breaking news
shivaramireddy
-
కలుషిత రాజకీయాలు ప్రమాదకరం
హైదరాబాద్: నేటితరం రాజకీయ నాయకుల ప్రసంగాలు, విమర్శలు, వ్యవహార శైలితో రాజకీయాలు కలుషితమైపోయాయని, ఇది దేశానికి ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి గొప్ప నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని, ఒకరికి గౌరవం ఇచ్చి మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి అని కొని యాడారు. కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి సంతాప సభను ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నారాయణతో పాటు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్న కేశవరావు, సభ్యురాలు డాక్టర్ రజనీ, సీపీఐ శేరిలింగంపల్లి కార్యదర్శి కె.శ్రీశైలంగౌడ్‌తో పాటు పలువురు శివరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ చట్ట సభకు ఎన్నికైన తొలితరం ప్రజా ప్రతినిధుల్లో ఒకరైన శివరామిరెడ్డి నిస్వార్థ సేవలం దించి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. తాను మరణించే వరకు సీఆర్ ఫౌండేషన్‌కు, వృద్ధాశ్రమంలో ఉంటూ సేవలందించారన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ శివరామిరెడ్డి రైతాంగ సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. నేటితరం నాయకులందరికీ ఆదర్శ ప్రాయులని, ఉన్నత భావాలున్న గొప్ప వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించి పార్టీ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసుకోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ రా>ష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ శివరామిరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల సాధనకు ఉద్య మాలు నిర్మించాల్సి ఉందన్నారు. సంతాప సభలో శివరామిరెడ్డి కుటుంబ సభ్యులు, సీఆర్ ఫౌండేషన్, వృద్ధాశ్రమం సహచరులు పాల్గొన్నారు. -
పూజల పేరుతో మహిళల మోసం
మాదాపూర్: మాయమాటలు చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమణకుమార్ తెలిపిన వివరాలివీ.. మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు శివరామిరెడ్డి ఇంటికి ఈనెల 11వ తేదీన గుర్తు తెలియని ఇద్దరు మహిళలు వచ్చారు. ఇంట్లో ఉన్న శివరామిరెడ్డి కుటుంబసభ్యులను మాటల్లో పెట్టారు. సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తామని, బోనాల పండుగ కోసం బియ్యం, బెల్లం కానుకగా ఇవ్వాలని కోరారు. అలా మాయమాటలు చెప్పి ఇంట్లో ఉన్న రూ.76వేల నగదును పూజలో పెట్టించారు. తాము వెళ్లిపోయిన తరువాత తీసి చూడాలని చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత చూడగా పూజ సామగ్రిలో నగదు కనిపించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు.. ఓవ్యక్తి అందజేసిన సీసీ కెమెరా ఫుటేజి ఉపయోగపడింది. నిజామాబాద్ జిల్లాలోని తొర్లికొండ గ్రామానికి చెందిన రాసూరి కవిత(38), రాసూరి దేశమ్మ(25)లను అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌లో రెండు, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు నేరాలు చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. వీరి వద్ద నుంచి రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించారు.