breaking news
sitaramulu
-
జయహో భక్త హనుమాన్
సప్త చిరంజీవులలో ఒకడు, శ్రీరాముడికి ప్రియ భక్తుడు. అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటి మరీ లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు. ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకు వచ్చి కదన రంగాన వివశుడై పడి ఉన్న లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వాన్ని అణచినవాడు అయిన వీర హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం సాధ్యమా? భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఆయన్ని ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. వాయుదేవుడి వరప్రసాదంగా జన్మించాడు కనుక వాయుపుత్రుడని, పవన సుతుడనీ అంటారు. సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి పేర్లతో కూడా ఆరాధిస్తారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన హనుమంతుడు తాను స్వయంగా అంతులేని పరాక్రమవంతుడయ్యి కూడా శ్రీరాముని సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయనకు శ్రీరాముడంటే ఎంతటి భక్తి ప్రపత్తులంటే తన మనసునే మందిరంగా చేసి మరీ వారిని ఆరాధించాడు. ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతే వచ్చే బాధలూ తొలగిపోతాయి. బుద్ధి బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. అందుకే హనుమజ్జయంతి పర్వ దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుని అర్చిస్తారు. ‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్ప వారి పరిపూర్ణలోచనం మారుతీం సమత రాక్షసాంతకం’ అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూంటుందో అక్కడ కళ్లనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడట హనుమంతుడు. దీనిని బట్టి శ్రీరామ నామ జపం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. సూర్యాంజనేయం సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం. అది మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి. హనుమంతునికి రాముని తర్వాత సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడదు. ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎర్రని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరితే ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే. దీని అర్థం ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించటం వాళ్ల మొదటి అనుబంధం. సూర్య శిష్యరికం బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి విద్యను అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా అంగీకరించాడు. సూర్యుని దగ్గర హనుమంతుడు విద్యను అభ్యసించేందుకు ఉదయాద్రిపై ఓ పాదం, అస్తాద్రిపై ఓ పాదం ఉంచి వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు. సూర్యుని శిష్యరికం వల్లే శ్రీరాముని మొదటి సమాగమంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతో, సింహికను శక్తితో, సురసను యుక్తితో జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే. సూర్యపుత్రునికి స్నేహితుడు సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే.వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావనా లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది.హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడే. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాభాగ్యం హనుమకి దక్కింది. శ్రీరామునితో పరిచయమైన నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు. – కృష్ణ కార్తీక హనుమధ్యాన శ్లోకాలు ►హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో కొలిచిన వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు. ►విద్యా ప్రాప్తికి పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్దోష వినాశన! సకల విద్యాం కురుమే దేవ రామదూత నమోస్తుతే!! ► ఉద్యోగ ప్రాప్తికిహనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!! ►కార్య సాధనకు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద! రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!! ►ఆరోగ్యానికి ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా! ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!! ►సంతాన ప్రాప్తికి పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్! సంతానం కురుమే దేవ రామదూత నమోస్తుతే!! ►వ్యాపారాభివృద్ధికి సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్! అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!! ►వివాహ ప్రాప్తికి యోగి ధ్యే యాంఘ్రి పద్మాయ జగతాం పతయేనమః! వివాహం కురుమేదేవ రామదూత నమోస్తుతే!! ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు. -
నిజాం రాజులా వ్యవహరిస్తున్న కేసీఆర్
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజాం రాజు లక్షణాలను పుణికి పుచ్చుకున్నారని, ఆయన నియంతృత్వ పోకడలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్సీ, టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు చెరిపల్లి సీతారాములు మండిపడ్డారు. సోమవారం ఖమ్మంలోని మంచికంటి భవన్లో తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు తెలంగాణలో చరిత్రాత్మకమైన ఉద్యమం జరిగిందని, ఆ ఉద్యమంలో 4 వేల మంది అమరులయ్యారన్నారు. ఆ ఉద్యమానికి కారణం నిజాం రాజు అని, నిజాం రాచరిక పాలనను వ్యతిరేకిస్తూ సాగించిన పోరు ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని వివరించారు. రాష్ట్రంలో పోలీసులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని, సీఎం కేసీఆర్‌కు నిజాం రాజు ఆదర్శమైతే, రాష్ట్రంలోని పోలీసులకు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ఆదర్శమని విమర్శించారు. తెలంగాణలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛలేదని, ఎవరికి స్వతహాగా మాట్లాడే హక్కులేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఖమ్మంలో పోలీసులు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని, అత్యుత్సామంతోనే కంచె ఐలయ్యను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతులై ఓటు ద్వారా సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నందున కేసీఆర్‌కు ఇప్పుడు బీసీలు గుర్తుకువస్తున్నారని, ముడున్నరేళ్ల పాలనలో బీసీలకు కేటాయించిన బడ్జెట్ ఒకటైతే అమలు జరిగింది మరొకటని ఎద్దేవా చేశారు. సమావేశంలో టీజీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యు.రవీందర్, కె.నాగరాజు, కె.గోపాల్, శరబంది తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యా.. లడ్డూ దక్కదేమయ్యా..!
భద్రాచలం : గోదావరి పుష్కర స్నానం చేసేందుకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వచ్చిన భక్తులకు రాముడి ప్రసాదం కరువైంది. రాములోరి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదాల కోసం ఆలయం చుట్టూ తిరిగినా విక్రయశాలలు కన్పించడం లేదు. తానీషా కల్యాణ మండపం వద్ద ఒకే ఒక్క కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మంగళవారం లడ్డూల కోసం తోపులాట జరిగింది. పుష్కరాల 12 రోజుల్లో భద్రాచలాన్ని 50లక్షల మంది భక్తులు సందర్శిస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ భక్తులు పోగవుతున్నారనే కారణంతో పోలీసుల ఒత్తిడితో ఎనిమిది లడ్డూ కౌంటర్లను ఎత్తేశారు. ఆర్జిత సేవలు నిలిపివే యడం, లడ్డూలు అమ్ముకోనివ్వకపోవడంతో ఆదాయం బాగా తగ్గుతోంది. -
రామయ్యా.. నీ దర్శన భాగ్యమేది..
భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరాలకు ఖమ్మం జిల్లా భద్రాచలానికి భక్త జనం పోటెత్తుతున్నారు. పుష్కర స్నానం అనంతరం శ్రీసీతారాముల వారి దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కానీ ఆలయ అధికారులు, పోలీసులు పెడుతున్న ఆంక్షలతో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగడం లేదు. ఆర్జిత సేవల కోసం ఆన్లైన్లో టెక్కెట్లు తీసుకున్న భక్తులకు నిరాశే ఎదురవుతోంది. పుష్కరాల్లో మొదటి మూడు రోజలు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినప్పటికీ శనివారం నుంచి సీన్ రివర్స్ అయ్యింది. పుష్కర స్నానం అనంతరం స్వామివారిని దర్శించుకోకుండానే భక్తులు వెనుదిరుగుతున్నారు. కాగా శనివారం నుంచి టిక్కెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కల్యాణోత్సవం మినహా, భక్తుల పేరిట ఆర్జిత సేవలన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా దేవస్థానానికి ఆదాయం బాగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని దేవస్థానం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటకీ, గోదావరి పుష్కరాలు పూర్తయ్యేంత వరకూ టిక్కెట్ల విక్రయాలు చేపట్టడానికి వీల్లేదని తెగేసి చెబుతున్నారు. -
నవ తెలంగాణ వికాసానికి సిద్ధం
నకిరేకల్, న్యూస్‌లైన్ : నవ తెలంగాణ వికాసానికి సీపీఎం కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణంలో సోమవారం జరిగిన ఆ పార్టీ డివి జన్ కమిటీ సమావేశంలో ఆయ న మాట్లాడారు. నవ తెలంగాణ వికాసంలో సీపీఎం స్పష్టమైన ఎజెండాతో ముం దుకు సాగుతుందన్నారు. సామాజిక న్యాయంతో కొందరికి పదవులు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరగదన్నారు. వృత్తిదారులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతికి కృషి చే సినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటర్లను అనేక ప్రలోభాలకు గురితీసిందని ఆరోపించా రు. కాంగ్రెస్‌తో పాటు టీఆర్ ఎస్, బీజేపీలు సైతం విచ్చలవిడిగా మద్యం పారించి రాజకీయాలను కలుషితం చేశాయన్నారు. సీపీఎం నైతిక విలువల కోసం పోరాడుతుందన్నారు. ఆ పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు బోళ్ల నర్సిం హారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి ఎండీ జహంగీర్, నాయకు లు మేక అశోక్‌రెడ్డి, మామిడి సర్వయ్య, కందాల ప్రమీల, వంటెపాక వెంకటేశ్వర్లు, జీరాల పెం టయ్య, గాదగోని కొండయ్య, బొజ్జ చిన్నవెం కులు, అచ్చాలు, గడుసు వెంకట్‌రెడ్డి, నంద్యాల వెంకట్‌రెడ్డి, మర్రి వెంకటయ్య, చెరుకు పెద్దులు తదితరులు ఉన్నారు.