breaking news
sikhamani
-
సాహితీవేత్త శిఖామణికి కళారత్నపురస్కారం
► ఉగాది సందర్భంగా ప్రకటించిన ఎపీ ప్రభుత్వం యానాం: యానాంకు చెందిన సుప్రసిద్ద కవి, సాహితీవేత్త, కవిసంధ్య సంపాదకులు, పొట్టిశ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ శిఖామణి కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీహేవళంబినామ ఉగాదిని పురస్కరించుకుని ప్రతిష్టాత్మక కళారత్న పురస్కారానికి శిఖామణిని ఎంపిక చేసింది. ఈమేరకు సాంస్కృతికశాఖ సంచాలకులు నుంచి వర్తమానం అందినట్లు మంగళవారం ఆయన విలేకరులకు తెలిపారు. -
ఆటోను ఢీకొన్న లారీ..ఇద్దరి మృతి
అమరావతి మండలం పెద్దమద్దూరు వద్ద లారీ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన కె.శిఖామణి(50), మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన గాదె సామ్రాజ్యం(60) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.బాధితులంతా అమరావతి నుంచి మంగళగిరికి ఆటోలో వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రావ్యంగా సొంత గొంతు!
పుస్తక పరిచయం రెండు పీహెచ్డీ పట్టాలు పుచ్చుకుని, తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక పరిశోధన విభాగం అధిపతిగా ఉన్న ఆచార్య కర్రి సంజీవరావును తెలిసినవాళ్లు కొన్ని వందల్లో ఉంటారేమో. కానీ, దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రగాఢమైన, అనుభూతి ప్రధానమైన కవిత్వం రాస్తూ, సొంత గొంతులో దళితానుభూతిని ఆవిష్కరిస్తూ, అప్పుడప్పుడు సాహితీమూర్తులకు శ్రద్ధాంజలి సమర్పించుకుంటూ వస్తున్న శిఖామణిని ఎరిగినవాళ్లు అనేక వేలల్లో ఉంటారు. ఈ మధ్యనే శిఖామణి మూడు పుస్తకాలు అచ్చేసి, విడుదల చేశాడు. వాటిల్లో ఒకటి 2013-15 మధ్యకాలంలో అచ్చయిన కవితల సంకలనం (పొద్దున్నే కవి గొంతు). మరొకటి, పీహెచ్డీ కోసం హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి తను సమర్పించిన పరిశోధన పత్రం (తెలుగు మరాఠి దళిత కవిత్వం). వేరొకటి ముప్పయి నాలుగు మంది సాహిత్య జీవులకు ఘటించిన నివాళి (స్మరణిక). వీటిల్లో చివరి పుస్తకాన్ని తన ‘పంచమాతృకల స్మృతికి’, ‘తెలుగు మరాఠి దళిత కవిత్వం’ కలేకూరి ప్రసాద్ (యువక) స్మృతికి అంకితమివ్వడం బావుంది. ఎన్ని రచనా రూపాల్లో తన ఉనికిని చాటుకున్నప్పటికీ, శిఖామణి ప్రాయికంగా కవి. అతని కవితా సంకలనాన్ని సాకల్యంగా పరిశీలిస్తే, శిఖామణి సాహితీ మూర్తిమత్వం ఆవిష్కృతమవుతుంది. అంతెందుకు -‘పొద్దున్నే కవిగొంతు’ పుస్తకంలోని ‘పులస స్వగతం’ కవిత చదివితే చాలు - అతని కవితాత్మ అర్థమైపోతుంది. (నా దగ్గిర ఇలాంటి మోక్షదాయికమైన సూక్ష్మాలు డజన్లకొద్దీ ఉన్నాయి. అవసరమైనవాళ్లు ఎప్పుడైనా సంప్రదించవచ్చు). కవి ఈ కవితా సంకలనాన్ని తన ‘గురువుగారు’ ఇస్మాయిల్‌కి అర్పించుకున్నాడు. తత్తుల్యుడైన కె.శివారెడ్డి గురించి రాసిన కవిత పేరే ఈ సంకలనానికి పెట్టుకుని తన ప్రపత్తి చాటుకున్నాడు. ఇస్మాయిల్ నుంచి శివారెడ్డి వరకూ విస్తరించిన సువిశాల కవితాత్మ శిఖామణిది. తర్వాత తర్వాత అది దళిత కవిత్వం వరకూ సాగింది, అది వేరే విషయం. తన రచనా సంవిధానం గురించి కవిగారు ఈ సంకలనంలో ఓ కవిత రాశాడు (వాక్యం పలకాలి). శిఖామణి రాసే పద్ధతిని నరేటివ్ రీతి అనొచ్చునేమో. ఇది కవిత్వం కట్టినట్లు ఉండదు. కథ చెప్పినట్లు ఉంటుంది. ఈ సంకలనంలోని తొట్టతొలి కవిత ‘మురమళ్ల రేవు’ దీనికి నిదర్శనంగా ఉంది. జానపద, పౌరాణిక రచనల్లో ఎక్కువ భాగం ఈ రీతిలో రాసినవే. మన భావుకవుల్లోనూ చాలామంది ఈ పద్ధతిలో రాశారు. శ్రీశ్రీ రాసిన ‘భిక్షు వర్షీయసి’, ‘బాటసారి’ లాంటివి కూడా ఇదే కోవకి చెందుతాయి. ఇక కుందుర్తి కథా కావ్యాలు రాయగా, శీలా వీర్రాజు ఏకంగా నవలా కావ్యమే(!) రాశారు. అయితే, శిఖామణి కవితలకీ ఇక్కడ చెప్పుకున్నవాటికీ రూపం వరకే పోలిక. సారం విషయానికొస్తే ఇతగాడు సమకాలీనుడు. ఈ సంకలనంలోని చిట్టచివరి కవిత ‘భీమ్ పాటే పాడతాను’ ఇందుకు రుజువు. ముప్పయ్యేళ్లలో పది కవితా సంకలనాలు విడుదల చేసిన శిఖామణి అదే ఉత్సాహం ఇక ముందు కూడా ప్రదర్శిస్తాడని ఆశ. ఒక చిన్నమాట - ఈ మూడు పుస్తకాల్లోనూ అడుగడుగునా అచ్చుపుచ్చులు వేధిస్తున్నాయి. ఆచార్యులవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. - మందలపర్తి కిషోర్ 8179691822 -
సమరసింహం కన్నమరాజా
దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలన కెరటమై ఎగిసి దళిత బహుజనుల నాయకుడిగా పేరొం దిన శెట్టి కన్నమరాజా 1939 డిసెంబర్ 12న నెల్లూరులో జన్మిం చారు. తల్లి శెట్టి రత్నమ్మ. తండ్రి శెట్టి వీరయ్య. కన్నమదాసు అసలు పేరు డేవిడ్ రాజు. మాలల మూలపురుషుడు కన్నమదాసు ప్రేర ణగా తీసుకుని పేరు మార్చుకున్నారు. బీఏ వరకు చదివారు. బీఆర్ అంబేద్కర్ స్థాపించిన భారత రిపబ్లికన్ పార్టీలో చేరి సామాన్య కార్యకర్త నుండి గుంటూరు శాఖ అధ్యక్షు డిగా ఎదిగారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి మొన్న కన్ను మూసిన కాకా జి.వెంకటస్వామి ఆత్మీయ అనుచరు లుగా కొనసాగారు. కారంచేడు దళితుల ఊచకోత ఘటనపై మొదటగా స్పందించి ఘటనా స్థలానికి వెళ్లి గొంతు కలి పాడు. అనేక కాలనీలను స్వయంగా నిర్మించి ఇచ్చారు. దళితుల కోసం ‘పీడితజన’, ‘సాధించు’ వంటి పత్రికలను స్థాపించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సాంఘిక సంస్కర్తగా, రాజకీయ నేతగా, కళాకారుడిగా, పాత్రికేయుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రద ర్శించిన కన్నమరాజా 2007 డిసెంబర్ 24న కన్నుమూశారు. (నేడు శెట్టి కన్నమరాజా ఏడవ వర్థంతి) శిఖామణి, హైదరాబాద్ -
ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోనూ...
నవంబర్ 25 ఇస్మాయిల్ 11వ వర్థంతి ఇస్మాయిల్ గారి కంటే ముందు ఆయన కవిత్వం పరిచయం. ఎలాగంటే ఇంటర్లో నా మిత్రుడు ముస్తఫాకి ఇస్మాయిల్‌గారి కుటుంబంతో ఏదో దూరపు చుట్టరికం వుంది. అప్పుడప్పుడే నేను కవిత్వం కాకరకాయలు రాయడం చూసి ముస్తాఫా ఒకరోజు ఇస్మాయిల్ గారి ‘మృత్యువృక్షం’ కవితా సంపుటిని తెచ్చి ఇచ్చాడు. నిజంగా ఆ పుస్తకం ఎంత అందంగా వుందో! పాండిచ్చేరి అరవిందాశ్రమంలో తయారైన ఊదారంగు హ్యాండ్ మేడ్ పేపర్‌పై శీలా వీర్రాజుగారి అక్షరాలంకరణ చూడగానే ఎంతో అపురూపం అనిపించింది. చదివితే ఏం అర్థం అయిందో తెలియదుగానీ అలా ఇస్మాయిల్ గారి కవిత్వ ప్రపంచంలోకి ప్రవేశం దొరికింది. ఆ తర్వాత ఆ ఉత్సాహంతో ముస్తఫాతో కలిసి కాకినాడ వెళ్లి ఇస్మాయిల్ గారిని కలిశాను. నాది మాట్లాడే వయసు కాదు. ఆయనది మాట్లాడే స్వభావం కాదు. ప్రథమ దర్శనంలో బ్లాక్ రోజ్‌వుడ్ కుర్చీపైన ఆయన కూర్చున్న ముద్ర గుర్తు. అక్కడే చిద్విలాసంగా నవ్వుతున్న కృష్ణశాస్త్రి ఫొటో, ఎదురుగా రెక్కల కింద పిల్లలను దాచుకున్న పిల్లల కోడిలా టీపాయ్! ఆ తర్వాత నేను కాకినాడలో స్పెషల్ తెలుగు బి.ఎ.లో చేరినపుడు అక్కడ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఇస్మాయిల్గారు, దానికి కొంచెం అటుఇటుగా హిందీ విభాగంలో అన్నపురెడ్డిగారు, సంస్కృత విభాగంలో పేరాల భారత శర్మగారు, ఎప్పుడైనా సాయంకాలాలు ఇస్మాయిల్‌గారి ఇంటికి వెళ్తే మేకా సుధాకరరావు, రావుగారు, రవూఫ్, విన్నకోట రవిశంకర్ అక్కడే తారసపడేవారు. బి.ఎ. మూడు సంవత్సరాలు గొప్ప సాహిత్య సంరంభంతో గడిచిపోయాయి. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎం.ఎ చదువుతుండగా యానాం వచ్చేప్పుడు విశాఖ వెళ్లేటప్పుడు ఇస్మాయిల్‌గారిని కలిసి వెళ్లేవాణ్ణి. మధ్యలో ఉత్తరాలు కూడా నడిచేవి. ఎం.ఎ అయ్యాక నా తొలి పుస్తకం వేద్దాం అంటే అత్తలూరి మాస్టారు ఒక సంవత్సరం ఆగమన్నారు. 1987లో పుస్తకం వేద్దామని ఇస్మాయిల్‌గారిని ముందు మాట రాయమని అడిగాను. ఒప్పుకున్నారుగాని ఎంతకీ రాయడం లేదు. ఒకసారి కాకినాడ వచ్చి ఈ రోజు ఎలాగైనా మీ పీకల మీద కుర్చుందామని వచ్చాను అనంటే మీకా శ్రమ అక్కర్లేదు నా పీకల మీద నేనే కూర్చున్నా. అయినా కదలడం లేదు అన్నారు. ఒక దశలో ఈయన రాస్తాడా నే పుస్తకం వేస్తానా అనే సంశయం కూడా కలిగింది. కరుణ ముఖ్యం అన్న కవి కదా. ఒక మంచి రోజు ముందుమాట రాసి పంపారు. అది అందిన రోజున ఎన్నిసార్లు చదువుకున్నానో. ఇదంతా నా కవిత్వం గురించేనా ఇస్మాయిల్గారే రాశారా అని ఉబ్బితబ్బిబ్బయి పోయాను. అలా ‘మువ్వల చేతికర్ర’ను ముందుమాటతోనే వదిలేయలేదాయన. శీలా వీర్రాజుగారికి ఉత్తరం రాసి ముఖచిత్రం వేయమని కోరారు. అంతేనా? కాకినాడ మసీదు సెంటర్లో జిలానీ పాన్‌షాప్‌కు కాస్త ఎదురుగా వుండే శ్రీపతి ప్రెస్‌లో కంపోజింగ్‌కి యిచ్చారు. అప్పటికి కంప్యూటర్లు డి.టి.పి.లు గట్రా ఇంకా రాలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి ప్రింటింగ్ ప్రెస్ నుండి ఓ కుర్రాడు ైసైకిల్ వేసుకుని నాలుగు ఫారాలు తెచ్చేవాడు. ఫారానికి ఎనిమిది పేజీలు. వాటి ని ఎంతో ఓపికగా ప్రూఫ్ చూసేవారు. అందుకే ఇస్మాయిల్ గారి పుస్తకాల్లాగే నా పుస్తకంలోనూ పదానికి పదానికి మధ్య స్పష్టమైన జాగా వుంటుంది. ఇస్మాయిల్ లాంటి గొప్పకవి నా కవిత్వానికి ప్రూఫ్ రీడింగ్ చేశారంటే అది నేనూ నా కవిత్వమూ చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఎంత గొప్ప కవిత్వాన్ని సృజించిన ఆ మహానుభావుడి చేతివేళ్లు చేతుల్లోకి తీసుకొని కళ్ల కద్దుకుని, పాదాలకు నమస్కరించడం తప్ప ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పగలను. 1987 అక్టోబరు18న ఆంధ్ర విశ్వ విద్యాలయం తెలుగు శాఖా పక్షాన జరిగిన మువ్వల చేతికర్ర ఆవిష్కరణ సభలో ఇస్మాయిల్, వేగుంట మోహన ప్రసాద్ గార్లు మాట్లాడని అతిథులుగా హాజరయ్యారు. నా పుస్తకానికి ఇస్మాయిల్ గారితో పాటుగా ‘ఏ దారీ లేదే నాకీ జగాన’ అని ముందుమాట రాసిన మో గార్ని చూడటం అదే ప్రథమం. అప్పటి నుండి ఇస్మాయిల్గారితో వున్న కవిత్వానుబంధం ఆత్మీయ బంధంగా మారిపోయింది. 1991లో హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో నౌకరీలో కుదురుకున్నాక- అధికార భాషాసంఘం సభ్యునిగా ఇస్మాయిల్గారు హైదరాబాద్ వచ్చేవారు. బస ప్రభుత్వ అతిథి గృహంలో. ఇక చీకటి పడగానే పక్షులు చెట్టును చేరుకున్నట్టు కవులు, రచయితలు, అభిమానులతో కోలాహలంగా వుండేది. అందులో ఐ.ఎ.ఎస్ అధికారి గిర్గ్లాని, సి.ధర్మారావు, మంచిరాజు శ్యామలరావు, వెంకటరావు, స్మైల్, రంగారెడ్డి, నగ్నముని, విన్నకోట రవిశంకర్, సురేందర్‌రావు, కాశీ, సదాశివరావుగారు (ఈ జాబితా అసంపూర్తి) యిలా ఎంతో మంది ఎన్నో సాయింత్రాలను కవిత్వంగా వెలిగించారు. మిత్రుల సంభాషణల మధ్య ఆయన ఎక్కువగా శ్రోతగానే వుండేవారు. ఉండీ ఉండీ చివరికి ఒక సీమటపాకాయలాంటి మాట ముక్తాయింపుగా వొదిలేవారు. దాంతో వాతావరణం అంతా పగలబడి నవ్వుతుంది. ఒకసారి కొత్తగా వచ్చిన కవితా సంపుటాల గురించి చర్చకు వస్తే ‘ఆ గురుశిష్యులిద్దర్లో ఎవరో ఒక్కరే రాస్తే బాగుండును’ అన్నారు. ఇప్పుడున్న వాతావరణంలో ఆ పేర్లు చెప్పడం నాకంత శ్రేయస్కరం కాదు. నాకు తెలిసి ఆంధ్రదేశంలో ఉత్తరాలు రాయడం ఒక సాహిత్య సృజనగా మలిచినవారు ముగ్గురే ముగ్గురు. ఒకరు చలం, రెండోవారు సంజీవ్ దేవ్, మూడోవారు ఇస్మాయిల్. ఒకసారి ఆయన ఉత్తరం రాస్తూ ‘పాద నమస్కారాలు చేయించుకోడానికి మీ గురువుగారికి జెర్రిలాగా ఎన్ని పాదాలున్నాయేంటి?’ అని రాసారు. ఆ ఉత్తరం అందుకునే సమయానికి నా ఎదురుగా జర్నలిస్టు మిత్రుడు ఉండి ఈ ఉత్తరం అచ్చేస్తానని పట్టుకెళ్లాడు. తర్వాత ఆ వ్యాఖ్య ఎవరి గురించి చేశారో తెలిసికొని వెంటనే వెళ్లి తెచ్చుకున్నాను. ఒకసారి తులనాత్మక అధ్యయన కేంద్రంలో పొయిట్రీ వర్క్‌షాపు నిర్వహిస్తూ ఇస్మాయిల్ గారిని ఆహ్వానిస్తే ‘హైదరాబాద్‌లో స్మైల్ గారుంటారు. నేను ఉన్న రెండ్రోజులు ఆయన సంసారం చెయ్యకుండా మనతో వుంటారేమో కనుక్కోండి’ అని రాసారు. కవి సమ్మేళనాలు ఇష్టపడని ఇస్మాయిల్గారు నా ‘పెళ్లి-పుస్తకం’ కార్యక్రమం గురించి నాసర రెడ్డికి వుత్తరం రాస్తూ ‘కవి సమ్మేళనం పెడతానంటాడేమిటి శిఖామణి’ అని రాశారు. నాసరరెడ్డి ఇస్మాయిల్ గారిని కాకినాడలో మీ ఇంటికి ఎలా రావాలని అడిగాడో ఏమో... ‘చొక్కా మీద ఇస్మాయిల్, లచ్చిరాజు వీధి, కాకినాడ’ అని రాసుకొని పోస్టు బాక్స్‌లో కూచోండి అని రాశారు. ఇలాంటి ఉత్తరాలు మిత్రుల వద్ద వున్నాయి. సి.ధర్మారావు గారు బతికివుండగా ఇస్మాయిల్ గారి లేఖలు ప్రచురిద్దామని ప్రయత్నించారు గానీ కార్యరూపం దాల్చలేదు. వాడ్రేవు వరలక్ష్మిదేవి వంటి వారు ఆ పనికి పూనుకోవాలి. ఇస్మాయిల్ గారు వెళ్లిపోయిన సంవత్సరానికి కాబోలు సదాశివరావుగారు ఒక పున్నమిరాత్రి ఇస్మాయిల్ జ్ఞాపకాలను పంచుకుందామని కవులను తన ఇంటికి పిలిచారు. శివారెడ్డి, అబ్బూరి ఛాయాదేవివంటి పెద్దలతో సహా చాలామంది గుమిగుడాం! ఆ రాత్రి దాబా మించి ఆకాశంలోకి చూస్తే పున్నమి చంద్రుడులో నవ్వుతున్న ఇస్మాయిల్ గారు కన్పించారు. ‘వేసవి చంద్రుడు’ అని నేను రాసిన కవితలో ‘కాకినాడ చెట్టు కవి/ మేనిమేలిమి బంగారు ఛాయనూ/ గంటలకొద్ది ఆచరించే అతని స్నానక్రియనూ/ గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడనిపిస్తుంది/ బహుశా అతని స్నానపుగది సబ్బుగూటీలో వున్నది జాబిల్లి అనీ సాదాసీదా సబ్బు బిళ్ల కాదనీ’ అని రాసుకున్నాను. ఇస్మాయిల్‌గారి జ్ఞాపకం అప్పుడే స్నానం చేయించిన పసిపిల్లాడి అజ్ఞాత ప్రాకృతిక పరిమళం! - శిఖామణి, 9848202526