులు: క్రికెట్ బెట్టింగ్‌లో పలువురు రాజకీయ నేతలు హస్తం ఉన్నట్లు సమాచారం. ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొన్న శ్యాంప్రసాద్‌ను, అతని సహచరుడైన టీడీపీ చోటా నేతను 2013మే 23వ తేదీన రెండో నగర పోలీసులు అరెస్ట్‌చేశారు. నాడు పోలీసులకు పట్టుబడ్డ నేత నేడు బడానేతగా మారాడు. నేటికి వారిద్దరూ సన్నిహితంగా గడుపుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారపార్టీకి చెందిన మరోనేత సైతం ఇదే తరహాలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో మాగంట లేఅవుట్లో పట్టుబడ్డ ఓ బుకీ సైతం ప్రస్తుతం తన కార్యకలాపాలను విసృ్తతం చేశాడన్న విమర్శలున్నాయి. హరనాధపురానికి చెందిన ఇద్దరు బుకీలు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎస్పీ చర్యలు అభినందనీయం: క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ఎస్పీ విశాల్‌గున్నీ తీసుకొంటున్న చర్యలకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. బెట్టింగ్ మాఫియా సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు.