breaking news
SP rama RAJESWARI
-
నయీమ్ ఖతమ్
-
పోలీసుల కాల్పుల్లో నయీమ్ హతం
-
నయీమ్ ఖతమ్
షాద్‌నగర్‌లో కాల్చి చంపిన పోలీసులు ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్.. బెల్లి లలిత.. సాంబశివుడు.. పౌరహక్కుల నేత పురుషోత్తం.. పటోళ్ల గోవర్దన్‌రెడ్డి.. ఒక్కరా ఇద్దరా...! ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో..!! కరడుగట్టిన నేరగాడు నయీముద్దీన్ రక్తదాహానికి వీరంతా బలైనవారే!! హత్యలు, భూదందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులతో రెండు దశాబ్దాలుగా టై సృష్టించిన ఈ కిరాతక నేర గాడి కథ ఎట్టకేలకు ముగిసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టిన పోలీసులు పక్కాగా వ్యవహరించి అతడు ఉన్న ఇంటిని చుట్టుముట్టి మట్టుబెట్టారు. తొలుత పీపుల్స్‌వార్‌లో చేరిన ఇతడు.. తర్వాత నక్సల్స్‌ను అంతం చేస్తానని ప్రతినబూని పోలీసులకు దగ్గరయ్యాడు. అతడిచ్చిన సమాచారంతోనే పోలీసులు కూడా అనేక సందర్భాల్లో మావోయిస్టులకు చెక్ పెట్టారు. అటు పోలీసులతోపాటు ఇటు కొందరు రాజకీయ నేతల పరిచయాలతో రెచ్చిపోయిన నయీమ్ అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసుల తూటాలకే బలయ్యాడు. నయీమ్‌ను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు హైదరాబాద్‌లో అతడు నివాసం ఉంటున్న ఇంటిపైనా దాడులు చేశారు. ఇంటి నుంచి రూ. 2 కోట్లు, దాదాపు రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో అతడి అనుచరుడిగా భావిస్తున్న శ్రీధర్‌గౌడ్ ఇంటి నుంచి కూడా రూ. 38 లక్షలు పట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండున్నర దశాబ్దాల రక్తచరిత్రకు తెర పడింది! కరడుగట్టిన నేరగాడు, మావోయిస్టు మాజీ నేత నయీముద్దీన్ (50) కథ ముగిసింది. ఎంతోమందిని నిర్దాక్షిణ్యంగా చంపించిన నయీమ్ చివరికి పోలీసు తూటాలకు నేలకొరిగాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని మిలీనియం కాలనీలో సోమవారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అక్కడికక్కడే మరణించాడు. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తూ వ్యాపార, వాణిజ్య వర్గాలను గడగడలాడించిన న యీంపై గతనెల 16న నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నయీమ్‌పై నిఘా పెట్టి అతడు షాద్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించారు. పక్కా ప్రణాళికతో ఇంటిని చుట్టుముట్టి మట్టుబెట్టారు. ఆపరేషన్ నయీమ్ ఇలా.. షాద్‌నగర్ కేంద్రంగా నయీమ్ అనేక అరాచకాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు మిలీనియం కాలనీలోని ఓ ఇంటిపై నిఘా వేశారు. అందులో నయీమ్ ఉన్నట్లు నిర్ధారించుకుని.. సోమవారం తెల్లవారుజామునే కాలనీ మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ బయటికి రావద్దని కాలనీవాసులకు చెప్పారు. వారి మొబైల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్ ఏఎస్పీ కల్మెశ్వర్ సింగెనవర్ నేతృత్వంలో ప్రత్యేక, స్థానిక పోలీసులు ఉదయం 8 గంటలకు నయీమ్ ఉన్న ఇంటిని చుట్టుముట్టారు. దూరం నుంచే ఇంట్లో అతడి కదలికలను జాగ్రత్తగా గమనించారు. అప్పటికే నయీమ్ పోలీసులను పసిగట్టాడు. ఇంటికి, పోలీసులకు మధ్య వంద అడుగుల దూరం ఉండటంతో వెంటనే తేరుకున్న నయీమ్ అందుబాటులో ఉన్న ఫోర్డ ఎండీవర్ కారులోకి డ్రైవర్‌తో సహా ఎక్కాడు. కారు స్టార్ట చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చుట్టుముట్టడంతో ఎటూ వెళ్లలేమని గ్రహించిన కారు డ్రైవర్... మొదట పిస్టల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు. అదే సమయంలో కారులోంచి నయీమ్ కిందికి దిగాడు. ఏకే 47తో పొజిషన్ తీసుకుని పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఒక్కడే కావడంతో నయీమ్ ఎటూ వెళ్లలేకపోయాడు. పోలీసులు వెంటవెంటనే 8 రౌండ్లు కాల్చడంతో నయీమ్ ఛాతీ, తొడలోకి మూడు బుల్లెట్లు(ఒకటి ఛాతీ కుడివైపు, రెండు తొడలోకి) దిగాయి. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. 20 నిమిషాలపాటు ఎన్కౌంటర్ సాగింది. ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నయీమ్ మరణించినట్లు ధ్రువీకరించారు. మరోవైపు పారిపోయిన డ్రైవర్‌ను రంగారెడ్డి జిల్లా షాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులు నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. నయీమ్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే ఇంటిని సోదా చేశారు. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి వేరేచోటుకి తరలించినట్లు తెలుస్తోంది. ఎవరీ ఉసూర్ బాష? నయీమ్‌కు ఆశ్రయమిచ్చిన ఉసూర్ బాషా రెండున్నర సంవత్సరాల క్రితం షాద్‌నగర్‌లో ఇల్లు కొన్నట్టు తెలిసింది. ఇందులో బాషాకు సంబంధించిన ఓ మహిళ నివాసం ఉండేదని, ఆమె ఒక్క రోజు కూడా తలుపు తీసి బయటకు వచ్చిన సందర్భం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. ఏదైనా శుభకార్యాలకు ఆహ్వానిస్తే తలుపుకు ఉన్న చిన్న రంధ్రం ద్వారానే మాట్లాడేదని ఓ మహిళ తెలిపింది. షాద్‌నగర్‌లో పోస్టుమార్టం షాద్‌నగర్ ఎమ్మార్వో చందర్రావు, కొత్తూరు ఎమ్మార్వో ఘటనాస్థలికి చేరుకుని పోలీసు అధికారుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం నయీమ్ మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 5 గంటలకు డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. శవ పంచనామా, పోస్టుమార్టం అంతా వీడియో చిత్రీకరించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తో కనిపెట్టి.. షాద్‌నగర్‌ను సురక్షిత జోన్‌గా ఎంచుకున్న నయీమ్.. తన ముఖ్య అనుచరుడైన ఉసూర్ బాషాకు చెందిన ఇంట్లో మకాం వేశాడు. కుటుంబసభ్యులతో వచ్చి వెళ్తుండేవాడు. డిచ్పల్లికి చెందిన రియల్టర్‌ను కోటి రూపాయలు కావాలని బెదిరించిన కేసును విచారిస్తున్న పోలీసులు.. షాద్‌నగర్ ప్రాంతం నుంచే నయీమ్ ఫోన్ చేస్తున్నట్లు సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. అతడికి సహకరిస్తున్నారని అనుమానం ఉన్నవారి కదలికలపై 20 రోజులుగా ప్రత్యేక నిఘా ఉంచారు. ఉసూర్ బాషా ఇంటికి నయీమ్ పలువురు మహిళలతో తరచూ వస్తున్నాడని గుర్తించారు. సోమవారం ఉదయం నయీమ్ ఆ ఇంటిలోనే మకాం వేశాడని పక్కాగా ధ్రువీకరించుకున్న పోలీసులు తమ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ ఇంటి నుంచి ఉసూర్ బాషాతోపాటు పలువురు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. షాద్‌నగర్.. ఎందుకు? హైదరాబాద్‌కు షాద్‌నగర్ అతి సమీపంలో ఉంది. ఇక్కడినుంచి గంటలో రాజధానికి చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా సమీపంలో ఉంటుంది. షాద్‌నగర్‌కు వచ్చేందుకు రెండు మూడు దారులుంటాయి. దీంతో ఏదైనా ఘటన జరిగితే ఒక్కో దారిలో రావొచ్చు. అలాగే షాద్‌నగర్ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల వారు నివాసం ఉంటారు. ఎవరెవరు ఉంటారో పక్కింటి వారికి కూడా తెలియదు. అందుకే ఈ ప్రాంతాన్ని నయీమ్ సేఫ్ షెల్టర్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తన కదలికలు తెలియకుండా ఉండేందుకు నయీమ్ ఎటు వెళ్లినా వాహనంలో మహిళలు ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వాడని, వారిని కూడా తరచూ మారుస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. ఇంటిని సోదా చేయడానికి వెళ్లాం: ఎస్పీ రెమా రాజేశ్వరి షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో జరిగిన ఎన్కౌంటర్లో నయీముద్దీన్ మరణించాడని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎన్కౌంటర్ తర్వాత ఘటనాస్థలిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘గతనెల 16న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఓ వ్యాపారిపై కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు అక్కడ ఫిర్యాదు నమోదైంది. వివిధ ప్రాంతాల్లో ఆ గ్యాంగ్ కోసం విచారణ జరుపుతుండగా షాద్‌నగర్ ప్రాంతం నుంచి ఆ వ్యాపారికి బెదిరింపులు వెళ్లాయని నిర్ధారించుకున్నాం. ఈ క్రమంలో మిలినీయం కాలనీలోని ఓ ఇంటిని సోదా చేయడానికి పోలీసు బృందాలతో వెళ్లాం. అప్పటికే ఆ ఇంటినుంచి పోలీసులను చూసి కొందరు కారులో పారిపోయే ప్రయత్నం చేశారు. కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్త్తి ముందు కాల్పులు జరిపాడు. పోలీసులు ప్రతిఘటించడంతో డ్రైవర్ పారిపోయాడు. వెనుక సీట్లో ఉన్న వ్యక్తి కాల్పులు కొనసాగించాడు. దీంతో పోలీసులు సైతం కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. కాల్పుల అనంతరం ఆ వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించగా నయీమ్‌గా గుర్తించాం’’ అని ఆమె వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్థలాన్ని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ పరిశీలించారు. షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఆత్మరక్షణ కోసమే నయీంపై కాల్పులు!
మహబూబ్‌నగర్ : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం ఎన్కౌంటర్ ఘటనపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'నిన్న రాత్రి వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని, ఎండీవర్‌ను వెంబడించాం. అయితే, కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తే నయీం అని తర్వాత తేలింది' అని ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. నయీంకు ఎన్నో కేసుల్లో ప్రమేయం ఉందని, చాలాకాలంగా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నయీం ఉపయోగించిన ఫోర్డ్ ఎండీవర్ వాహనాన్ని (AP 28 DR 5859) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం వడ్డేపల్లి నర్సింగరావు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లుగా నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారిన నయీం పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు, రాజకీయ నాయకులూ సైతం ఉలిక్కిపడతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 50కి పైగా హత్యలు, పలు బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నక్సలైట్‌గా తన జీవిత ప్రస్థానం ప్రారంభించిన నయీం అనంతరం హత్యలు, దోపిడీలు, దందాలతో కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంటిపై పోలీసుల జరిపిన దాడిలో పట్టుబడ్డ డబ్బును లెక్కించడానికి 4 క్యాష్ కౌంటింగ్ మిషన్లు వాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే నయీం ఆర్థిక పరిస్ధితి అర్థం చేసుకోవచ్చు. నయీం 'సాక్షి' వెబ్సైట్ సమగ్ర కథనాలు ఇవి..! 1. ఎవరీ నయీం? 2. షాద్ నగర్ లో కాల్పులు, నయీం హతం 3. 'పక్కా సమాచారంతోనే స్కెచ్' 4. నయీం జాడ ఎలా దొరికిందంటే..? 5. నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు! 6. నయీం చనిపోవడం ఆనందంగా ఉంది : సాంబశివుడు తండ్రి 7. పోలీసుల అదుపులో నయీం కుటుంబసభ్యులు -
ఆత్మరక్షణ కోసమే కాల్పులు
-
ఆత్మరక్షణ కోసమే కాల్పులు: రమా రాజేశ్వరి
మహబూబ్‌నగర్ : షాద్ నగర్ కాల్పులపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న రాత్రి వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని, స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని, ఎండీవర్‌ను వెంబడించారన్నారు. అయితే కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినట్లు ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. చనిపోయిన వ్యక్తి నయీంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. నయీంకు ఎన్నో కేసుల్లో ప్రమేయం ఉందని, చాలాకాలంగా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరోవైపు నయీం భార్య, కుటుంబసభ్యులు ఉన్నట్లు అనుమానంతో నార్సింగ్ లోని ఓ అపార్ట్‌మెంట్‌ను పోలీసులు చుట్టుముట్టారు. కాగా నయీం ఉపయోగించిన ఫోర్డ్ ఎండీవర్ వాహనాన్ని (AP 28 DR 5859) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం వడ్డేపల్లి నర్సింగరావు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. -
సంకల్పానికి పేదరికం అడ్డుకాదు
- మేధావులంతా పేదరికం నుంచి వచ్చిన వారే - పేద విద్యార్థులకు సాయం చేస్తా - ఎస్పీ రెమా రాజేశ్వరి నస్కల్ కస్తూర్బా - పాఠశాలలో విద్యార్థినులకు దుప్పట్ల పంపిణీ పరిగి : సంకల్పం గట్టిదైతే చదువుకునేందుకు పేదరికం అడ్డుకాదని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం ఆమె మండలంలోని నస్కల్ కస్తూర్బా పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థినులకు రగ్గులు పంపిణీ చేశారు. చేవెళ్ల సీఐ ఉపేందర్ స్నేహితుడు, వ్యాపారవేత్త ప్రకాష్ వితరణగా ఇచ్చిన రూ. 50 వేల విలువ చేసే రగ్గులను ఎస్పీతో పాటు డీఎస్పీ రంగారెడ్డి విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. తానూ 15 కిలో మీటర్లు నడిచి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదివానన్నారు. పేదలకు సాయం చేసేందుకు తాను ఎప్పటికీ ముందుంటారని తెలిపారు. అబ్దుల్ కలాం, నెల్సన్ మండేలా, అబ్రహాంలింకన్ లాంటి ఎందరో మేధావులు పేదరికం నుంచి వచ్చిన వారేనని ఆమె గుర్తు చేశారు. అవగాహన ద్వారా సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలదామని పిలుపునిచ్చారు. నేటికీ బాలకార్మికులు పనుల్లో మగ్గుతుండడం, బాల్య వివాహాలు కొనసాగుతుండటం బాధకరమన్నారు. అనంతరం డీఎస్పీ రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతుందని ఎవరైనా ఎలాంటి ఆపదలోనైనా జంకులేకుండా పోలీసులను సంప్రదించాలన్నారు. దాత ప్రకాష్ మాట్లాడుతూ చలికి వణికి పోతున్నారంటూ పేపర్లలో వచ్చిన వార్తలతో సీఐ ఉపేందర్ సూచనల మేరకు రగ్గులను వితరణ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సీఐ ఉపేందర్, ఎస్ఐ నగేష్, ఎంఈఓ అంజిలయ్య, కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.