breaking news
SBFC
-
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీవో కుదింపు
ముంబై: ఎన్బీఎఫ్సీ.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ గతేడాది నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది. -
చిట్ ఫండ్ కంపెనీలపై జీఎస్టీ భారం మోపొద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక సేవలతో చేరువైన నమోదిత చిట్ ఫండ్ కంపెనీలపై జీఎస్టీ భారం మోపొద్దని ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ చిట్ ఫండ్స్ (ఏఐఏసీఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. పన్ను పెరిగితే కంపెనీల మనుగడ ప్రశ్నార్థకమని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టి.ఎస్.శివరామకృష్ణన్ ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘100 ఏళ్లకుపైగా దేశంలో సామాన్యులకు ఆర్థిక సేవలందిస్తున్న పరిశ్రమ ఇది. ట్యాక్స్ విషయంలోనైనా చిట్ ఫండ్ సంస్థలను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) కింద పరిగణించాలి. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలపై సర్వీస్ ట్యాక్స్ 5 శాతం మించడం లేదు. అదే చిట్ ఫండ్ కంపెనీలు 15 శాతం చెల్లిస్తున్నాయి. జీఎస్టీ అమలైతే ఈ పన్ను మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ భారం కస్టమర్లపై పడే అవకాశమూ లేకపోలేదు’ అని వివరించారు. చిట్ ఫండ్ యాక్ట్–1982కు సవరణ జరగాలన్నారు. పోంజీ స్కీములతో జాగ్రత్త.. అధిక కమీషన్ ఆశజూపే వ్యక్తులు, కంపెనీలకు సామాన్యులు దూరంగా ఉండాలని అసోసియేషన్ సలహాదారు, మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్ సూచించారు. సమస్యల్లా నమోదు కాని చిట్ కంపెనీల నుంచేనని చెప్పారు. స్థానికంగా ప్రభుత్వ శాఖలే వీటికి అడ్డుకట్ట వేయాలన్నారు. ‘ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నమోదిత చిట్ కంపెనీలు పారదర్శకంగా వ్యవహరిస్తున్నాయి. చిట్ కంపెనీల వడ్డీ 1 శాతంలోపే ఉంటోంది. అవసరానికి ఆదుకునే సాధనమైన చిట్‌ను సామాన్యులు పొదుపుగా భావిస్తారు. ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నాం. జీఎస్టీ పేరుతో ప్రజల పొదుపుపై పన్ను భారం ఉండొద్దు. ఇదే జరిగితే కస్టమర్లు ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు ఆర్థిక సహాయం కోసం వెళ్తారు. నెలకు 10 శాతందాకా వడ్డీ తీసుకునే వ్యాపారులూ ఉన్నారు. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని అన్నారు. దేశవ్యాప్తంగా 30,000 పైచిలుకు నమోదిత చిట్ కంపెనీలు ఉన్నాయి. వీటి వార్షిక టర్నోవరు రూ.40,000 కోట్లు దాటింది.