breaking news
shepards
-
అన్ని జీవాలకు బీమా సదుపాయం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన జీవాలకే బీమా పథకం వర్తిస్తుండగా, ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని జీవాలకూ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులు సొంతంగా పెంచే జీవాలు రోడ్డు ప్రమాదాలు, ఇతర సందర్భాల్లో మరణిస్తే ఆయా పెంపకందారులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బీమా సదుపాయాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. శనివారం పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ రాంచందర్, విజయా డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు, టీఎస్ఎల్డీసీ సీఈవో మంజువాణి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవాల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ప్రమాదాలు, ఇతర కారణాలతో జీవాలు మరణిస్తే ఈ పథకం కింద జీవాన్ని కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అయితే, బీమా ప్రీమియం మొత్తంలో 80 శాతం ప్రభుత్వం చెల్లిస్తుందని, 20 శాతం పెంపకందారులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ పథకం అమలుకు సంబంధించిన అన్ని కసరత్తులు పూర్తి చేసి అక్టోబర్ 15వ తేదీ నుంచి జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయాల్లో బీమా కోసం దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో జీవాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి పశుసంవర్థక శాఖకు రావాల్సిన నిధుల సమాచారాన్ని 15 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. చేప పిల్లలు వేయకండి: విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, రిజర్వాయర్లకు వరద నీరు పోటెత్తుతోందని, ఈ సమయంలో చేప పిల్లలను విడుదల చేయడం వల్ల వరద నీటిలో కొట్టుకుపోతాయని, వరదలు తగ్గేంతవరకు నాలుగు రోజుల పాటు చేపపిల్లల సరఫరా నిలిపివేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, హైవేల వెంట విజయా డెయిరీ ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని, వాటికి అదనంగా ప్రతి జిల్లాలో 5–6 ఔట్లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డెయిరీ ఎండీ శ్రీనివాసరావును మంత్రి ఆదేశించారు. -
కదంతొక్కిన గొర్రెల కాపరులు
సమస్యల పరిష్కారంపై సర్కారు వివక్ష సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి గొర్రెల పెంపకందారుల ధర్నాలో రాష్ట్ర నేతలు డోలు, గొంగళ్లతో భారీ ర్యాలీ ముకరంపుర : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గొర్రెలపెంపకందారులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గొర్రెల పెంపకందారులు.. గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అంతకుముందు డోలుచప్పుళ్లు, గొంగళ్లతో సర్కస్‌గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెలు, మేకల పెంపకంవృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాల్వనర్సయ్య యాదవ్, అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారాం యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గొర్రెలు, మేకల పెంపకందారుల పట్ల సర్కారు వివక్ష చూపుతోందని ఆరోపించారు. బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, నాబార్డు ద్వారా ఎలాంటి షరతులు లేకుండా 80 శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు దాటిన గొల్ల, కుర్మలకు నెలకు రూ.3వేల పింఛన్ ఇవ్వాలన్నారు. వారి సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించి ఫెడరేషన్ ద్వారా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెల కొనుగోలు, షెడ్ల నిర్మాణానికి 50 శాతం సబ్సిడీపై రుణాలు ఇవ్వాలన్నారు. గొర్రెల విక్రయానికి మండలాలవారీగా మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి ప్రాథమిక సంఘానికి 25 ఎకరాల భూమి కేటాయించాలని, ఎక్స్‌గ్రేషియాను రూ.6లక్షలకు పెంచాలని సూచించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు అందించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నూనె అంజయ్య, జిల్లాప్రధాన కార్యదర్శి కటికరెడ్డి బుచ్చన్న, కన్నెబోయిన ఓదెలు, మహిళా సంఘ అధ్యక్షురాలు చెర్ల పద్మ, బీర్ల కనకయ్య, మేకల నర్సయ్య, పలుమారు మల్లేశ్, పొట్టాల హన్మంతు, సాయిల్ల రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.