breaking news
sentence jail
-
జైల్లోనే సెంగార్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడికి బెయిల్ మంజూరు చేయడంతోపాటు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దని అధికారులకు తేలి్చచెప్పింది. ఐపీసీ ప్రకారం ఎమ్మెల్యేను ‘ప్రజాసేవకుడి’గా పరిగణించలేమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టింది. ఇది చట్టసభ సభ్యులకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుందన్నది.ఎమ్మెల్యే ప్రజాసేవకుడు కాదా? ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తోపాటు బాధితురాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సిందే. హైకోర్టు న్యాయమూర్తులు ఎంతో అనుభవజు్ఞలు, కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) నిర్వచనం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. చట్టం ప్రకారం ఒక కానిస్టేబుల్ ‘పబ్లిక్ సర్వెంట్’ అవుతారు. అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడు మాత్రం ప్రజా సేవకుడు కాదా? ఎమ్మెల్యేను మినహాయించడం సరైందేనా? చట్టసభ సభ్యులను దీని నుంచి మినహాయించడం సరైన ది కాకపోవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా ఒక దోషి లేదా అండర్ ట్రయల్ ఖైదీకి బెయిల్ ఇస్తూ కింది కోర్టు లేదా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పుడు అతడి వాదన వినకుండా ఆ ఉత్తర్వుపై స్టే విధించలేమని తెలియజేసింది. మరో కేసులో సెంగార్ దోషిగా తేలి, ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నాడని పేర్కొంది. ఈ నెల 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఉన్నావ్ కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నిలిపివేస్తున్నామని స్పష్టంచేసింది. బాధితురాలికి ప్రాణహాని ఉంది: తుషార్ సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘ఇది అత్యంత పాశవికమైన నేరం. ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్ల కంటే తక్కువ (15 ఏళ్ల 10 నెలలు). కేవలం ఏడేళ్ల జైలుశిక్ష పూర్తయిందన్న కారణంతో దోషికి బెయిల్ ఇవ్వడం సరికాదు. సవరించిన చట్టం ప్రకారం ఇలాంటి నేరాలకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘నేరం జరిగిన సమయానికి ఈ చట్ట సవరణ రాలేదు కదా! ఆ తర్వాత వచ్చిన సవరణలను పాత కేసులకు ఎలా వర్తింపజేస్తాం?’ అని ప్రశ్నించింది. దీనికి తుషార్ బదులిస్తూ.. ‘మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంతో పనిలేదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల దృష్టిలో బలమైన స్థానంలో ఉంటారు. ఎవరైనా సాయం కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారు. అలాంటి నమ్మకమైన స్థానంలో ఉండి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరం కచ్చితంగా తీవ్రమైన లైంగిక దాడి కిందకే వస్తుంది. ఆర్మీ ఆఫీసర్ విధుల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎలా శిక్షార్హుడో, ఎమ్మెల్యే కూడా అంతే’ అని వాదించారు. సెంగార్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ‘సెంగార్ ఇప్పటికే బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులోనూ దోషిగా తేలారు. ఈ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తి సెంగార్ బయటకొస్తే బాధితురాలికి, ఆమె కుటుంబానికి తీరని అన్యాయం జరు గుతుంది. ఆ బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెయిల్ రద్దు చేయాలి’ అని కోర్టును కోరారు. ఎల్.కె. అద్వానీ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఎంపీలు లేదా ఎమ్మె ల్యేలుగా పదవిలో ఉన్న వాళ్లను ప్రజా ప్రతినిధులుగానే పరిగణిస్తూ అప్పట్లో న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. సెంగార్ తరఫు న్యాయవాదుల వాదన సెంగార్ తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, ఎన్.హరిహరన్ వాదనలు వినిపించారు. ‘ట్రయల్ కోర్టు సెంగార్‌ను పబ్లిక్ సర్వెంట్‌గా పరిగణించడం వల్లనే జీవిత ఖైదు విధించింది. ఐపీసీలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనాన్ని తీసుకొచ్చి పోక్సో చట్టానికి ఆపాదించడం న్యాయం కాదు. ఒక చట్టంలోని నిర్వచనాన్ని మరో చట్టానికి వర్తింపజేయకూడదు’ అని సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. అలాగే సెంగార్‌కు బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్నాయని, టీవీల్లో కొందరు చర్చలు సాగిస్తున్నారని సెంగార్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి ఇరుపక్షాల వాదనలు తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్ కాదనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ను నిలిపివేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని వెల్లడించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది.అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో 2019 డిసెంబర్లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు(మరణించేదాకా జైలులోనే) విధించింది. మరోవైపు బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించాడు. ఈ కేసులోనూ సెంగాల్ దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నావ్ అత్యాచారం కేసుతోపాటు సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్ ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఉన్నావ్ రేప్ కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల విచారించింది. సెంగార్ చేసిన నేరం పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) కింద ‘తీవ్రమైన లైంగిక దాడి’ పరిధిలోనికి రాదని అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్ 21 ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధి ‘పబ్లిక్ సర్వెంట్’ నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. సెంగార్ ఇప్పటికే ఏడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు, జీవిత ఖైదును కూడా రద్దు చేస్తున్నట్లు ఈ నెల 23వ తేదీన తీర్పునిచ్చింది. -
మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష.. ఇంతకీ ఆమె చేసిన నేరం..?
సల్మా అల్-షెహబ్ అనే 34 ఏళ్ల మహిళకు సౌదీ అరేబియా కోర్టు 34 ఏళ్ల సుదీర్ఘ కారాగార శిక్ష విధించింది. అసమ్మతివాదులను ట్విటర్లో అనుసరించడంతో పాటు వారి పోస్టులను రీట్వీట్ చేశారన్న నేరారోపణలతో కఠిన శిక్ష వేసిందని ‘గార్డియన్’ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాదు 34 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం విధించింది. సౌదీ అరేబియా మహిళ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సల్మాకు సుదీర్ఘ జైలు శిక్ష విధించడం పట్ల అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆమెను విడుదల చేయాలని మానవ హక్కుల పరిరరక్షణ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అసలేం జరిగింది? బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న సల్మా అల్-షెహబ్‌ను 2021, జనవరి 15న సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. సెలవులకు స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆమెను నిర్బంధించారు. శాంతిభద్రతలకు విఘాతం, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇంటర్నెట్ను వినియోగించారన్న ఆరోపణలతో మొదట ప్రత్యేక ఉగ్రవాద కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా సోమవారం అప్పీల్ కోర్టు 34 సంవత్సరాల జైలు శిక్ష, 34 సంవత్సరాల ప్రయాణ నిషేధం విధిస్తూ తీర్పు చెప్పింది. ఓరల్, డెంటల్ మెడిసిన్‌లో నిపుణురాలైన సల్మా.. ప్రిన్సెస్ నౌరా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పైళ్లై, చిన్న వయసులో ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. Report I #SaudiArabia: 34 years sentence against the women's right activist #SalmaAlShehab 🔴 Read here: https://t.co/1S7sMV0gxY pic.twitter.com/ATjTREgxJM — ESOHR (@ESOHumanRightsE) August 16, 2022 సల్మా విడుదలకు డిమాండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్, యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఏఎల్క్యుఎస్టీ ఫర్ హ్యూమన్ రైట్స్ వంటి అనేక మానవ హక్కుల సంస్థలు ఈ తీర్పును ఖండించాయి. సల్మా అల్-షెహబ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ‘సల్మాను విడిపించాలని సౌదీ అధికారులను కోరుతున్నాం. ఆమె పిల్లల సంరక్షణకు, ఆమె చదువును పూర్తి చేయడానికి వీలు కల్పించేలా విముక్తి ప్రసాదించాల’ని ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మహిళా హక్కుల కార్యకర్తలకు సంఘీభావంగా ట్వీట్ చేయడం నేరం కాద’ని స్పష్టం చేసింది. In the #Saudi authorities’ longest prison sentence ever for a peaceful activist, the Specialised Criminal Court of Appeal on 9 August handed down terms totalling 34 years without suspension to women’s rights campaigner Salma al-Shehab. #SaudiArabiahttps://t.co/3bRLwqioec pic.twitter.com/fYgVrATNFX — ALQST for Human Rights (@ALQST_En) August 15, 2022 సుదీర్ఘ జైలు శిక్షపై అభ్యంతరాలు సోషల్ మీడియాలో పెద్దగా ఆదరణ లేనప్పటికీ సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ట్విటర్లో 2,597 మంది అనుసరిస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 159 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ‘అసమ్మతివాదులు ట్విటర్ ఖాతాలను అనుసరించడం, వారి ట్వీట్లను రీట్వీట్ చేయడం ద్వారా సమాజంలో చిచ్చు రేపడానికి, జాతీయ భద్రతను అస్థిరపరిచేందుకు కారణమయ్యారని’ ఆమెపై ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. షియా ముస్లిం కాబట్టే ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించారని నమ్ముతున్నట్టు యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ పేర్కొంది. సౌదీ అరేబియాలో మహిళల హక్కుల కోసం సల్మా గళమెత్తారు. స్త్రీలపై పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను జెడ్డాలో జూలై 15న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిసిన కొద్ది రోజుల తర్వాత సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు రావడం గమనార్హం. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి దారుణ హత్య కేసులో ప్రమేయంతో పాటు, అనేక మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ యువరాజుతో బైడన్ భేటీ కావడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. (క్లిక్: ఖషోగ్గి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం) -
డ్రంక్ అండ్ డ్రైవ్.. యువకుడికి జైలు
రామాయంపేట: మద్యం తాగి వాహనం నడిపిన (డ్రంక్ అండ్ డ్రైవ్) కేసులో యువకుడికి రూ. 5 వందల జరిమానాతోపాటు ఐదు రోజుల జైలు శిక్ష పడినట్లు స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్ తెలిపారు. నాగార్జునగౌడ్ గత నెల 28న రామాయంపేట వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా కామారెడ్డికి చెందిన ఎండీ మోసిన్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో యువకుడిని బుధవారం మెదక్ కోర్టుకు తరలించారు. నిందితుడికి రూ.500 జరిమానాతోపాటు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బల్జిత్సింగ్ తీర్పు చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు.


