breaking news
Silk Route
-
అది ప్రపంచ వాణిజ్యానికి అడ్డా
న్యూఢిల్లీ: భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ ఆర్థిక నడవా(కారిడార్) రాబోయే కొన్ని శతాబ్దాలపాటు ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన ఆధారం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కారిడార్ ఆలోచన భారత్ గడ్డపైనే పుట్టిందన్న విషయాన్ని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆదివారం 105వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ప్రాచీన కాలంలో వాణిజ్య మార్గంగా ఉపయోగపడిన సిల్క్ రూట్ గురించి ప్రస్తావించారు. ఈ మార్గం ద్వారా భారత్ విదేశాలతో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు. ఇటీవల జీ20 శిఖరాగ్ర సదస్సులో ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను భారత్ ప్రతిపాదించిందని గుర్తుచేశారు. ఈ కారిడార్‌తో శతాబ్దాల పాటు భారీ స్థాయిలో ప్రపంచ వాణిజ్యం జరుగుతుందని వెల్లడించారు. ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన ‘భారత్ మండపం’ ఒక సెలబ్రిటీగా మారింది. జీ20లో భాగంగా ఈ నెల 26న ఢిల్లీలో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించబోతున్నామన్నారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు భారీ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఖాదీ, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నానన్నారు. హైదరాబాద్ బాలిక ఆకర్షణ కృషి ప్రశంసనీయం హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల ఆకర్షణ సతీష్ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకర్షణ సతీష్ ఏడో తరగతి చదువుతోందని, నిరుపేద విద్యార్థుల కోసం ఏడు గ్రంథాలయాలు నడుపుతోందని ప్రశంసించారు. ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలు సేకరించి, లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. ఏడు లైబ్రరీల్లో దాదాపు 6,000 పుస్తకాలు అంబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఆకర్షణ సతీష్ కొనసాగిస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిని ఇస్తోందని ప్రధానమంత్రి కొనియాడారు. -
సిల్క్ రూట్లో సాహసి
సాక్షి, సిటీబ్యూరో: మూడు దేశాలు... పదిహేనువేల కిలోమీటర్లు... యాభై ఐదు రోజుల సుదీర్ఘమైన ప్రయాణం. ఆ దేశాల భాషతో పెద్దగా పరిచయం లేదు. తెలిసిన బంధువులు, స్నేహితులు లేరు. జ్ఞానీ లోక సంచారి అన్నట్లు... అరవై రెండేళ్ల వయస్సులో ఒంటరిగా సాహసోపేతమైన యాత్ర పూర్తి చేశారు పరవస్తు లోకేశ్వర్. ‘సలామ్ హైదరాబాద్’ నవల, చత్తీస్‌గఢ్ స్కూటర్ యాత్ర ద్వారా సుపరిచితులైన పరవస్తు లోకేశ్వర్ తన 62 ఏళ్ల వయస్సులో ఉజ్బెకిస్తాన్, కిరిగిస్తాన్, చైనా దేశాల ను కలిపి 15 వేల కిలోమీటర్ల సిల్క్రోడ్డుపై సాహస యాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఆ పర్యటన అనుభవాలపై ఆయన రాసిన ‘సిల్క్ రూట్లో సాహసయాత్ర’ పుస్తకం మంగళవారం ఆవిష్కరించనున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి 55 రోజుల పాటు సాగిన పర్యటన విశేషాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ సంగతులు ఆయన మాటల్లోనే... రాహుల్ స్ఫూర్తి... ఎంతోమంది యాత్రికులు ప్రపంచదేశాల్లో పర్యటించారు. వారి అనుభవాలను గ్రంధస్తం చేశారు. ఆ అనుభవాలే నాగరికతా పరిణామాన్ని, వికాసాన్ని అధ్యయనం చేసేందుకు, అర్థం చేసుకొనేందుకు దోహదం చేశాయి. చిన్నప్పటి నుంచి రాహుల్ సాంకత్యాయన్ అంటే ఎంతో ఇష్టం. ఆయనలాగా పర్యటించాలని కోరిక. తిరగడం వల్లనే జ్ఞానం లభిస్తుందని నా విశ్వాసం. గతంలో 3 వేల కిలోమీటర్ల చత్తీస్‌గఢ్ యాత్రను 15 రోజుల్లో పూర్తి చేశా. బస్తర్‌లో పర్యటించా. అలాగే ప్రపంచానికి వైభవోపేతమైన నాగరికతను పరిచయం చేసిన మధ్య ఆసియా దేశాల్లో పర్యటించాలనే కోరిక కలిగింది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో చైనా నుంచి రోమ్కు సిల్క్‌తో పాటు, పింగాణి, పేపర్, మందుగుండు వంటి వస్తువులను ఎగుమతి చేసిన రోడ్డు మార్గానికి సిల్క్‌రూట్ అనే పేరు స్థిరపడింది. ఆ రూట్లో ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, చైనాల్లో పర్యటించా. గతేడాది సెప్టెంబర్ 1న ఢిల్లీ నుంచి బయలుదేరి 2న తాష్కెంట్ చేరుకున్నా. అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గంలో 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించిన అనంతరం భుకారా, సమర్ఖండ్ మీదుగా కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ వెళ్లా. అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకొని 25 రోజులు బస చేశా. మధ్య ఆసియాలోని స్విట్జర్లాండ్‌గా పేరు గడించిన కిర్గిస్తాన్ ఎంతో అందమైన దేశం. లాంగ్‌మార్చ్ జ్ఞాపకాలు... కిర్గిస్తాన్ నుంచి చైనాకు రోడ్డు మార్గం ద్వారా రావచ్చు. కానీ సరిహద్దులో చైనా సైన్యం నన్ను అడ్డుకుంది. నన్ను గూఢచారిగా అనుమానించి అనుమతి నిరాకరించారు. దాంతో విమానంలో బీజింగ్ చేరుకున్నా. భారత్‌లాగే 4 వేల ఏళ్లకు పైగా గొప్ప చరిత్ర ఉన్న చైనాపై అధ్యయనం ఎంతో సంతృప్తినిచ్చింది. ఎనాన్లోని మావో జెడాంగ్, ఆయన సహచరుల స్థావరాలు, వారు వినియోగించిన వస్తువులు, టేబుళ్లు, కుర్చీలు,పుస్తకాలు, వంటపాత్రలు, విప్లవకారుల నిరాడంబరమైన జీవిత విధానాన్ని ప్రతింబింబించే అనేక అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. లాంగ్‌మార్చ్ విశేషాలను చెప్పే రెవల్యూషనరీ మ్యూజియంను సందర్శించా. ప్రాచీన బౌద్ధమత క్షేత్రాలు, మైనార్టీ తెగలు నివసించే కుచె, ఉరిమించి, షియాన్, కోటాన్, యార్ఖండ్, లీషాన్ వంటి ప్రాంతాలు పర్యటించాను.