breaking news
self immolation bid
-
నీళ్ల కోసం.. యువకుడి ఆత్మాహుతియత్నం
కావేరీ జలాల కోసం తమిళనాడులో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మన్నర్‌కుడి ప్రాంతానికి చెందిన సురేష్ అనే యువకుడు ఆత్మాహుతియత్నం చేశాడు. కావేరీ జలాల విషయంలో కర్ణాటక తమకు తీవ్ర అన్యాయం చేస్తోందంటూ నామ్ తమిళర్ కచ్చి అనే సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాడు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు వెంటనే మంటలు ఆర్పేసి.. అతడిని వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. తమిళనాడుకు కావేరి జలాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ చెన్నై రాజరత్నం స్టేడియం నుంచి ర్యాలీ బయల్దేరింది. నామ్ తమిళర్ కచ్చి డైరెక్టర్లు చేరన్, అమీర్ సహా వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగుతుండగానే.. సురేష్ ఒంటికి నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తమిళులు ఇలా ప్రాణత్యాగాలు చేయడం సరికాదని, మనం ప్రాణాలు నిలబెట్టుకుని మరీ జలాల కోసం పోరాడాలని ఈ సందర్భంగా నామ్ తమిళర్ కచ్చి నేత సీమన్ అన్నారు. -
అసెంబ్లీ వద్ద యువకుడి ఆత్మాహుతియత్నం
వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ప్రజాసంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీలో ఓ యువకుడు అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఆత్మాహుతియత్నం చేశాడు. పౌర హక్కుల సంఘాలకు చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడు పెట్రోలు పోసుకుని, నిప్పు అంటించుకునే ప్రయత్నం చేస్తుండగా మీడియా ప్రతినిధులు, పోలీసులు గుర్తించి వెంటనే అతడి చేతిలోంచి అగ్గిపెట్టె లాగేసుకున్నారు. భగత్ సింగ్ దేశం కోసం త్యాగం చేసినట్లుగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని రాజ్ కుమార్ చెప్పాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆగకుండా.. తాను చచ్చిపోతాననే చెప్పాడు. కాసేపు.. తన పేరు భగత్ సింగ్ అని కూడా అతడు అన్నట్లు తెలుస్తోంది. భ్రష్టుపట్టిన రాజకీయాల నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రాజ్ కుమార్ అంటున్నాడు. అతడు ఎవరో, ఎక్కడినుంచి వచ్చాడో తెలియలేదు. అతడి మాటలను చూసి, అతడి మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ముందునుంచి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసినా, అతడు మాత్రం భద్రతావలయాన్ని ఛేదించుకుని మరీ పెట్రోలు సీసా పట్టుకుని వెళ్లాడు. అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సీఆర్పీఎఫ్ లాంటి దళాలతో చాలా పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేశారు. డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. అయినా కూడా రాజ్ కుమార్ అసెంబ్లీ గేటుకు కేవలం 50 మీటర్ల దూరంలో ఆత్మహత్యాయత్నం చేశాడు.