breaking news
Southwest Effect
-
నంద్యాల నుంచి విశాఖ వరకు నైరుతి
రెండు రోజుల్లో చెదురుమదురు వానలు వడగాలుల తీవ్రత తగ్గినా.. 96 మంది మృతి విశాఖపట్నం: నై‘రుతు’రాగం విశాఖను పలకరించింది. కోస్తా తీరం వెంబడి నంద్యాల నుంచి విశాఖను బుధవారం నైరుతి తాకింది. అక్కడి నుంచి భువనేశ్వర్ మీదుగా ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులుగా కురిసిన వర్షాలు, గాలి దిశ ఆధారంగా దీన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వాటి విస్తరణకు సానుకూల వాతావరణం ఉన్నట్టు వెల్లడించింది. మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలకు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించనున్నట్టు పేర్కొంది. వర్షాలు ఇప్పటికిప్పుడు ఆశించిన స్థాయిలో పడకపోయినా.. వడగాడ్పుల నుంచి తక్షణ ఉపశమనం లభించినట్టేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఒడిశా నుంచి కోస్తా తీరం వెంబడి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. గత వారం రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. కోస్తాలోని విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని వరంగల్‌లో బుధవారం కూడా వడగాడ్పులు కొనసాగినా రుతుపవన ప్రభావంతో అంతగా ప్రభావం చూపలేదు. నిప్పుల కుంపటిని తలపించిన కోస్తాలో బుధవారం చాలావరకు మబ్బులుపట్టాయి. వడగాడ్పులు సన్నగిల్లాయి. గతం వారం రోజుల్లో సాధారణం కంటే 5-10 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. బుధవారం మాత్రం సాధారణం కంటే కోస్తాలో సుమారు 5 డి గ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఒంగోలు, కాకినాడ, విశాఖలో కొంత తగ్గుముఖంపట్టాయి. ఒంగోలులో 39.7 డిగ్రీలు, మచిలీపట్నం 39.6, నెల్లూరు 39.4, తిరుపతి 39.2, కాకినాడ 37.7, విజయవాడ 37.2, నిజామాబాద్ 36.6, కళింగపట్నం 35.5, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో 35.1 డిగ్రీల వంతున, అనంతపురంలో 35, రామగుండంలో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆగని మరణాలు.. వడగాలుల తీవ్రత తగ్గినా బుధవారం వడదెబ్బకు గురై 96 మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో 16 మంది, కృష్ణాజిల్లాల్లో 15 మంది, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో 13 మంది వంతున, విశాఖపట్నం జిల్లాలో 12 మంది, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు వంతున, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, తెలంగాణలోని నల్లగొండ, మెదక్ జిల్లాల్లో బుధవారం వడదెబ్బతో ఏడుగురు మృతి చెందారు. -
వడదెబ్బకు ఏపీలో 237 మంది మృతి
- ఉత్తర కోస్తాకు తీవ్ర వడగాడ్పులు - కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల తీవ్రత మళ్లీ పెరిగింది. వడదెబ్బకు గురై సోమవారం రాష్ట్రంలో 237 మంది మరణించారు. వడదెబ్బతో గత నాలుగు రోజుల్లో 431 మంది మరణించిన విషయం తెలిసిందే. సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో 62 మంది, విశాఖపట్నం జిల్లాలో 37 మంది, విజయనగరం జిల్లాలో 34 మంది, కృష్ణాజిల్లాలో 27 మంది, శ్రీకాకుళం జిల్లాలో 26 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 24 మంది, ప్రకాశం జిల్లాలో 19 మంది, నెల్లూరు జిల్లా లో 12 మంది, చిత్తూరు జిల్లాలో నలుగురు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు వం తున, అనంతపురంలో ఇద్దరు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. తునిలో మరోసారి అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులుండగా దక్షిణ కోస్తాంధ్రలో వడగాడ్పుల వాతావరణం నెలకొంది. మరో 24 గంటలపాటు ఇవే పరిస్థితులు కొనసాగనున్నట్టు వాతావరణ నిఫుణులు వెల్లడించారు. పశ్చిమ గాలుల కొనసాగింపు, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా.. వర్షాలింకా మొదలవకపోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నట్టు పేర్కొన్నారు. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు తీరాన్ని ఆనుకుని అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని బాపట్ల వరకు విస్తరించాయి. మరో మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలున్నట్టు వాతావరణ నిఫుణులు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో తేమ ఏర్పడి, నైరుతి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ తీరంలోని గుజ రాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తదితర ప్రాంతాల్లో నైరుతి ప్రభావం బాగా ఉండటంతో రాష్ట్రంలో కూడా వాటి విస్తరణకు సానుకూలమేనన్నారు.