ఊరేగిన వెండి వినాయకుడు
గుంతకల్లు : దేశంలోనే అతి పెద్దదైన, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన వెండి వినాయకుణ్ని మంగళ వాయిద్యాల మధ్య, భక్తి శ్రద్ధలతో గుంతకల్లు పట్టణంలో ఆదివారం ఘనంగా ఊరేగించారు. 21 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం 115 కిలోల వెండి వినాయకుడికి విగ్రహ దాత పువ్వాడి ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రోచ్చారణల మధ్య పల్లకీపై కూర్చోబెట్టారు. వందలాది మంది మహిళలు హారతులు ఇస్తూ ముందుకు సాగుతుండగా సుందరంగా అలంకరించిన పల్లకీపై వెండి వినాయకుడిని కూర్చోబెట్టి కోదండరామస్వామి దేవాలయం వీధి మీదుగా ఊరేగింపు ప్రారంభించారు.
గాంధీచౌక్, ఎన్టీఆర్ సర్కిల్, మెయిన్బజార్ మీదుగా వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం చేరుకుంది. దేవాలయం ప్రాంగణంలో ఆలయ అర్చకులు, వేదపండితులు కలిసి వెండి గణపతి విగ్రహానికి వేద మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట జరిపి పంచగంగతో అభిషేకం చేశారు. వినాయక ఉత్సవ సేవా సమితి గౌరవాధ్యక్షుడు వంకదారు రామకష్ణయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాజగదీష్, అవోపా పట్టణ అధ్యక్షుడు చెల్లూరి నరసింహులు, అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఆదినారాయణ, పువ్వాడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.