breaking news
SCLT
-
ఈసారి డర్టీ40
♦ మొండిబకాయిలపై ఆర్బీఐ రెండో అస్త్రం ♦ 40 కంపెనీల జాబితా సిద్ధం ♦ తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు కంపెనీలు ♦ ఐవీఆర్సీఎల్, ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ, నాగార్జునా ఆయిల్, సోమా ♦ తెలుగు ప్రమోటర్‌కు చెందిన ఆర్చిడ్ ఫార్మా కూడా... ♦ ఎన్సీఎల్టీకి సమర్పిస్తారనే వార్తలతో కుప్పకూలిన షేర్లు ♦ ఇప్పటికే డిఫాల్టర్లుగా ప్రచారంలో పలు బడా సంస్థలు (సాక్షి, హైదరాబాద్ / అమరావతి) : రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీలపై దివాలా చట్టం ప్రయోగించడానికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 12 పెద్ద కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వగా తాజాగా మరో 40 కంపెనీలతో రెండో జాబితాను తయారు చేసినట్లు తెలియవచ్చింది. భారీగా అప్పుల్లో కూరుకుపోయి వరుస నష్టాలను నమోదు చేస్తున్న కంపెనీలకు చెందిన ఆస్తులను విక్రయించడం ద్వారా వాటి రుణాలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ అధికారమిచ్చింది. దీంతో బ్యాంకులు ఆర్బీఐ అనుమతి మేరకు ఆయా కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు దాఖలు చేస్తున్నాయి. తాజాగా రూపొందించిన జాబితాలో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు కలిసి 40 వరకు ఉండవచ్చని సమాచారం. ఈ నలభైలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగు కంపెనీలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న రెండు ఇన్ఫ్రా కంపెనీలు ఐవీఆర్సీఎల్, సోమా ఎంటర్‌ప్రైజెస్‌లతో పాటు నాగార్జునా ఆయిల్ రిఫైనరీ, శ్రీకాకుళంలో విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నించి చేతులెత్తేసిన ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రమోటర్ కె.రాఘవేంద్రరావు తమిళనాడు కేంద్రంగా నడిపిస్తున్న ఆర్కిడ్ కెమికల్స్ (ఇపుడు ఆర్కిడ్ ఫార్మాగా పేరు మార్చుకుంది) తదితర కంపెనీలున్నాయి. వీటి పేర్లన్నీ ఆర్బీఐ ద్వారా బ్యాంకులు ఎన్సీఎల్టీకి సిఫారస్సు చేసినట్లు మంగళవారం మార్కెట్లో వార్తలు షికారు చేయగా... ఆయా కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. అధిక ఖాతాలు ఎస్బీఐ వద్దే!! గతంలో ఆర్బీఐ విడుదల చేసిన 12 డిఫాల్టింగ్ కంపెనీలను చూస్తే... దాదాపు అన్ని కంపెనీలకూ ఐసీఐసీఐ ఎంతో కొంత రుణాలు మంజూరు చేసి ఉంది. తాజాగా ఆర్బీఐ జాబితాగా చెబుతున్న 35– 40 కంపెనీలకు గాను దాదాపు 25–26 కంపెనీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో నాగార్జునా ఆయిల్ రిఫైనరీ సుమారు రూ.4,000 కోట్ల మేర రుణాలు బకాయి పడగా, ఐవీఆర్సీఎల్ రూ.3,579 కోట్లు, సోమా ఎంటర్ప్రైజెస్ రూ.1,895 కోట్ల మేర బకాయిలు పడ్డాయి. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం ఐవీఆర్సీఎల్ షేరు ధర 13 శాతం నష్టపోయి రూ.4.65 వద్ద ముగిసింది. నాగార్జునా ఆయిల్ రిఫైనరీ 5.45 శాతం నష్టపోయి రూ. 3.45 వద్ద ముగిసింది. ఇక సోమా ఎంటర్ప్రైజెస్ అన్‌లిస్టెడ్ కంపెనీ. సోమా ఎంటర్‌ప్రైజెస్‌కు మాగంటి రాజేంద్ర ప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, మాగంటి అంకనీడు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆర్చిడ్ ఫార్మా షేరు సైతం దాదాపు 9 శాతం నష్టపోయి రూ.18.95 వద్ద ముగిసింది. ఉత్తమ్‌గాల్వా, రేణుకా షుగర్స్ కూడా!! ఈ రెండవ జాబితాలో ఉన్నట్లుగా కొత్తగా ప్రచారంలోకి వచ్చిన కంపెనీల్లో ఉత్తమ్ గాల్వా, కాస్టెక్స్ టెక్నాలజీస్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, రుచి సోయా, వీసా స్టీల్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, ఏసియన్ కలర్స్, ఇస్పాత్ కోటెడ్, యూనిటీ ఇన్ఫ్రా తదితర కంపెనీలున్నాయి. ఇక డిఫాల్టర్ల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, జిందాల్ స్టెయిన్లెస్, జయప్రకాష్ పవర్, అబాన్ ఆఫ్‌షోర్, శ్రీ రేణుక షుగర్స్ వంటి కంపెనీలున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం కంపెనీల అప్పుల విలువ ఎంతుందో తెలియాల్సి ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఉత్తమ్ గాల్వా, జయస్వాల్ నెకో, రుచిసోయా, జేపీ అసోసియేట్స్, ఉత్తమ్ స్టీల్ కంపెనీల షేర్లు 9 శాతానికిపైగా నష్టపోయాయి. ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ 14 శాతానికిపైగా పడిపోయింది. గత జూన్‌లో ఆర్బీఐ విడుదల చేసిన ‘డర్టీ డజన్’ ఎగవేతదార్ల రుణాల విలువ రూ.1.75 లక్షల కోట్లు. ఇది మొత్తం నిరర్థక ఆస్తుల్లో 25 శాతానికి సమానం. ఈ కంపెనీలను ఎన్సీఎల్టీకి సిఫార్సు చేసిన తర్వాత రుణాలిచ్చిన బ్యాంకులు లిక్విడేషన్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను 180 రోజుల్లో సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ గడువును 270 రోజుల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది. -
టాటా సన్స్ ఈజీఎమ్‌కు లైన్ క్లియర్
ముంబై: టాటా సన్స్ కంపెనీ ఈ నెల 6న నిర్వహించతలపెట్టిన అత్యవసర సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. డైరెక్టర్ల బోర్డ్ నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడానికి టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్.. ఈ నెల 6న ఈ ఈజీఎమ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈజీఎమ్పై స్టే విధించాలని కోరుతూ సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటీషన్‌ను స్వీకరించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) తిరస్కరించింది. ఈ విషయాన్ని గత విచారణలోనే నిర్ణయించామని టాటా సన్స్ ఈజీఎమ్‌కు ఎలాంటి అడ్డంకులు లేవని ఎన్సీఎల్టీ ధర్మాసనం పేర్కొంది.