ఆ ఆఖరి వ్యక్తీ కన్ను మూశారు...
టెల్ అవీవ్: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు సృష్టించిన మారణహోమానికి సాక్షి, పోలండ్‌లో నాజీలు ఏర్పాటు చేసిన ట్రెబ్లింకా కాన్సెంట్రేషన్ క్యాంప్‌లో జరిగిన సామూహిక జననహననానికి ప్రత్యక్ష సాక్షి, ఆ క్యాంప్ నుంచి ప్రాణాలతో తప్పించుకుని బతికి బట్టకట్టిన కొంత మందిలో ఆఖరివాడు... సామ్యూల్ విల్లెన్‌బర్గ్ మరణించారు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలోని తన ఇంట్లో శుక్రవారం నాడు కన్ను మూశారు. ఆయనకు 93 ఏళ్లు.
1943లో ట్రెబ్లింకా క్యాంపులో జరిగిన తిరుగుబాటుకు విల్లెన్‌బర్గ్ నాయకత్వం వహించారు. ఆయన వెంట క్యాంపు నుంచి దాదాపు 300 మంది తప్పించుకోగా, అందులో నాజీల ఎదురు కాల్పుల్లో రెండువందల మంది మరణించగా, విల్లెన్‌బర్గ్ సహా వంద మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈసందర్భంగా విల్లెన్‌బర్గ్ కాలికి కూడా బుల్లెట్ గాయం అయింది. అప్పటికి విల్లెన్కు 20 ఏళ్ల వయస్సు.
1942లో నాజీ సైనికులు వందలాది మంది ఖైదీలతోపాటు విల్లెన్ను ట్రెబ్లింకా కాన్సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించారు. విల్లెన్ యూదు జాతీయుడు అయినప్పటికీ అలా కనిపించకపోవడం, తాను తాపీ మేస్త్రీనంటూ చెప్పడం వల్ల ఆయన బతికిపోయారు. ఆయనతోపాటు తీసుకొచ్చిన వందలాది మందిని ఒంతుల వారిగా గ్యాస్ చేంబర్స్ (విషవాయువు గదులు)లోకి పంపించి అమానుషంగా చంపేశారు. విల్లెన్, మరికొంత మంది యువకులు క్యాంప్ మెయింటెనెన్స్ పనులు అప్పగించారు. జర్మన్ కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో 8, 75,000 మందిని చంపినట్లు వాషింఘ్టన్లోని ‘హోలోకాస్ట్ మెమోరియల్ అండ్ మ్యూజియం’ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
నాజీ సైనికుల నుంచి వార్సాను విముక్తి చేయడం కోసం 1944లో జరిగిన యుద్ధంలో విల్లెన్ పాల్గొన్నారు. 1950లో ఇజ్రాయెల్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నాజీల జనన హననానికి సంబంధించిన ఛేదు జ్ఞాపకాలను తన హైస్కూల్ విద్యార్థులతో పంచుకునేందుకు అప్పుడప్పుడు పోలండ్, ట్రెబ్లింకా సందర్శించేవారు. ఆయన తన జ్ఞాపకాలను అక్షరబద్ధం కూడా చేశారు. ఆయన తన జ్ఞాపకాలను తోటి ప్రజలతో పంచుకోవడమే ప్రధాన వృత్తిగా పెట్టుకొని బతికారు. చివరి శ్వాస విడిచేవరకు ఆయనకు ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి.