breaking news
science group
-
సైన్స్‌లో సగం సిలబస్ ప్రాక్టికల్స్‌కే!
* ఇంటర్ సైన్స్ గ్రూపుల్లో అమలు చేయాలని సిలబస్ కమిటీ ప్రతిపాదన * మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పూర్తిగా ఒకే సిలబస్ * ఇతర గ్రూపుల్లో 70 శాతం కామన్ కోర్ సిలబస్‌కు చర్యలు * వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లోని సైన్స్ గ్రూపుల్లో 50 శాతం సిలబస్‌ను ప్రాక్టికల్స్‌కే కేటాయించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్ సిలబస్ సమీక్ష కమిటీ అభిప్రాయపడింది. జాతీయ స్థాయి విద్యా సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్, సీబీఎస్ఈ విద్యాసంస్థల్లోని 10+2 విధానంలో ఉమ్మడి (కామన్ కోర్) సిలబస్ ఉండేలా చర్యలు చేపట్టాలని తీర్మానించింది. అయితే సైన్స్ గ్రూపులకు చెందిన సబ్జెక్టు (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)ల్లో మాత్రం 100 శాతం కామన్ కోర్ సిలబస్ (అన్ని రాష్ట్రాల్లో ఒకేలా) ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఇందులో 50 శాతం పాఠ్యాంశాలు రాత పరీక్షల కోసం ఉండాలని, మరో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ థియరీకి అనుగుణంగా ఉందని, దాన్ని మార్చాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, సీబీఎస్ఈ ప్రతినిధులతో కూడిన కమిటీ ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైంది. సిలబస్ సమీక్ష కమిటీ కన్వీనర్, రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు జమ్మూకశ్మీర్ ఇంటర్ బోర్డు చైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్ అసానో సెఖోస్, ఐసీఎస్సీ ప్రతినిధులు కల్నల్ శ్రీజిత్, శిల్పిగుప్తా, ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు రంజనా అరోరా, సీబీఎస్ఈ అదన పు డెరైక్టర్ సుగంధ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్స్ గ్రూపులతోపాటు ఇతర గ్రూపులు, సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. మిగతా 30 శాతం సిలబస్‌ను ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్ర మానవ వనరుల శాఖకు పంపారు. ఇతర గ్రూపుల్లోనూ 90 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండాలని... 5 నుంచి 10 శాతం వరకే మార్చుకొనేందుకు అవకాశం కల్పించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మొత్తంగా కామన్ కోర్ సిలబస్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. -
209 సీట్లు ఖాళీ
నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : కంజర గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో సీట్లు మిగిలిపోతున్నాయి. సైన్స్ గ్రూప్‌లు లేకపోవడమే ఇందుకు కారణం. కంజరలో రూ. 9 కోట్లతో గురుకుల పాఠశాల, కళాశాల భవనాన్ని నిర్మించారు. అప్పటివరకు నిజామాబాద్‌లోని కోటగల్లిలో కొనసాగుతున్న ఈ పాఠశాలను 2013లో నూతన భవనంలోకి మార్చారు. 1,300 మంది విద్యార్థినులు చదువుకోవడానికి వీలుగా వసతులు కల్పించారు. అయితే ఈ పాఠశాల, కళాశాలకు 640 సీట్లను మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది 431 మంది మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. దీంతో 209 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఐదో తరగతినుంచి పదో తరగతి వరకు 315 మంది విద్యార్థులున్నారు. ఆయా తరగతులన్నింటిలో కలిపి 165 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ గురుకులంలో సీఈసీ, హెచ్ఈసీ మాత్రమే ఉన్నాయి. సైన్స్ గ్రూప్‌లు లేవు. దీంతో ఈ పాఠశాలలో చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని, అందువల్లే సీట్లు మిగిలిపోతున్నాయని తెలుస్తోంది. సీఈసీ ప్రథమ సంవత్సరంలో 40 సీట్లకుగాను 31 మంది విద్యార్థినులే ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 40 సీట్లకు గాను 37 మంది విద్యార్థినులు చదువుతున్నారు. హెచ్ఈసీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రథమ సంవత్సరంలో 19 మంది, ద్వితీయ సంవత్సరంలో 29 మంది విద్యార్థులే ఉన్నారు. ప్రథమ సంవత్సరంలో 21, ద్వితీయ సంవత్సరంలో 11 సీట్లు మిగిలిపోయాయి. సైన్స్ గ్రూప్‌లు ఉండి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గురుకులంలో సైన్స్ గ్రూప్‌లను ప్రారంభించాలని వారు కోరుతున్నారు. సైన్స్ గ్రూప్‌లు లేకే.. గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నాం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనూ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగుతోంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే తెలుగు మాధ్యమంలో చెబుతున్నాం. సైన్స్ గ్రూపులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఈ గురుకులంలో చేరడం లేదు. -సింధు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్