breaking news
sandals protest
-
నా చెప్పులెక్కడ..?
జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాతా శిశు ఆస్పత్రి నిర్వహణ విమర్శల పాలవుతోంది. చిన్నారుల తారుమారు, బెడ్స్ కేటాయించకుండా రోగులను నేలపై పడుకో బెట్టడం, ఓ రోగిని ఆస్పత్రి నుంచి బయటకు పంపడం, ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటుకు తరలించడం లాంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాతా శిశు ఆస్పత్రి సిబ్బంది.. రోగులను తరలించే స్ట్రెచర్‌పై చెప్పులు తరలిస్తూ మరో వివాదంలో చిక్కుకున్నారు. జగిత్యాల మాతాశిశు ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు చెప్పులు విప్పేందుకు సరైన షూ ర్యాక్స్, సెల్ఫులు, సరైన స్థలం కేటాయించలేదు. దీంతో రోగులు, వారి సహాయకులు, బంధువులు తమకు తోచిన చోట పాదరక్షలు విడిచి లోనికి వెళ్తున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వారి చెప్పులను స్ట్రెచర్‌పై తరలించి ఆస్పత్రి ఆవరణలో కుప్పలుగా పోస్తున్నారు. రోగులను పరామర్శించి వచ్చేసరికి చెప్పులు కనబడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో పోసిన చెప్పులను కుక్కలు కొరికేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కాగా, రోగులను తరలించేందుకు వినియోగించే స్ట్రెచర్‌ను చెప్పులు తరలించేందుకు వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
20 వేల చెప్పులతో నిరసన
పారిస్: భూతాపోన్నతి (క్లైఫై)పై పారిస్‌లో ఓ పక్క ప్రపంచ దేశాధినేతల సమావేశంలో వాడివేడిగా చర్చలు కొనసాగుతుంటే మరోపక్క భూతాపోన్నతికి పెట్టుబడిదారి దేశాలే కారణమంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. క్లైఫైపై ఎప్పుడు, ఎక్కడ సదస్సులు, సమావేశాలు జరిగినా ప్రపంచ పర్యావర పరిరక్షణ కోసం కృషిచేసే స్వచ్ఛంద సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తుంటాయి. ఈసారి కూడా అవాజ్ అనే ఆన్లైన్ ఆర్గనైజేషన్ పారిస్‌లో సోమవారం ప్రారంభమైన భూతాపోన్నతి సమావేశాలకు రెండు లక్షల మందితో నిరసన తెలియజేసేందుకు ముందుగానే రంగం సిద్ధం చేసుకున్నది. అయితే పారిస్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకొని 20 వేల చెప్పులతో వినూత్నంగా నిరసన తెలిపింది. నేడు 175 దేశాల్లో అగ్రరాజ్యాల కర్బన ఉద్గారాలకు వ్యతిరేకంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నాయి. శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పాలని, పునరుత్పత్తి ఇంధనాలను, ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాలని స్వచ్ఛంద సంస్థలు అగ్రదేశాలను డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనాలతో పాటు భారత్‌కు కూడా తన కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలని అవాజ్ ఆర్గనైజేషన్ కోరుతోంది.