అన్ని జీవాలకు బీమా సదుపాయం 

Insurance Policy For All Shepherds Says Talasani Srinivas Yadav - Sakshi

పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని వెల్లడి 

అక్టోబర్‌ 15 నుంచి అందుబాటులోకి దరఖాస్తులు 

ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం ద్వారా చెల్లింపు

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన జీవాలకే బీమా పథకం వర్తిస్తుండగా, ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని జీవాలకూ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులు సొంతంగా పెంచే జీవాలు రోడ్డు ప్రమాదాలు, ఇతర సందర్భాల్లో మరణిస్తే ఆయా పెంపకందారులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బీమా సదుపాయాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. శనివారం పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్‌ రాంచందర్, విజయా డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు, టీఎస్‌ఎల్‌డీసీ సీఈవో మంజువాణి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవాల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ప్రమాదాలు, ఇతర కారణాలతో జీవాలు మరణిస్తే ఈ పథకం కింద జీవాన్ని కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అయితే, బీమా ప్రీమియం మొత్తంలో 80 శాతం ప్రభుత్వం చెల్లిస్తుందని, 20 శాతం పెంపకందారులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ పథకం అమలుకు సంబంధించిన అన్ని కసరత్తులు పూర్తి చేసి అక్టోబర్‌ 15వ తేదీ నుంచి జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయాల్లో బీమా కోసం దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో జీవాలకు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి పశుసంవర్థక శాఖకు రావాల్సిన నిధుల సమాచారాన్ని 15 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు.

చేప పిల్లలు వేయకండి: విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, రిజర్వాయర్లకు వరద నీరు పోటెత్తుతోందని, ఈ సమయంలో చేప పిల్లలను విడుదల చేయడం వల్ల వరద నీటిలో కొట్టుకుపోతాయని, వరదలు తగ్గేంతవరకు నాలుగు రోజుల పాటు చేపపిల్లల సరఫరా నిలిపివేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, హైవేల వెంట విజయా డెయిరీ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని, వాటికి అదనంగా ప్రతి జిల్లాలో 5–6 ఔట్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డెయిరీ ఎండీ శ్రీనివాసరావును మంత్రి ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top