breaking news
singer ramakrishna
-
నేనంటే సింగర్ బాలు గారికి చాలా భయం... ఎందుకంటే..?
-
సినిమా అంటే నాకు చాలా ఇష్టం కానీ.. నన్ను దూరం చేశారు
-
అతనితో ఎవరు పోటీ పడలేరు : సింగర్ రామకృష్ణ
-
నాకు అంత అదృష్టం లేదు...!
-
నాకు అవకాశాలు రాకుండా చేశారు.. |
-
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు..
ప్రకృతిలో అన్నీ మహా ప్రవాహాలే ఉండవు. మేరు పర్వతాలే ఉండవు. ఘన కీకారణ్యాలే ఉండవు. ఒక ఝరి కూడా ఉంటుంది. కొంతమందికి అది సౌందర్యాన్ని పంచుతూ ముందుకు వెళ్లిపోతుంది. ఒక పూలు నిండిన మట్టి కొండ ఉంటుంది. అది పరిమళాలు చింది గుర్తుండిపోతుంది. ఒక లేలేత కొమ్మల వనం ఉంటుంది. అది కొన్ని పాటలు పాడి పరవశింప చేస్తుంది. రామకృష్ణ ఝరి. మట్టికొండ. ఆకుపచ్చ వనం. ఆయన పాట మన జీవితాలలో ఒక నిరాడంబరమైన సున్నితమైన స్పర్శను ఇచ్చి వెళ్లింది. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లికూతురు రామకృష్ణ పాడితే ఘంటసాల పాడినట్టు ఉంటుంది. రామకృష్ణ పాడితే రామకృష్ణ పాడినట్టు కూడా ఉంటుంది. పోలిక ఉంది నిజమే కాని పాడే పద్ధతి వేరు. రామకృష్ణ పాటలో ఒక తొలకరి గుణం ఉంటుంది. అప్పుడే మీసకట్టు వచ్చిన ఒక కుర్రాడి ఉత్సాహం ఉంటుంది. చెంగునదూకే లేగదూడ గంతు ఉంటుంది. వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట... వి.రామకృష్ణ సౌందర్యవంతుడు. నిలువెత్తు అందగాడు. ఆయన మాట, పలుకు కూడా అంతే అందంగా ఉంటుంది. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కాలేజీలో మైక్ ముందు రామకృష్ణ పాడితేనే కార్యక్రమం మొదలయ్యేది. మరి పాట ఎలా వచ్చు? గాయని సుశీల ఆయన పినతల్లి. విజయనగరంలో బాల్యంలో ఇంట్లో సంగీత వాతావరణం ఉండేది. చెవిన వొరుసుకుని వెళ్లే స్వరాలు కంఠంలోకి వచ్చి చేరాయి. గొంతు విప్పితే ఎదుటివాళ్లకి ఒక ఆకర్షణ కలిగేది. ఆ ఆకర్షణే ఆయనకు అవకాశం వెతుక్కుంటూ తెచ్చింది. నా పక్కన చోటున్నది ఒక్కరికి ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే... ఏదో డాక్యుమెంటరీ కోసం సినిమా వాళ్లను ఎఫర్డ్ చేయలేరు కాబట్టి కాలేజీ కుర్రవాడైన రామకృష్ణ చేత పాడించారు. సారథి స్టూడియోలో ఆ పాట విన్న అక్కినేని ఆశ్చర్యపోయారు. ఇదేమిటి.. అచ్చు ఘంటసాల లాగే ఉంది అని. నిజానికి సినిమా సంగీత ప్రపంచం అప్పుడు కొత్త గాయకుడి అన్వేషణలో ఉంది. అప్పటికే ఘంటసాల గారి ఆరోగ్యం నెమ్మదించడం వల్ల ఎక్కువ పాటలు పాడలేకపోతున్నారు. కొత్త గాయకుడు అవసరం. అలవాటైన ఘంటసాల ధోరణిలోనే పాడే రామకృష్ణ ఒక మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అక్కినేని పిలిచి ‘విచిత్ర కుటుంబం’ (1972)లో రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాటలు హిట్. అదే సమయంలో దాసరి తొలి సినిమా ‘తాతా మనవడు’ (1972) కూడా సిద్ధమవుతూ ఉంది. చిన్న సినిమా కాబట్టి బడ్జెట్‌కు తగినట్టుగా కొత్త సింగర్ రామకృష్ణకు అవకాశం వచ్చింది. సి. నారాయణరెడ్డి రాసిన పాట రామకృష్ణ గొంతులో గొప్ప వైరాగ్యాన్ని పలికింది. అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం ఈ పాటలు పాడాక రామకృష్ణ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. అయితే తతిమా జీవితకాల భోజనం ఆయనకు చెన్నైలో రాసి పెట్టి ఉంటే ఆపేదెవరు. రామకృష్ణ పాడిన పాటలు శోభన్‌బాబు చెవిన పడ్డాయి. నాకు ఈ గాయకుడే పాడాలి పిలిపించండి అన్నారు. కె.విశ్వనాథ్ ‘శారద’ సినిమా కోసం రామకృష్ణ మళ్లీ చెన్నై రైలు ఎక్కారు. దాదాపు 30 సంవత్సరాలు గాయకుడిగా అక్కడే ఉండిపోయారు. ‘శారద’ పాట అలా రామకృష్ణను నిలబెట్టింది. శారద నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా ఓ శారదా నీరదా శారదా... ఘంటసాల స్థానంలో ఆ వెలితి తీర్చే గాయకుడు వచ్చాడని అందరికీ అర్థమైపోయింది. అక్కినేని, కృష్ణంరాజు, శోభన్‌బాబు... వీరందరికీ రామకృష్ణ ముఖ్యగాయకుడుగా నిలిచారు. అక్కినేనికి ‘భక్త తుకారాం’లో పాడిన ‘శ్యామసుందర ప్రేమమందిర’, ‘పాండురంగ నామం’ పాటలు ఊళ్లల్లో గుళ్ల దగ్గర మోగడం మొదలెట్టాయి. ‘అందాలరాముడు’లోని ‘ఎదగడానికెందుకురా తొందర’ పాట రేడియోలో పదేపదే వినిపించసాగింది. ‘పల్లెటూరి బావ’లోని ‘ఒసే వయ్యారి రంగి’ రిక్షా లాగేవాళ్ల ఫేవరెట్. ‘మహాకవి క్షేత్రయ్య’లో ‘జాబిల్లి చూసింది నిన్ను నన్ను’ రొమాంటిక్ హిట్. ఇటు ఈ పాటలు ఉంటే శోభన్‌బాబుకు వరుస హిట్స్ పడ్డాయి. ‘జీవితం’లో ‘ఇక్కడే కలుసుకున్నాము’, ‘ఇదాలోకం’లో ‘నీ మనసు నా మనసు ఏకమై’, ‘చక్రవాకం’లో ‘ఈ నదిలా నా హృదయం ఉరకలు వేస్తోంది’... ఇక వీటన్నింటికీ మకుటంగా ‘కన్నవారి కలలు’ సినిమాలో శోభన్‌బాబుకు రామకృష్ణ పాడిన ప్రతి పాటా హిట్టే. మధువొలకబోసే నీ చిలిపి కళ్లు అవి నాకు వేసే బంగారు సంకెళ్లు కృష్ణంరాజుకు రామకృష్ణ విలువైన పాటలు పాడారు. ‘కృష్ణవేణి’లో ‘కృష్ణవేణి తెలుగింటి విరబోణి’, ‘అమర దీపం’లో ‘నా జీవన సంధ్యాసమయంలో’, ‘భక్త కన్నప్ప’లో ‘ఆకాశం దించాలా’, ‘శివశివ శంకర’, ‘ఎన్నియలో ఎన్నియలో చందామామా’.... ఇవన్నీ శ్రోతలకు ప్రీతికరమైన పాటలయ్యాయి. కృష్ణకు రామకృష్ణ దాదాపుగా పాడలేదు కాని ‘అల్లూరి సీతారామరాజు’లో రామకృష్ణ కీలకపాత్ర పోషించారు. ఆ సినిమాలోని ‘తెలుగువీర లేవరా’ పాటను ఘంటసాల పాడారు. అయితే కొన్ని చరణాలు అనారోగ్య కారణాల రీత్యా పాడలేదు. ఆయనే రామకృష్ణ చేత పాడించుకోండి అని చెప్పారు. రామకృష్ణ పాడిన ఆ చరణాలు పాటలో అందంగా కలిసిపోయాయి. ఇప్పటికీ చాలామంది ఆ పాటను ఘంటసాల ఒక్కరే పాడారనుకుంటారు. 1980ల నాటికి తెలుగునాట బాలసుబ్రహ్మణ్యం ప్రభంజనం మొదలైపోయింది. కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడటానికే రామకృష్ణ పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఘంటసాల తర్వాత తెలుగు పద్యం రామకృష్ణ బాగా పాడతారనే పేరు తెచ్చుకున్నారు. ‘దానవీర శూరకర్ణ’లో పద్యాల కోసం అనేక మందిని ఎన్.టి.ఆర్ ప్రయత్నించి రామకృష్ణే ది బెస్ట్ అని నిర్ణయించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మంగారి చరిత్ర’లో ఎన్.టి.ఆర్కు అన్ని పాటలు రామకృష్ణే పాడారు. వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లుపోదురా కాలజ్ఞానం కల్ల కాదురా... రామకృష్ణ సినిమాలలో కనిపించకపోయినా వేలాది కచ్చేరీల ద్వారా శ్రోతలకు చేరువయ్యారు. దేశ విదేశాలలో ఆయన అసంఖ్యాక కచ్చేరీలు చేశారు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక కూడా పాటను కొనసాగిస్తూనే వచ్చారు. ప్రకృతి ఎప్పుడూ ఏకరూపం కాదు. బహువిధమైన ఆస్వాదన ఉండాలి అనిపించినప్పుడు రామకృష్ణ పాట ఒక భిన్నమైన ఆస్వాదనను ఇస్తుంది. ఆయన పాట ఒకనాటితో మర్చిపోయేది కాదు. ఒకనాటి మాట కాదు... ఒకనాడు తీరిపోదు – సాక్షి ఫ్యామిలీ -
ఘంటసాల తర్వాత మా ఫాదర్ వాయిసే...
హైదరాబాద్ : నాన్నగారు లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ప్రముఖ గాయకుడు రామకృష్ణ కుమారుడు, నటుడు సాయికిరణ్ కన్నీటిపర్యంతమయ్యారు. క్యాన్సర్‌తో రామకృష్ణ గతరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ..'నాన్నగారి భక్తి పాటలు వింటే టెన్షన్ నుంచి రిలీవ్ అయ్యేవాళ్లమని కొన్నివేలమంది చెప్పారు. భక్తిపాటలు పాడటంలో ఘంటసాల గారి తర్వాత మా ఫాదర్ వాయిసే బాగా సూట్ అవుతుందని చాలామంది అనేవాళ్లని, నాన్నకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉన్నందున మేం ఏమీ చేయలేకపోయాం. పది నెలలుగా ఆయన చాలా బాధపడ్డారు. ట్రీట్మెంట్ విషయంలో ఒమెగా ఆస్పత్రి వైద్యులు కూడా చాలా సహకరించారు. అయినా ఫలితం లేకపోయింది. నాన్న తరపున నేను చెప్పేదొకటే. మా ఫ్యామిలీకి చిత్ర పరిశ్రమలో మంచి స్థానం ఇచ్చారు. చరిత్రలో నాన్నకు మంచి గాయకుడిగా, నాకు నటుడిగా అవకాశం ఇచ్చింది. మా కుటుంబం తరపున సినీ పరిశ్రమకు ధన్యవాదాలు' అని సాయికిరణ్ తెలిపారు. -
ఏమిటో ఇద్దరు కూడబలుక్కుని వెళ్లిపోయారు
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు రామకృష్ణ లేరనే వార్త జీర్ణించుకోలేనిదని ప్రముఖ గాయని సునీత అన్నారు. 'గొప్ప సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాధన్, గొప్ప గాయకుడు రామకృష్ణను వెనువెంటనే కోల్పోవడం బాధాకరం. ఏమిటో ఇద్దరు కూడబలుక్కుని వెళ్లిపోయారు. ఇద్దరు క్యాన్సర్‌తో సఫర్ అయ్యారు. నేను రామకృష్ణ గారిని చూసి ఏడాది అయింది. అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్నా ఆయన ఈ విషయాన్ని ఎక్కడా బయటకు రానివ్వలేదు. ఎవర్ని కలవడానికి కూడా ఇష్టపడలేదు. నేను క్యాన్సర్‌ను జయించి బయటకు వచ్చి మాత్రమే అందరితో మాట్లాడతాను అన్న వ్యక్తి ..అదే ట్రీట్మెంట్లో అందర్ని వదిలి వెళ్లిపోయారు. నిజంగా ఇది చాలా షాకింగ్‌గా ఉంది. భౌతికంగా రామకృష్ణగారు మన మధ్య లేకపోయినా..ఆయన పాటలు మన మధ్యనే చిరస్థాయిగా ఉంటాయి. మేమందరం ఆయన పాటలను బోయిలుగా మోస్తాం. ఆయన ఏడాదిగా క్యాన్సర్ ట్రీట్మెంట్తో నరకం అనుభవిస్తే...రామకృష్ణగారి కుటుంబసభ్యులు నరకాన్ని చూశారు. తలచుకుంటేనే బాధగా ఉంది. రామకృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని సునీత అన్నారు. -
రామకృష్ణకు ప్రముఖుల నివాళి
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు రామకృష్ణ అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో జరగనున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, సంగీత ప్రియులు, గాయనీ, గాయకులు విచారం వ్యక్తం చేశారు. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అంజలి ఘటించారు. గాయని ఎస్పీ శైలజ, గాయని సునీత, గాయకుడు, సంగీత దర్శకుడు కుంచె రఘు తదితరులు ...రామకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామకృష్ణ స్మృతులను స్మరించుకుని, ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థించారు. -
రామకృష్ణ మృతిపట్ల వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు రామకృష్ణ మృతిపట్ల ఆయన కుటుంబసభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ గతరాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు హరికృష్ణ కూడా రామకృష్ణ మృతిపట్ల సంతాపం తెలిపారు. -
గాయకుడు రామకృష్ణ కన్నుమూత